టెక్కలిలో వైసీపీ నేతల ఓవరాక్షన్
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:17 AM
YCP cadres' bravery at the station టెక్కలిలో వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్ మరోసారి బయటపడింది. సోమవారం టెక్కలి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్.. ఓ కేసు విచారణ నిమిత్తం స్థానిక పోలీసుస్టేషన్‌కు హాజరైన సందర్భంలో ఆ పార్టీ నేతలు వీరంగం సృష్టించారు.
పోలీసుల విచారణకు సహకరించని తిలక్
అన్ని ప్రశ్నలకూ నోరుమెదపని వైనం
స్టేషన్‌లో వైసీపీ శ్రేణుల వీరంగం
పోలీసులతో వాగ్వాదం
టెక్కలి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): టెక్కలిలో వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్ మరోసారి బయటపడింది. సోమవారం టెక్కలి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్.. ఓ కేసు విచారణ నిమిత్తం స్థానిక పోలీసుస్టేషన్‌కు హాజరైన సందర్భంలో ఆ పార్టీ నేతలు వీరంగం సృష్టించారు. ఈనెల 9న సెక్షన్ 30, 31 పోలీస్‌యాక్ట్‌ను వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉల్లంఘించారని తిలక్‌పై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఈ నెల 11వ తేదీనాటికే పోలీసుస్టేషన్‌కు వచ్చి నోటీసుకు సమాధానం చెప్పాలని సూచించారు. ఆయన అనారోగ్య కారణాలు సాకుగా చెప్పి సోమవారం ఉదయం 10.30 గంటలకు పోలీసుస్టేషన్‌కు హాజరయ్యారు. ముందస్తు ప్రణాళికతో తిలక్‌కు మద్దతుగా జిల్లా నలుమూలల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకున్నారు. పోలీస్‌స్టేషన్ ఎదుట పాత జాతీయ రహదారిపై బైఠాయించి వీరంగం సృష్టించారు. పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో తోపులాటకు దిగారు. పెద్దఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి.. మర్యాదగా ఉండదంటూ అక్కడున్న మహిళా పోలీసులను వెనక్కి నెట్టారు. మరికొందరు పోలీసులకు బెదిరింపు ధోరణిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వారి ఆందోళనతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను పోలీస్‌స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు పంపించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్‌తోపాటు పలువురు నాయకులు తిలక్‌తోపాటు పార్టీ కార్యాలయానికి సాయంత్రం 6 గంటల సమయంలో వెళ్లిపోయారు. అలాగే మాజీమంత్రి సీదిరి అప్పలరాజు తిలక్‌కు సంఘీభావం చెప్పేందుకు టెక్కలి చేరుకొని.. కొంతసేపటి తరువాత తిలక్‌ను పరామర్శించకుండానే వెళ్లిపోయారు.
ఇదిలా ఉండగా తిలక్ ఏడున్నర గంటలపాటు టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో ఉన్నప్పటికీ పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేదు. ‘సెక్షన్ 30, 31 పోలీస్‌యాక్ట్ అమలులో ఉన్న విషయం మీకు తెలియదా? అని పోలీసులు ప్రశ్నించినా ఆయన నోరు మెదపలేదు. అధికారపార్టీ నాయకులపై ఆరోపణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేశావని ప్రశ్నించినా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో డీఎస్పీ సీహెచ్ లక్ష్మణరావు తాము ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు పోలీస్‌స్టేషన్‌కు హాజరు కావాలని తిలక్‌కు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీలు లక్ష్మణరావు, గోవిందరాజులు, సీఐలు విజయ్‌కుమార్, శ్రీనివాసరావుతోపాటు ఎస్‌ఐలు, ఏఆర్ పార్టీ, స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు.