మోసపోతారు.. జాగ్రత్త!
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:11 AM
Some agents' network in the name of foreign jobs విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. జిల్లాలోని చాలా పట్టణాల్లో యువతకు శిక్షణనిచ్చి విజిట్ వీసాపై విదేశాలకు పంపుతున్నారు. అక్కడికి వెళ్లాక తాత్కాలిక వీసాలు ఇప్పిస్తామని చెప్పి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అక్కడకు వెళ్లాక మోసాలు జరుగుతుండడం, అనారోగ్య సమస్యలు తలెత్తుండడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
విదేశీ ఉద్యోగాల పేరిట కొందరు ఏజెంట్ల వల
అరకొర శిక్షణ.. విజిట్ వీసాతో పంపించి..
రూ.లక్షలు వసూలు చేస్తున్న వైనం
జిల్లావాసులకు విదేశాల్లో నరకయాతన
ఇటీవల ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన 8 మంది యువకులు ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లారు. ఓ నిర్వాహక సంస్థ మస్కట్‌లో ఉన్నతమైన ఉద్యోగమని చెప్పి.. వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసింది. తీరా అక్కడకు వెళ్లాక.. బోట్లను శుభ్రం చేసే పనిలో పెట్టారు. వెట్టిచాకిరీ చేయించడమే కాకుండా తక్కువ జీతం ఇవ్వడంతో ఆ యువకులు ఇబ్బందులు పడ్డారు. తాము మస్కట్‌లో ఉండలేమంటూ.. కుటుంబ సభ్యులకు గోడును విన్నవించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో వారిని స్వస్థలాలకు తెప్పించారు.
ఇచ్ఛాపురం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. జిల్లాలోని చాలా పట్టణాల్లో యువతకు శిక్షణనిచ్చి విజిట్ వీసాపై విదేశాలకు పంపుతున్నారు. అక్కడికి వెళ్లాక తాత్కాలిక వీసాలు ఇప్పిస్తామని చెప్పి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అక్కడకు వెళ్లాక మోసాలు జరుగుతుండడం, అనారోగ్య సమస్యలు తలెత్తుండడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లా నుంచి ఈ-మైగ్రేట్ (ఉపాధి, విద్య, ఉద్యోగం నిమిత్తం ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లడం) ద్వారా విదేశాలకు వెళ్లిన వారిని పరిశీలిస్తే.. ఏటా ఐదారు వందల మందికిపైగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే విదేశాలకు వెళ్లినవారు చాలామంది నరకం చూస్తున్నారు. అక్కడ కంపెనీల ప్రతినిధులు 14గంటలు పనిచేయిస్తున్నారు. చెప్పినంత జీతం కూడా ఇవ్వడం లేదు. తరచూ వేతనాలు నిలిపివేయడం, పాస్‌పోర్టులు యజమానులు వద్దే ఉంచుకోవడం, చిన్న గదుల్లో గుంపులుగా నివసించడం వంటి కారణాలతో జిల్లా నుంచి వెళ్లినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాల్లో పని ఒత్తిడి తట్టుకోలేక, వాతావరణ పరిస్థితులు అనుకూలించక కొంతమంది తిరిగి వచ్చినవారు ఉన్నారు. అక్కడ పరిశ్రమల్లో కనీస భత్రతా చర్యలు చేపట్టకపోవడంతో చాలామంది ప్రమాదాల బారినపడుతుంటారు. కొందరు చనిపోతుంటారు. అటువంటి సమయంలో మృతదేహాలను స్వస్థలాలకు తెప్పించడం కుటుంబ సభ్యులకు కత్తిమీద సాములా మారుతోంది.
ఉద్దానం నుంచి అధికం..
జిల్లాలో ఉద్దానం ప్రాంతం నుంచి నిరుద్యోగ యువత ఎక్కువగా విదేశాలకు వెళుతుంటారు. భవన నిర్మాణంతో పాటు పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తుంటారు. సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం, కంచిలి మండలాల యువకుల్లో చాలామంది పదో తరగతి వరకూ చదవడం.. వెల్డర్, ఫిట్టర్, ఫ్యాబ్రికేటర్‌గా శిక్షణ తీసుకోవడం.. తరువాత ఉపాధి బాట పట్టడం పరిపాటిగా మారింది. గతంలో నైపుణ్యం చూసి.. సదరు కంపెనీలు తమకు విదేశాల్లో ఉండే పరిశ్రమలకు పంపించేవి. విమాన టిక్కెట్లతోపాటు వీసా, వసతి సమకూర్చేవి. దీంతో విదేశాల్లో పనిచేయడం లాభసాటిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అంతటా బ్రోకర్ వ్యవస్థ నడుస్తోంది. మేన్ పవర్ ఏజెన్సీలు, శిక్షణ సంస్థల మాటున విదేశీ పరిశ్రమల్లో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎంపిక చేసినందుకు కమీషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా బోగస్ కంపెనీల పేరుతో ఇంటర్వూలు నిర్వహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇచ్ఛాపురంలో బోగస్ సంస్థలు వెలుస్తున్నాయి. నిర్వాహకులు స్థానికంగానే అభ్యర్థులకు వెల్డింగ్‌లో అరకొర శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బోగస్ సంస్థలపై పోలీసులు, అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. మోసగిస్తున్న దళారులపై కఠినచర్యలు తీసుకోవాలి.
జిల్లా నుంచి విదేశాలు వెళ్లిన వారి సంఖ్య
------------
2019లో 1344
2020లో 350
2021లో 864
2022లో 861
2023లో 1129
2024లో 552
2025లో 400