Share News

వైసీపీ జడ్పీటీసీ ఓవరాక్షన్‌!

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:22 AM

‘ZP Standing Committee Meeting’ జడ్పీ స్థాయీ సంఘం సమావేశంలో వైసీపీ జడ్పీటీసీ ఓవరాక్షన్‌ చేసి విమర్శలు పాలయ్యారు. జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో ‘జడ్పీ స్థాయీ సంఘం సమావేశం’ గురువారం జడ్పీచైర్‌ పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన నిర్వహించారు.

వైసీపీ జడ్పీటీసీ ఓవరాక్షన్‌!
పీయూసీ చైర్మన్‌ రవికుమార్‌, జడ్పీటీసీ కృష్ణచైతన్య మధ్య వాగ్వాదం

  • పీయూసీ చైర్మన్‌నే మాట్లాడొద్దంటూ అతి

  • దీటుగా బదులిచ్చిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌

  • టెక్కలి జడ్పీటీసీ వాణి తీరుపై చైర్‌పర్సన్‌ ఆగ్రహం

  • శ్రీకాకుళం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): జడ్పీ స్థాయీ సంఘం సమావేశంలో వైసీపీ జడ్పీటీసీ ఓవరాక్షన్‌ చేసి విమర్శలు పాలయ్యారు. జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో ‘జడ్పీ స్థాయీ సంఘం సమావేశం’ గురువారం జడ్పీచైర్‌ పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన నిర్వహించారు. ఎప్పుడూ సమావేశాలకు హాజరుకాని వైసీపీ జడ్పీటీసీలు ఏడుగురు వరకు ప్లాన్‌ ప్రకారం వచ్చారు. ప్రింటెడ్‌ ప్లకార్డులను చేతపట్టుకుని జడ్పీలో ప్రదర్శించి.. ఉద్దేశపూర్వకంగా పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య వాగ్వాదానికి దిగారు. సమావేశం సజావుగా జరుగుతుండగా.. కృష్ణచైతన్య మాట్లాడుతూ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని, జగన్‌ ఇచ్చిన పింఛన్లే కొనసాగించారని, అర్హుల పింఛన్లు తొలగించారని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మాట్లాడుతూ.. ‘2019-2024 మధ్యకాలంలో రాష్ట్రంలో ఏకంగా 7 లక్షల పింఛన్లను వైసీపీ సర్కారు తొలగించింది. జిల్లాలో ఎంతమంది పింఛన్లు తొలగించారో.. ఆ వివరాలను డీఆర్డీఏ పీడీ చదివి వినిపించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక.. స్పౌజ్‌ పింఛన్లు ఇచ్చాం. గత ప్రభుత్వం తొలగించిన పింఛన్లను పునరుద్ధరించామ’ని బదులిచ్చారు. దీంతో జడ్పీటీసీ తన సీటు వదిలి ఎమ్మెల్యే రవికుమార్‌ వద్దకు వచ్చి.. విమర్శలు ప్రారంభించారు. ఈక్రమంలో వాగ్వాదం పెద్దదైంది. సరుబుజ్జిలి జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు కూడా రవికుమార్‌తో వాగ్వాదానికి దిగాడు. కేటాయించిన సీటు వద్దకు వెళ్లాలని, తాను కూడా స్థాయీ సంఘం సభ్యుడినంటూ కూన రవికుమార్‌ చెప్పినప్పటికీ ఆ ఇద్దరు వైసీపీ జడ్పీటీసీలు అతి ప్రదర్శించారు. దీంతో వాగ్వాదం తోపులాటకు దారితీసింది. ఇతర సభ్యులు కలుగజేసుకుని నివారించారు.

  • అనంతరం ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మాట్లాడుతూ జడ్పీటీసీ సభ్యులు అందరూ మాట్లాడాక తాను మాట్లాడతానని ప్రకటించినా.. ఇందుకు కూడా పోలాకి జడ్పీటీసీ కృష్ణచైతన్య అడ్డుతగిలి ‘వీల్లేదు.. ఇది జడ్పీ’ అంటూ అసందర్భంగా.. నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారు. తాను జడ్పీ స్థాయీ సంఘానికి సభ్యుడనని, కోరంలో ఉండటంతో సమావేశం జరుగుతుందని.. తనను మాట్లాడవద్దనడానికి.. వీల్లేదనడానికి ‘నువ్వెవడవి’ అంటూ పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ ప్రశ్నించారు. జడ్పీచైర్‌ పర్సన్‌ పిరియా విజయ కూడా కలుగజేసుకుని ‘ఎమ్మెల్యే’ని మాట్లాడకూడదని అనే అధికారం తనతో సహా జడ్పీటీసీలకు లేదని స్పష్టం చేశారు.

  • అప్పుడే సమావేశానికి వచ్చిన టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి.. అసందర్భంగా కలుగజేసుకుని.. జడ్పీ చైర్‌పర్సన్‌ను ఉద్దేశిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని, జడ్పీ అనేది జగనన్న ఇచ్చిన అవకాశం అని అసందర్భంగా మాట్లాడారు. దీంతో జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలి జడ్పీటీసీ వాణీ.. మీ పద్ధతి బాగోలేదు.. ప్రతి సమావేశానికి ఆఖరున వచ్చి.. రాద్దాంతం చేస్తున్నారు.. ఇది సరికాదు.. మీరు సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగా రసాభాస చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆ కొద్దిసేపటికే వైసీపీ జడ్పీటీసీలు సమావేశం నుంచి వెళ్లిపోయారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వెంకటరామన్‌, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 12:22 AM