జవాబుదారీతనంతో పనిచేయండి
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:04 AM
Collector's anger over doctors' performance ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడితే సహించేది లేదు. వైద్యులు, సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయిలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వైద్యులు, సిబ్బంది పనితీరుపై ఆగ్రహం
వారంలోగా 71పీహెచ్‌సీలపై నివేదిక ఇవ్వాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడితే సహించేది లేదు. వైద్యులు, సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయిలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులంతా ప్రజలకు సక్రమంగా సేవలు అందజేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు జిల్లాలోని 71 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. సిబ్బందికి సంబంధించి మూమెంట్, లీవ్ రిజిస్టర్లు సరిగా లేవని, ఈ విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ‘పాఠశాలల్లో విద్యార్థులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలి. దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేయాలి. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. బయోమెట్రిక్ హాజరును పక్కాగా అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న సిటిజన్ ఈ-కెవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలి. వాట్సాప్ మిత్ర ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఇకపై ఫైళ్లన్నీ ఈ-ఆఫీసు ద్వారానే చేపట్టాలి. పారిశుద్ధ్యం మెరుగుపరచాలి. చెత్తనుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఆదాయం పెరిగేలా చూడాలి. నివాస స్థలాల పట్టాల పంపిణీకి వివరాలు సిద్ధం చేయాలి. పంచాయతీ భవనాల నిర్మాణానికి స్థల సేకరణ చేయాల’ని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, డీఆర్వో లక్ష్మణమూర్తి, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఎంహెచ్‌వో డా.కె.అనిత, డీపీవో భారతీ సౌజన్య, వ్యవసాయాధికారి త్రినాథస్వామి, ఆర్డీవోలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, వెంకటేష్ పాల్గొన్నారు.