Share News

నాడు వెలవెల.. నేడు కళకళ

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:10 AM

Lush and green with the Madanagopala Sagaram ఒకప్పుడు వర్షాలు పడినా పంటలు పండని మెట్టభూములు అవి. కానీ, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోయినా ఆ భూములు వరి నాట్లతో కళకళలాడుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ నీరు లేక వెలవెలబోయిన చెరువుల్లో సైతం నేడు జలకళ సంతరించుకుంది. దీనికి కారణం మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం.

నాడు వెలవెల.. నేడు కళకళ
గతంలో నీరు లేక వెలవెలబోయిన కిట్టాలపాడు చెరువు.. ప్రస్తుతం కిట్టాలపాడు చెరువులో జలకళ

  • మదనగోపాలసాగరం ఎత్తిపోతలతో సస్యశ్యామలం

  • మెట్ట భూముల్లో సిరులు

  • చెరువులకు జలకళ

  • రైతుల్లో ఆనందం

  • టెక్కలి రూరల్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి):

  • టెక్కలి మండలం కొల్లివలస గ్రామానికి చెందిన కొసంటి అప్పలస్వామికి సుమారు రెండు ఎకరాల సొంత భూమి ఉంది. మరో నాలుగు ఎకరాల వరకు కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం ద్వారా చుక్కనీరు రాలేదు. దీంతో సాగునీరు అందక పంటలు పండక అప్పులు పాలయ్యాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎత్తిపోతలను బాగుచేసి నీరు అందిస్తుండడతో ఏడాదికి రెండు పంటలు పండించి అప్పులు తీరుస్తున్నట్లు అప్పలస్వామి చెబుతున్నాడు.

  • టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామానికి చెందిన పోలాకి ఆనందరావుకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఇందులో మూడు ఎకరాలు మెట్టు. గతంలో నీరు రాక మెట్టు భూమిని ఖాళీగా వదిలేసేవాడు. ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు వస్తుండడంతో ఇప్పుడు ఆ మూడు ఎకరాలు సైతం సాగు చేస్తున్నాడు.

  • టెక్కలి మండలం కొల్లివలస గ్రామానికి చెందిన తోట చంద్రయ్యకు నాలుగు ఎకరాలు మెట్టు భూమి ఉంది. గతంలో ఇంజన్ల ద్వారా నీటిని అందించి పంటలు పండించేవాడు. దీనివల్ల గిట్టుబాటు అయ్యేది కాదు. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం నీరు వస్తుండడంతో సాగు ఆశాజనకంగా ఉందని చంద్రయ్య తెలుపుతున్నాడు.

  • ఒకప్పుడు వర్షాలు పడినా పంటలు పండని మెట్టభూములు అవి. కానీ, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోయినా ఆ భూములు వరి నాట్లతో కళకళలాడుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ నీరు లేక వెలవెలబోయిన చెరువుల్లో సైతం నేడు జలకళ సంతరించుకుంది. దీనికి కారణం మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం. దీనిద్వారా ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న సుమారు 3,300 ఎకరాలు ఇప్పుడు సస్యశ్యామలంగా మారాయి. టెక్కలి, నందిగాం మండలాల రైతాంగానికి సాగునీటి కల తీర్చాలని దివంగత కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకానికి మొదటిగా ప్రతిపాదనలు చేసినా అది సాధ్యం కాలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన కింజరాపు అచ్చెన్నాయుడు ఎత్తిపోతల పథకానికి పట్టుబట్టారు. ఈ మేరకు వంశధార ప్రధాన ఎడమ కాలువ వద్ద మదనగోపాలసాగరం ఎత్తిపోతలు నిర్మాణానికి రూ.34.38 కోట్ల మంజూరు చేయించారు. మూడేళ్లలోపే పనులు పూర్తి చేసి 2019లో ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏడాదైనా గడవక ముందే మోటార్లలో ఉన్న రాగితో పాటు ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు ఎత్తుకుని వెళ్లిపోయారు. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిధులు మంజూరు చేసి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేయించారు. దీంతో గత ఏడాది నుంచి నీరు వస్తోంది. ఈ ఏడాది అదనంగా మరో 2,500 ఎకరాలకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో రూ.4.28 కోట్లు మంజూరు చేశారు. దీనికి టెండర్లు సైతం పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ పథకం ద్వారా టెక్కలి మండలంలోని గూడేం, నరింగపల్లి, ముఖలింగపురం, నందిగాం మండలం రాంపురం, బొడ్డపాడు వరకు సుమారు 21 గ్రామాల రైతులకు సాగునీరు అందుతోంది. కిట్టలాపాడు తదితర చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. కొంతమంది రైతులు ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది జగన్నాథపురం కాము చెరువు వరకు పొడిగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

  • రుణపడి ఉంటాం

  • గతంలో బీడుగా ఉన్న భూముల్లో ఇప్పుడు రెండు పంటలు పండిస్తున్నాం. దీనికి కారణం వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ఎత్తిపోతలు పథకానికి నిధులు మంజూరు చేయించి బాగు చేశారు. రైతులంతా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.

    - పోలాకి షణ్ముఖరావు, ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు, మదనగోపాలపురం

  • సాగునీటి కష్టం తీరింది..

  • ఎత్తిపోతల పథకం వచ్చిన తరువాత రైతులకు సాగునీటి కష్టాలు తీరాయి. బీడు భూముల్లో సిరులు పండిస్తున్నాం. సెంటు భూమి కూడా ఖాళీగా కనిపించడం లేదు.

    - దారపు పాపారావు, రైతు, నర్సింగపల్లి

Updated Date - Aug 24 , 2026 | 12:10 AM