యోగా సందడి
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:53 PM
‘Yogandhra-2026’ celebrations రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు జిల్లా సన్నద్ధమవుతోంది. ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ నెల 21 వరకు పల్లె నుంచి జిల్లాస్థాయి వరకు 14 రోజులపాటు ముమ్మర ప్రచారం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ 1128 ద్వారా సమగ్ర మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది.
11న మత్స్యకారులతో ప్రత్యేక ప్రదర్శన
16న డచ్ బిల్డింగ్, 19న శ్రీకూర్మం ఆలయంలో ఘనంగా ఏర్పాట్లు
విద్యాసంస్థల్లో రోజూ గంటపాటు సాధన
జిల్లాస్థాయి విజేతలకు అమరావతిలో సీఎం బృందంతో పాల్గొనే అవకాశం
శ్రీకాకుళం, జూన్ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు జిల్లా సన్నద్ధమవుతోంది. ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ నెల 21 వరకు పల్లె నుంచి జిల్లాస్థాయి వరకు 14 రోజులపాటు ముమ్మర ప్రచారం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ 1128 ద్వారా సమగ్ర మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందిని ఈ యోగా దినోత్సవంలో భాగస్వాములను చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సమాజంలోని అన్ని వర్గాలను యోగా పట్ల ఆకర్షితులను చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 28 విభిన్న థీమ్‌లతో (రోజుకు రెండు చొప్పున) ప్రత్యేక యోగా ప్రదర్శనలు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న మన జిల్లాకు ‘మత్స్యకారులు’ థీమ్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 11న జిల్లాలో మత్స్యకారుల భాగస్వామ్యంతో ఈ ప్రత్యేక యోగా ప్రదర్శన జరగనుంది.
డచ్ బిల్డింగ్, శ్రీకూర్మంలో...
యోగాతోపాటు పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో జిల్లాలోని ప్రసిద్ధ ప్రాంతాల్లో మాస్ యోగా సెషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 16న జిల్లాలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడం డచ్ బిల్డింగ్ వద్ద విశేషంగా యోగా ప్రదర్శన జరగనుంది. అలాగే 19న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం ఆలయ ప్రాంగణంలో పవిత్ర వాతావరణంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
విద్యార్థులకు రోజూ గంట యోగా..
ప్రచారంలో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రతిరోజూ విధిగా ఒక గంటపాటు విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి యోగాపై అవగాహన కల్పించడంతో పాటు, ఆసక్తి ఉన్నవారిని వెబ్ అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేయనున్నారు.
విజేతలకు అమరావతి పిలుపు
జిల్లావ్యాప్తంగా ఈ నెల 20 వరకు వివిధ స్థాయిల్లో యోగా పోటీల కోలాహలం నెలకొననుంది. ఈ నెల 7-9 తేదీల్లో గ్రామ, వార్డు స్థాయిలో, 10-12 వరకు మండల స్థాయిలో, 14-16 తేదీల్లో జిల్లాస్థాయిలో ఈ పోటీలు జరుగుతాయి. సోలో యోగా, ప్రాణాయామం, సింక్రోనైజ్డ్ గ్రూప్ యోగాతో పాటు.. యోగా క్విజ్, స్లోగన్, వ్యాసరచన, షార్ట్‌ఫిల్మ్, ఫొటోగ్రఫీ వంటి విభాగాల్లో పోటీలు ఉంటాయి. జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలను అమరావతికి తీసుకెళ్లి, ఈ నెల 21న ముఖ్యమంత్రితోపాటుగా జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొనే అద్భుత అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమాల పర్యవేక్షణకు కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ వైస్-చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. జిల్లాస్థాయి కమిటీలు, అలాగే మండల, గ్రామస్థాయి కమిటీలు పర్యవేక్షించనున్నాయి.
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంతోపాటు మానసిక ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకుని ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమాల్లో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని కార్గిల్‌పార్కులో నూతనంగా నిర్మించిన యోగ ప్లాట్‌ఫామ్‌పై ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఘనంగా సాగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జ్యోతిప్రజ్వలన చేసి శిబిరాలను ప్రారంభించారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారీస్ సంస్థల ఆధ్వర్యంలో కామన్ యోగా ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు, యోగా సాధకులతో కలిసి ఆసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా విస్త్రృతంగా శిక్షణ శిబిరాలు, పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 21న నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 1500 మందితో భారీ ఎత్తున మెగా యోగా ప్రదర్శన ఉంటుంది. ప్రజలందరూ ‘యోగాంధ్ర’ యాప్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాల’ని కోరారు. కార్గిల్ పార్కులో ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. ఉత్సాహంతో యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రధానమంత్రి యోగా సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో డీపీవో స్వరూపారాణి, డీఆర్వో విశ్వేశ్వరరావు, జిల్లా ఆయుష్ అధికారి ఉత్తమ్ రాజ్ రాణా, జెడ్పీ సీఈఓ వెంకట్రామన్, యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, వివిధ యోగా సంస్థల ప్రతినిధులు, సాధకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.