Share News

ఛీకొట్టినా మారలే!

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:18 AM

YCP leaders' conduct causes confusion among party workers జిల్లాలో ఇప్పటికే ఆదరణ కోల్పోయిన వైసీపీ.. తాజాగా ఆ పార్టీ నేతల తీరుతో అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతోంది. టీడీపీకి కంచుకోటగా నిలిచిన సిక్కోలులో.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి జిల్లా ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారు. కానీ ఆ ఐదేళ్ల జగన్మోహన్‌రెడ్డి పాలనలో వైసీపీ నేతల అరాచకాలతో విసిగిపోయి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఏకపక్ష తీర్పుతో విజయాన్ని అందించారు.

ఛీకొట్టినా మారలే!

  • ప్రజలు ఓడించినా తీరు మార్చుకోని వైసీపీ మాజీలు

  • కొడుకును కాపాడుకునేందుకు బెడిసికొట్టిన సీదిరి వ్యూహం

  • తమ్మినేని భూకబ్జాతో.. మరింత దిగజారిన పార్టీ పరువు

  • ఇప్పటికే దువ్వాడపై సస్పెన్షన్‌ వేటు

  • నాయకుల తీరుతో పార్టీ కార్యకర్తల్లో అయోమయం

  • వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారు. ఆకాశమే హద్దుగా అక్రమాలకు తెగబడ్డారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకభావం తెచ్చుకున్నారు. ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయ్యారు. అయినా వారి తీరులో మార్పులేదు. వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. దీంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

  • శ్రీకాకుళం, జూలై 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటికే ఆదరణ కోల్పోయిన వైసీపీ.. తాజాగా ఆ పార్టీ నేతల తీరుతో అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతోంది. టీడీపీకి కంచుకోటగా నిలిచిన సిక్కోలులో.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి జిల్లా ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారు. కానీ ఆ ఐదేళ్ల జగన్మోహన్‌రెడ్డి పాలనలో వైసీపీ నేతల అరాచకాలతో విసిగిపోయి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఏకపక్ష తీర్పుతో విజయాన్ని అందించారు. జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా.. కూటమికే మద్దతు పలికారు. దీంతో జిల్లాలో వైసీపీ పూర్తిగా చతికిలిపడిపోయింది. కాగా.. ఇటీవల వైసీపీ కీలక నేతల వ్యవహారంతో పార్టీ శ్రేణుల్లో మరింత దిగులు కనిపిస్తోంది.

  • బెడిసికొట్టిన సీదిరి వ్యూహం

  • ఈ నెల 10న పలాసలో మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ వర్మ బైక్‌ నడుపుతూ.. ఢీకొట్టి సూదికొండ కాలనీకి చెందిన దొబ్బ దానయ్య(40) మృతికి కారణమయ్యాడు. ఈ విషయంలో గందరగోళానికి గురైన విషయం సమంజసమే. కానీ.. తన కుమారుడ్ని తప్పించేందుకు సిద్ధార్థ త్యాడి అనే యువకుడు ఈ ప్రమాదం చేసినట్లు.. పోలీసులకు లొంగిపోవాలని సీదిరి వ్యూహం పన్నారు. ఆరవ్‌ వర్మను తానే స్వయంగా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించారు. మరోవైపు సన్నిహితులను మృతుడి కుటుంబ సభ్యుల వద్దకు పంపి.. కొంత పరిహారంతో రాజీ కుదిర్చేందుకు యత్నించారు. అంతా తాను అనుకున్నట్లే జరిగిందని సంబరపడ్డారు. కానీ ఆ మరుసటి రోజు సీన్‌ రివర్స్‌ అయ్యింది. సాంకేతిక ఆధారాలతో సహా సీదిరి వ్యూహం అంతా పోలీసులు పసిగట్టారు. ఆరవ్‌ వర్మ, సిద్ధార్థ త్యాడి, సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేశారు. ఆరవ్‌ వర్మ, సిద్ధార్థత్యాడిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌ నిమిత్తం వారిద్దరూ జిల్లా జైలులో ఉన్నారు. సీదిరి అప్పలరాజు మాత్రం యాంటిసిపేటరీ బెయిల్‌ కోసం అప్పీలు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

