కోరిన వెంటనే పని
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:08 AM
ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు
- దరఖాస్తు చేసిన 48 గంటల్లో జాబ్‌కార్డు
- ఈకేవైసీతో అక్రమాలకు చెక్
- పనుల్లో పురోగతికి అధికారుల ప్రణాళిక
రణస్థలం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాబ్‌కార్డులు ఉన్నవారందరికీ శతశాతం పనులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో జాబ్‌కార్డును మంజూరు చేస్తోంది. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈకేవైసీని ప్రవేశపెట్టింది. మరోపక్క అడిగిన వారందరికీ పని కల్పిస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 30 మండలాలు ఉన్నాయి. మొత్తం జాబ్‌కార్డులు 3.84 లక్షలు ఉండగా.. వేతనదారులు 6.18 లక్షల మంది ఉన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.326 కోట్లు విలువైన పనులు చేపట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను చేపట్టాల్సిన పనులు కూడా అధికారులు గుర్తించారు. ఇటీవల గ్రామసభలు ఏర్పాటు చేశారు. అడిగిన వారందరికీ పని కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నారు. మరోవైపు గ్రామాల్లో సీసీ రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతులను కూడా ఉపాధి హామీ కాంపోనెంట్ నిధులతో చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. గతంలో దొంగ మస్తర్లు, జాబ్‌కార్డులతో వైసీపీ చోటా నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియ చేపట్టింది. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ ఒకసారి కూడా పనికిరాని వారు, డబుల్ ఎంట్రీలు వంటి వాటిని ఈకేవైసీలో గుర్తించారు. దాదాపు లక్షా 40 వేల మంది పేర్లు తొలగింపు జాబితాలో ఉన్నట్టు తేలింది. జాబ్‌కార్డు జారీ ప్రక్రియను సైతం సులభతరం చేసింది. గతంలో జాబ్‌కార్డు కావాలంటే స్థానిక రాజకీయ నాయకులు, కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు మాత్రం దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే కార్డు జారీ ప్రక్రియ జరుగుతోంది. అర్హత ఉండి జాబ్‌కార్డు కావాల్సిన వారు ఆధార్ కార్డుతో ఫీల్డ్ అసిస్టెంట్‌ను సంప్రదించాలి. ఉపాధి కార్యాలయానికి వెళ్తే ఈకేవైసీ చేస్తారు. దరఖాస్తును మండల కార్యాలయానికి తీసుకెళ్లి ఇస్తే ఆ మరుసటి రోజే జాబ్‌కార్డు మంజూరు చేస్తారు.
మహిళలే టాప్..
ఉపాధి హామీ పథకాన్ని మహిళలే ఎక్కువగా వినియోగించుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. స్థానికంగా ఉపాధి దక్కుతుండడంతో మహిళలు మొగ్గుచూపుతున్నారు. పురుషుల కంటే మహిళలే అధికంగా పనులకు వస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలు 50 శాతానిపైగా పనుల్లోకి వచ్చినట్టు స్పష్టమవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,85,514 మంది పురుషులు పనులకు హాజరైతే..మహిళలు ఏకంగా 3,12,387 మంది ఉండడం విశేషం. 2023-24లో 1,87,531 మంది పురుషులు, 3,18,309 మంది మహిళలు, 2024-25లో 1,80,660 మంది పురుషులు, 3,14,588 మంది మహిళలు, 2025-26లో 1,80,000 మంది పురుషులు పనుల్లోకి వస్తే 3,12,576 మంది మహిళలు పనులకు హాజరయ్యారు. పారదర్శకంగా పనులు చేపట్టడం ద్వారా మరింత పురోగతి సాధించాలని ఉపాధి హామీ అధికారులు ప్రణాళిక వేస్తున్నారు.
మరింత పారదర్శకంగా..
ఉపాధి హామీ పథకాన్ని మరింతగా పారదర్శకంగా నిర్వహిస్తాం. అర్హులైన వారు కోరిన వెంటనే పనులు కల్పిస్తాం. ఈకేవైసీ కూడా పూర్తిచేశాం. అనర్హులు, మృతుల పేర్లు తొలగించాం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1.56కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.40కోట్ల పనిదినాలు కల్పించాం. రూ.224 కోట్ల మెటీరియల్ పనులకు గాను రూ1.75 కోట్ల పనులు పూర్తి చేశాం. ఈ ఏడాది మార్చి నాటికి టార్గెట్ పూర్తి చేస్తాం. ఉపాధి పథకం అమలులో దేశంలోనే మన రాష్ట్రం టాప్‌లో నిలవడం ఆనందంగా ఉంది. ఇదే స్ఫూరితో జిల్లాలో ప్రణాళికలు రూపొందించాం.
-బి.లవరాజు, డ్వామా పీడీ, శ్రీకాకుళం