అంగన్‌వాడీల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:15 AM
Mini centers upgraded అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతంతోపాటు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు.
5వేల మినీ కేంద్రాలు అప్‌గ్రేడ్
ఆయాల నియామకానికి చర్యలు
ఏజెన్సీలో డోలీ కష్టాలకు చెక్
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
శ్రీకాకుళం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతంతోపాటు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు వరంలా గ్రాట్యుటీ కల్పించిన ఏకైక ప్రభుత్వం తమదేనని ఉద్ఘాటించారు. సోమవారం శ్రీకాకుళంలో ఐసీడీఎస్ పరిధి అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘అంగన్‌వాడీ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 55,706 అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 5 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీలుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాం. అక్కడ పనిచేస్తున్న వారికి టీచర్లుగా పదోన్నతి కల్పిస్తాం. త్వరలోనే 5 వేల మంది ఆయాలను నియమిస్తాం. ఇంకా 2వేల మినీ అంగన్‌వాడీల్లో పదోతరగతి ఉత్తీర్ణత కాని సిబ్బంది ఉన్నారు. వారంతా ఏడాదిలోపు ఉత్తీర్ణత సాధిస్తే.. వారికి కూడా టీచర్లుగా పదోన్నతి కల్పిస్తాం. జిల్లాలోని 850 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్లు మంజూరు చేశాం. పిల్లల్లో పరిశుభ్రత అలవాటు చేసేందుకు ‘ఉత్సాహం’ అనే ప్రత్యేక కార్యక్రమం చేపట్టాం. పిల్లల కోసం టీవీలు, కూర్చోవడానికి చిన్న కుర్చీలు, ఆటవస్తువులు సమకూర్చాం. టీచర్లపై పనిభారాన్ని తగ్గించేలా యాప్‌లను కుదించాం. స్మార్ట్‌ఫోన్లు సైతం పంపిణీ చేశామ’ని తెలిపారు.
రూ. 1300కోట్లతో ఏజెన్సీ రహదారులు...
గిరిజన సంక్షేమంపై మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. ‘సీతంపేట ఐటీడీఏ పాలకొండలో ఉన్నా, కలెక్టర్, పీవోల పర్యవేక్షణలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏజెన్సీలో డోలీ మోతలు నిర్మూలనే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను అనుసంధానించి రూ.1300 కోట్లతో రోడ్లు వేస్తున్నాం. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన దుప్పట్లు, బెడ్ షీట్లు, ప్లేట్లు, గ్లాసులు, యూనిఫాం అందిస్తున్నాం. గత నెలలో గర్భిణులకు ఆపరేషన్లను (సిజేరియన్లను) తగ్గించి, సాధారణ ప్రసవాలులో రాష్ట్రం నెంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఇది మా శాఖ పనితీరుకు నిదర్శనమ’ని హర్షం వ్యక్తం చేశారు.