చేయి తడపాల్సిందే!
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:12 PM
నరసన్నపేటలో కొందరు సివిల్ సప్లైస్ శాఖ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
- కొందరు సివిల్ సప్లైస్ శాఖ అధికారుల చేతివాటం
- హోటళ్లు, దాబాల నుంచి అక్రమ వసూళ్లు
- పీడీఎస్ బియ్యం వ్యాపారుల నుంచి ప్రతి నెలా మామూళ్లు
- మిల్లర్ల నుంచి ఉగాదికి భారీగా నజరాన
- అలాంటిదేమీ లేదంటున్న తహసీల్దార్
- నరసన్నపేట మండలం జమ్ము జంక్షన్ వద్ద ఉన్న ఒక దాబా యజమాని డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ తీసుకువచ్చాడు. ఆ సిలిండర్‌ను సివిల్ సప్లయ్‌శాఖ అధికారి పట్టుకున్నారు. 6ఏ కేసు నమోదు చేస్తామని బెదిరించారు. దాబా యజమాని ఆ అధికారి కాళ్లు వేళ్లు పట్టుకోగా.. ఒక వ్యాపారి వచ్చి మధ్యవర్తిత్వం వహించాడు. దాబా యజమాని నుంచి రూ.3వేలు తీసుకొని ఆ అధికారికి ఇచ్చాడు.
- నరసన్నపేట పట్టణం జగన్నాథపురంలో ఒక వ్యాపారి భారీగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేస్తున్నాడు. ఆ వ్యాపారి నుంచి నెలనెల అధిక మొత్తంలో మామూళ్లు అందుతుండడంతో అతని వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి.
- ఇటీవల నరసన్నపేట మెయిన్ రోడ్డులోని ఒక టిఫిన్ షాపుపై అఽధికారులు దాడులు చేసి మూడు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమానిపై కేసు నమోదు చేశారు. అయితే కేసు తీవ్రత తగ్గిస్తామని.. అందుకు కొంత ఖర్చు అవుతుందని చెప్పి అధికారులు మంతనాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నరసన్నపేట, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో కొందరు సివిల్ సప్లైస్ శాఖ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. హోటళ్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లతో పాటు మిల్లర్ల నుంచి భారీస్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది సీఎంఆర్ విధానంలో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. ఈ సమయంలో కొందరు మిల్లర్లు అవకతవకలకు పాల్పడ్డారు. వీరికి కొందరు సివిల్ సప్లైస్ అధికారులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిఫలంగా ఇటీవల ఉగాదికి భారీ మొత్తంలో మిల్లర్ల నుంచి కలెక్షన్లకు పాల్పడ్డారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం సామర్థ్యం మేరకు మిల్లర్ల నుంచి ఓ ఉద్యోగి నగదు వసూలు చేసి సంబంధిత శాఖ అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సివిల్ సప్లైస్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా నెలనెలా పీడీఎస్ దుకాణాలను తనిఖీ చేసే సమయంలో డీలర్ల నుంచి కూడా భారీగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక గ్యాస్ గోడౌన్‌లను తనిఖీలు చేసే సమయంలో జిల్లాస్థాయి అధికారులకు ఇవ్వాలని చెప్పి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల నరసన్నపేట పట్టణంలో ఒక గ్యాస్ గిడ్డంగిలో అధికారులు తనిఖీ చేశారు. కొన్ని సిలిండర్లు అదనంగా ఉండటంతో ఆ గ్యాస్ ఏజెన్సీని కొద్దిరోజులు నిలుపుదల చేశారు. ఈ కేసు వ్యవహారంలో కూడా రూ.లక్షల్లో చేతులు మారినట్లు సమాచారం. ఈ విషయమై తహసీల్దార్ ఆర్.సత్యనారాయణను వివరణ కోరగా.. ‘సివిల్ సప్లైస్ విభాగంలో అక్రమ వసూళ్లు చేపడుతున్నట్లు నా దృష్టికి రాలేదు. హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగించరాదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే దాడులు చేయాలని సివిల్ సప్లైస్ అధికారులకు ఆదేశించాం.’ అని తెలిపారు.