వైసీపీనేత మట్టి దందా
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:30 AM
Unchecked excavation in tanks ప్రభుత్వాలు మారినా.. అక్రమార్కుల తీరు మాత్రం మారడం లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ ఓ వైసీపీ నాయకుడు ‘మట్టి డాన్’గా చలామణి అవుతున్నారు. ప్రభుత్వ చెరువులను అడ్డాగా మార్చుకుని, యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
కూటమి పాలనలోనూ హవా
చెరువుల్లో యథేచ్ఛగా తవ్వకాలు
చాపురానికి అక్రమ రవాణా
చోద్యం చూస్తున్న యంత్రాంగం
శ్రీకాకుళం, జూలై 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు మారినా.. అక్రమార్కుల తీరు మాత్రం మారడం లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ ఓ వైసీపీ నాయకుడు ‘మట్టి డాన్’గా చలామణి అవుతున్నారు. ప్రభుత్వ చెరువులను అడ్డాగా మార్చుకుని, యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇదంతా పట్టపగలే జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమదాలవలస మునిసిపాలిటీలోని తాళ్లవలస పెద్ద చెరువుతోపాటు లక్ష్ముడుపేట, జగ్గుశాస్త్రులపేట, పార్వతీశంపేట, అక్కులపేట తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఓ వైసీపీ నేత సొంత ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్లతోపాటు మరికొన్ని వాహనాలను లీజుకు తసుకొని నిత్యం మట్టి దందా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణ సమీపంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చాపురం ప్రాంతంలో వెలుస్తున్న వెంచర్లు, పల్లపు ప్రాంతాలను పూడ్చేందుకు ఈ మట్టిని భారీగా తరలిస్తున్నారు. ఆమదాలవలస పరిసర ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్ల ద్వారా మట్టి, గ్రావెల్ అక్రమ రవాణా చేసే వ్యక్తులకు ఈ నేత మధ్యవర్తిగా వ్యవహరిస్తూ.. ఇందుకు ప్రతిఫలంగా ప్రతి వాహనానికీ రూ.500 చొప్పున వసూలు చేస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు.
అధికారుల తీరుపై అనుమానాలు!
సాధారణ వ్యక్తుల జీవనోపాధి కోసం ట్రాక్టర్లు, ఇతర వాహనాలు నడిపితే నిబంధనల పేరుతో కొరడా ఝళిపించే గనులు, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు.. వైసీపీ నేత మట్టి దందాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేతకు రోజూ ఏదో ఒక చెరువులో తవ్వకాలు జరిపేందుకు అప్రకటిత అనుమతులు ఎలా లభిస్తున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. కూటమి పాలనలో వైసీపీనేత మట్టి దందా సాగుతుండడం వెనుక ఆంతర్యం ఏమిటని అధికారపార్టీకి చెందిన పట్టణ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.