తప్పు ‘గురు’!
ABN , Publish Date - May 07 , 2026 | 12:17 AM
మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్యదేవో భవ. తల్లిదండ్రుల తరువాత అంతటి స్థానం గురువులదే. ఏ రంగంలోనైనా గురువుదే ప్రథమ స్థానం. గురువులేనిదే విద్యలేదు..
గాడితప్పుతున్న కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులు
విద్యార్థినులతో అనుచిత ప్రవర్తన
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వైనం
విద్యా బోధన మాటున వికృత చేష్టలు
జిల్లాలో వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు
- అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేయడం ఇటీవల వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో పాస్ చేయాలంటే తన ఇంటికి రావాలని అసభ్యంగా మాట్లాడిన ఆడియో ఫోన్ సంభాషణ బయటపడింది. దీంతో దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యూనివర్సిటీ అధికారులు విచారణ చేపడుతున్నారు.
- ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఇద్దరు అధ్యాపకులపై విద్యార్థులు ఏకంగా గ్రీవెన్స్ సెలలో ఫిర్యాదు చేశారు. వెకిలి చేష్టలతో అసౌకర్యానికి గురవుతున్నామని వాపోయారు. కాలేజీనే ఆవాసాలుగా చేసుకొని విద్యార్థుల విషయంలో ఎంతో ఇబ్బందులు పెడుతున్నట్టు ఫిర్యాదుచేశారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- నాలుగు నెలల కిందట ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్లపై కూడా విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. అధ్యాపకులతో పాటు బోధనేతర సిబ్బంది తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని.. పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
- మెళియాపుట్టి మండలంలో ఆరు నెలల కిందట ఓ గిరిజన ఆశ్రమ పాఠశాలలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడ ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు.
రణస్థలం, మే 6 (ఆంధ్రజ్యోతి): మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్యదేవో భవ. తల్లిదండ్రుల తరువాత అంతటి స్థానం గురువులదే. ఏ రంగంలోనైనా గురువుదే ప్రథమ స్థానం. గురువులేనిదే విద్యలేదు.. గురువులేనిదే గుణం రాదు.. గురువు లేనిదే భవిష్యత్ లేదు. అంతలా సమాజంలో గురువు పాత్ర కీలకం. కానీ అటువంటి గురువు స్థానానికి మచ్చ తెచ్చేలా కొందరు వ్యవహరిస్తున్నారు. లైంగిక వేధింపులకు దిగుతున్నారు. కామవాంఛతో చూస్తున్నారు. అయితే అందర్నీ ఒకే తాటిలో కట్టలేం. తులసివనంలో గంజాయి మొక్కలా అక్కడక్కడా ఇటువంటి వారు ఉండనే ఉంటున్నారు. విద్యాబోధన మాటున వికృత క్రీడకు తెరలేపుతున్నారు. గురు శిష్యుల బంధానికి మచ్చ తెస్తున్నారు.
తల్లిదండ్రుల కంటే మించి..
తల్లిదండ్రుల కంటే.. కుటుంబసభ్యుల కంటే విద్యార్థులు ఎక్కువగా గడిపేది ఉపాధ్యాయులతోనే. పాఠశాలల్లోనే నిరంతరం గడుపుతుంటారు. తమ కష్ట నష్టాలను, సుఖ: దు:ఖాలను తమ మనసు గుర్తెరిగే ఉపాధ్యాయులతో పంచుకొని వారి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిస్తుంటారు. కానీ చాలా మంది విద్యాబోధన, ప్రత్యేక శ్రద్ధ, ఇతరత్రా కుటుంబ అవసరాల పేరుతో చిన్నారులను, విద్యార్థినులను దగ్గరగా తీసుకుంటున్నారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే ఉపాధ్యాయ వృత్తి నియమావళిని అనుసరించి గురువుల స్థానంలో ఉన్నవారు లైంగికంగా తప్పులు చేస్తే శిక్షలు రెండింతలు ఉంటాయి. ఉద్యోగం నుంచి కూడా తొలగించవచ్చు. 18 ఏళ్లలోపు బాలబాలికలపై జరిగే లైంగిక వేధింపులన్నీ ఫోక్సో చట్టం కిందకు వస్తాయి. బాలిక అంగీకారంతోనైనా సరే.. ఆమెతో శారీరకంగా సంబంధం పెట్టుకుంటే అత్యాచారం కిందే పరిగణిస్తారు. లైంగికంగా దాడిచేస్తే బీఎన్‌ఎస్‌లోని సెక్షన్-64.. వేధింపులకు గురిచేస్తే సెక్షన్-74లతో పాటు నిర్భయ, ఫోక్సో చట్టాల కింద కేసు నమోదుచేస్తారు. నేరం రుజువైతే పదేళ్లు అంతకంటే ఎక్కువగా జైలుశిక్ష పడుతుంది.