  • ఈ విషయం అలా ఉంచితే 18ఏళ్ల పిల్లోడు అంటూ సీదిరి అప్పలరాజు కుమారుడికి వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మద్దతు పలకడం.. సాధారణ ప్రజల్లో సైతం కంపరం పుట్టుకొచ్చింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ నాయకులెవరికీ ధైర్యం చాలడం లేదు. కుమారుడ్ని కేసు నుంచి తప్పించేందుకు సీదిరి చేసిన డ్రామాలు బయటపడడంతో.. పార్టీ పరువు మరింత దిగజారింది. కాగా ఇప్పుడు కొత్తపల్లవి అందుకుంటూ.. రాజకీయ కక్షతో తన కుమారుడ్ని అరెస్ట్‌ చేశారంటూ సీదిరి ప్రకటనలు చేస్తుండడంతో.. ఇదీ మరీ విడ్డూరమని పలువురు చర్చించుకుంటున్నారు.

  • తమ్మినేని.. భూబాగోతం

  • వైసీపీ పాలనలో స్పీకర్‌గా వ్యవహరించిన తమ్మినేని సీతారాం.. ప్రతిపక్షంపై విమర్శలతో రెచ్చిపోయారు. అప్పట్లో చేసిన భూబాగోతం.. ఇప్పుడు బయటపడడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వ్యక్తి.. ఇప్పటికీ బతికే ఉన్నా.. అతనిని రికార్డుల్లో చనిపోయినట్లు చూపారు. అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు సృష్టించి 2023లో శ్రీకాకుళం మండలం చాపురం వద్ద విలువైన స్థలాన్ని తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించేసుకున్నారు. ఈ వ్యవహారంలో తమ్మినేని కళాశాలలో చెందిన నలుగురు అధ్యాపకులు సైతం సాక్షి సంతకాలు పెట్టారు. ఒడిశాలో జయపూర్‌కు చెందిన అడబాల రజనీ అనే మహిళను (ఎ.రజని) వారసురాలుగా చూపించి.. రూ.4 కోట్ల విలువచేసే భూమిని ఆమదాలవలస సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇప్పుడు ఆ వ్యవహారంలో.. స్థలం అసలు యజమాని ఫిర్యాదు చేయడంతో తీగ లాగితే.. ఫేక్‌ డాక్యుమెంట్లు, ఇతర వ్యవహారం అంతా బట్టబయలైంది. తమ్మినేని సీతారాం, అతని సతీమణి వాణి, కుమారుడు చిరంజీవి నాగ్‌లతో పాటు.. మరో 10 మందిపై శ్రీకాకుళం రూరల్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో తమ్మినేని కుటుంబంతో సహా హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని నెలల కిందటే ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జిగా తమ్మినేనిని తప్పించేశారు. తమ్మినేనికి మద్దతుగా ఏ ఒక్క కార్యకర్త సైతం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.

  • ఇప్పటికే దువ్వాడ సస్పెన్షన్‌...

  • శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్‌ అంత చురుగ్గా వ్యవహరించడం లేదు. వాళ్ల కుమారులు పార్టీ కార్యక్రమాల్లో తరుచూ పాల్గొంటున్నారు. తండ్రులతో పోల్చితే కుమారులకు ప్రజలు ఇచ్చే గౌరవం తక్కువే. ఇదిలా ఉండగా.. వైసీపీ పాలనలో టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్‌... వివాదాస్పదంగా వ్యవహరించారు. మరోవైపు కుటుంబ కలహాల నేపథ్యంలో పార్టీ నుంచి కొన్నాళ్ల కిందట సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో జిల్లాలో వైసీపీ నాయకులను సైతం విమర్శిస్తూ... జగన్‌ను కీర్తిస్తూ.. పాత పద్ధతిలోనే టీడీపీ నాయకులను విమర్శిస్తూ దువ్వాడ వ్యవహారం నడుస్తోంది. సొంత సామాజిక వర్గంలో కూడా ఈ విషయమై అనుకూలత సంపాదించుకోలేకపోయారు. ఇలా జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లోనూ వైసీపీకి ఆశించినస్థాయిలో ప్రజాదరణ లేకపోవడంతో కార్యకర్తలు అయోమయం చెందుతున్నారు. కొంతమంది నేతల తీరుతో పార్టీకి నష్టం తప్పడం లేదని వాపోతున్నారు.

Updated Date - Jul 22 , 2026 | 12:18 AM