అభివృద్ధికి అడ్డు.. వైసీపీ నేత హంగామా
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:39 AM
జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16) పనుల్లో భాగంగా లావేరు మండలం బుడుమూరు వద్ద చేపట్టిన సర్వీసు రోడ్డు నిర్మాణానికి ఓ వైసీపీ నేత అడ్డు తగలడం కలకలం రేపింది.
-జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పనుల అడ్డగింత
-వ్యాపారాలు దెబ్బతింటాయంటూ ఆందోళన
-పంపించేసి చేతులు దులుపుకొన్న పోలీసులు
లావేరు, జూన్ 19(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16) పనుల్లో భాగంగా లావేరు మండలం బుడుమూరు వద్ద చేపట్టిన సర్వీసు రోడ్డు నిర్మాణానికి ఓ వైసీపీ నేత అడ్డు తగలడం కలకలం రేపింది. రాజకీయ గుర్తింపు కోసమే ఈ హైడ్రామాకు తెరతీశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుడుమూరు వద్ద హైవేను ఆనుకుని సర్వీసు రోడ్డు పనులు జరుగుతున్నాయి. హైవే, సర్వీసు రోడ్డుకు ఆనుకుని డివైడర్‌ను నిర్మిస్తున్నారు. అయితే, ఈ పనులను శుక్రవారం స్థానిక వైసీపీ నాయకుడు పిరియా జగన్ అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. ఇక్కడ సర్వీసు రోడ్డు నిర్మిస్తే రోడ్డుకు ఒకవైపున దుకాణాల వ్యాపారాలు దెబ్బతింటాయంటూ ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ హంగామా సృష్టించడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల ఎంట్రీ.. పనుల పునరుద్ధరణ..
సమాచారం అందుకున్న లావేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అవతారం ఆధ్వర్యంలో పోలీసులు.. వైసీపీ నాయకుడు పిరియా జగన్‌ను, ఆయన వెంట వచ్చిన వారిని అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం సర్వీసు రోడ్డు పనులను యథాతథంగా కొనసాగాలే చర్యలు తీసుకున్నారు.
అడ్డుకున్నా .. కేసుల్లేవు!
హైవే పనుల వంటి కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించిన వారిని.. అక్కడనుంచి పంపించేసి పోలీసులు చేతులు దులుపుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ గుర్తింపు కోసం ఆందోళన చేసిన సదరు నాయకుడిపై పోలీసులు ఎలాంటి కేసూ నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ తరహా ఉదాసీనత వల్ల అక్రమార్కులకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.