జాగ్రత్తగా ఉండాలి..
పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పాఠశాలలో కానీ..అయినవారితో కానీ ఏ ఇబ్బంది వచ్చినా వారు చెప్పే చనువు, చొరవ ఉండాలి. ప్రాథమిక స్థాయిలో లైంగిక వేధింపులు ఎలా ఉంటాయో? ఎన్నిరకాలుగా ఉంటాయో? పిల్లలకు అర్ధమయ్యే రీతిలో చెప్పాలి. బాధితులుగా మారిన చిన్నారులకు అండగా ఉండాలి. వేధింపులకు గురిచేసే ఉపాధ్యాయులైనా.. సొంత కుటుంబసభ్యులైనా శిక్షపడేలా ఫిర్యాదుచేయాలి. అప్పుడే మరోసారి ఈ తప్పు జరగకుండా ఉండేందుకు దోహదపడవచ్చు. అవమానమని పిల్లల నోరునొక్కితే ఆ భయం వారిని జీవితాంతం వెంటాడుతుంది. 18 ఏళ్లు నిండని వారంతా బాలలే అని చట్టం చెబుతుంది. వారి శరీరాన్ని అసభ్యంగా తాకడం, వీడియోలు తీయడం, లైంగికంగా ప్రేరేపించడం తప్పు. బలవంతం చేయడం, ముద్దుపెట్టుకోవడం, నగ్నంగా చూపించడం తీవ్రమైన నేరాలు. వీటిని పిల్లలకు అర్ధమయ్యే రీతిలో వివరించాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన అవసరం. కాలేజీ విద్యార్థుల కోసం ఫిర్యాదు బాక్సులను విధిగా అమలుచేస్తే లైంగిక నేరాలు అదుపులోకి తీసుకురావచ్చు.
అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై వేటు
అంబేడ్కర్ యూనివర్సిటీలో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై వేటు పడింది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ యూనివర్సిటీ రిజిస్ర్టార్ బిడ్డిక అడ్డయ్య ఉత్తర్వులు జారీచేశారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మజ్జి రామారావు ఓ విద్యార్థినితో ఫోన్‌లో అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. సుమోటాగా తీసుకుని అసిస్టెంట్ ప్రొఫెసర్ రామారావుపై సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తిస్థాయి విచారణకుగాను ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేశారు. అయితే ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైన క్రమంలో అధికారులు చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలి
విద్యాసంస్థల్లో లైంగిక వేఽధింపులు వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రతి విద్యాసంస్థలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటుచేయాలి. పోలీస్ శాఖకు అనుసంధానించాలి. పోలీసులే ఆ పెట్టె తెరచి ఫిర్యాదులు స్వీకరించాలి. చిన్నచిన్న తప్పిదాలు అయితే కౌన్సెలింగ్ ఇవ్వొచ్చు. పెద్ద తప్పిదాలు అయితే కఠిన చర్యలకు దిగవచ్చు.
-తలే లక్ష్మణరావు, న్యాయ పర్యవేక్షణ అధికారి, మహిళా శిశు సంక్షేమ శాఖ, శ్రీకాకుళం