Share News

వైసీపీ హైడ్రామా

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:37 AM

Violation of Section 144 at every step మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు నేపథ్యంలో కాశీబుగ్గలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హైడ్రామా సృష్టించారు. పలాస- కాశీబుగ్గ జంట పట్టణాల్లో బుధవారం రాత్రి నుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించారు.

వైసీపీ హైడ్రామా
కోర్టు ప్రాంతంలో గుమిగూడిన వైసీపీ శ్రేణులు.. ఇన్‌సెట్‌లో సీదిరి అప్పలరాజును పోలీసు వాహనంలో జిల్లా జైలుకు తరలిస్తున్న దృశ్యం

  • సీదిరి అప్పలరాజు అరెస్టు నేపథ్యంలో ఆందోళన

  • అడుగడుగునా 144 సెక్షన్‌ ఉల్లంఘన

  • నిలువరించిన పోలీసులు

  • పలాస/కాశీబుగ్గ, జూలై 23(ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు నేపథ్యంలో కాశీబుగ్గలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హైడ్రామా సృష్టించారు. పలాస- కాశీబుగ్గ జంట పట్టణాల్లో బుధవారం రాత్రి నుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించారు. గురువారం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌, ఆసుపత్రి, కోర్టు ప్రాంగణం వద్ద ఆందోళనకు దిగారు.

  • గురువారం ఉదయం 6 గంటల నుంచే జిల్లాలో నలుమూలల నుంచి వచ్చిన పోలీసులతో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలు నిండిపోయాయి. పోలీసులు కాశీబుగ్గ పోలీస్టేషన్‌ ప్రాంతంలో ఉన్న రహదారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం 7.30 గంటలకు అప్పలరాజును కోర్టులో హాజరుపరుస్తామని తొలుత ప్రకటించడంతో వైసీపీ నాయకులు స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పలరాజుకు జ్వరం, తలనొప్పి వంటి కారణాల వల్ల ముగ్గురు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు మధ్యాహ్నం వచ్చి ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అయితే పోలీస్‌స్టేషన్‌ వద్దే వైద్య తనిఖీలు చేశారని ప్రచారం జరిగింది.

  • సాయంత్రం 4 గంటల నుంచి పోలీస్‌స్టేషన్‌ రోడ్డులో దారిలో వచ్చే వాహనాలు, వైసీపీ నాయకులను పోలీసులు కట్టడి చేశారు. 5 గంటల ప్రాంగణంలో ప్రత్యేక పోలీసుల పహరా మధ్య అప్పలరాజును తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అరగంటపాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నేరుగా కోర్టుకు తరలించారు. రెండు గంటల పాటు అప్పలరాజును న్యాయాధికారి ముందుంచి ఆయన తరుపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనంతరం న్యాయాధికారి 15 రోజులు రిమాండ్‌కు తరలించాలని పోలీసులను ఆదేశించారు. అంపోలు జైలుకు ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య అప్పలరాజును తరలించారు. కోర్టు ప్రాంగణం, పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో వైసీపీ నాయకులు హంగామా సృష్టించారు. పోలీసులు పరిస్థితి చక్కదిద్దారు.

  • కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో అప్పలరాజును పరామర్శించడానికి గురువారం మధ్యాహ్నం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ చేరుకున్నారు. ఆయన్ను లోపలకు పంపించకపోవడంతో రోడ్డుపైనే విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాజీమంత్రి అప్పలరాజు సతీమణి శ్రీదేవిని పరామర్శించారు.

  • సీదిరి అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ టెక్కలి వైసీపీ నాయకుడు పేరాడ తిలక్‌ ర్యాలీలు నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేసి మెళియాపుట్టి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు మరో 9 మందిపైనా కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 24 , 2026 | 12:37 AM