మహిళా కోటా.. ఎవరికి ‘బాట’?
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:53 PM
‘రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేయడమే మా లక్ష్యం.. రాబోయే ఎన్నికల్లో వారికి ఏకంగా 33 శాతం కేటాయిస్తాం.’ అని మహానాడు వేదికగా టీడీపీ ప్రకటించడంతో జిల్లాలోని ఆశావహుల్లో సందడి నెలకొంది.
- రాబోయే ఎన్నికల్లో 33 శాతం అసెంబ్లీ టికెట్లు నారీమణులకే
- తాజా లెక్కల ప్రకారం జిల్లాలో కనీసం 3 స్థానాలు మహిళలకే దక్కే అవకాశం
- ఆశావహుల్లో ఉత్సాహం
శ్రీకాకుళం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేయడమే మా లక్ష్యం.. రాబోయే ఎన్నికల్లో వారికి ఏకంగా 33 శాతం కేటాయిస్తాం.’ అని మహానాడు వేదికగా టీడీపీ ప్రకటించడంతో జిల్లాలోని ఆశావహుల్లో సందడి నెలకొంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పూర్తిస్థాయిలో అమలుకాకముందే, తమ పార్టీ తరపున 33 శాతం టికెట్లను మహిళలకే ఇస్తామని తెలుగుదేశం అధిష్ఠానం స్పష్టం చేయడంతో ఆ పార్టీలోని మహిళా నేతల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ పరిణామం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని, రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సమీకరణాలను సమూలంగా మార్చేయనుంది.
మహిళలకు దక్కేవి ఎన్నంటే?
జిల్లా పరిధిలో ప్రస్తుతం ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. 33 శాతం మహిళా కోటాను పక్కాగా అమలు చేస్తే ఈ ఎనిమిది నియోజకవర్గ స్థానాల్లో కనీసం 2 లేదా 3 స్థానాలు కచ్చితంగా మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో పలాస నుంచి గౌతు శిరీష ఒక మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో ఆ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడుతున్న చురుకైన మహిళా నాయకులకు ఇది నిజంగా సువర్ణావకాశం.
నియోజకవర్గాలు పెరిగితే.. కోటా జంప్ !
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే అసెంబ్లీ స్థానాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అప్పుడు జిల్లా పరిధిలో కొత్తగా మరో రెండు లేదా మూడు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పుడు జిల్లాలో మొత్తం స్థానాల సంఖ్య 10 లేదా 11కి చేరుకుంటుంది. పెరిగిన ఆ స్థానాలకు 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తే సిక్కోలు నుంచే ఏకంగా 3 నుంచి 4 స్థానాల్లో మహిళా అభ్యర్థులు బరిలో దిగుతారు. ఇదే జరిగితే జిల్లా రాజకీయ చరిత్రలో అదొక రికార్డు కానుంది. టీడీపీ అధినేత నారా చంద్రబునాయుడు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జిల్లాలోని మహిళా నాయకులు, కార్యకర్తలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారత పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని కొనియాడుతున్నారు.
నిజమైన సాధికారత ఇదే : గౌతు శిరీష, పలాస ఎమ్మెల్యే
చంద్రబాబునాయుడు గారు ఎప్పుడూ మహిళల పక్షపాతి అని చెప్పడానికి ఈ నిర్ణయమే నిదర్శనం. చట్టంతో సంబంధం లేకుండా, మహానాడు వేదికగా 33 శాతం టికెట్లు మహిళలకే ఇస్తామని ప్రకటించడం చారిత్రాత్మకం. స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఆస్తిలో హక్కు కల్పిస్తే.. చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు చట్టసభల్లో కూడ ఆ దిశగా అడుగులు పడటం అత్యంత హర్షనీయం. ఈ నిర్ణయం వల్ల గ్రామ స్థాయి నుంచి కష్టపడి పనిచేస్తున్న ఎంతోమంది మహిళా నాయకురాళ్లకు గొప్ప ఊతం లభిస్తుంది. మహిళా సాధికారతకు ఇదొక మైలురాయి.
ఇది టీడీపీకే సాధ్యం : బగ్గు అర్చన, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
మహిళలను కేవలం ఓటర్లుగానే కాకుండా, చట్టసభల్లో కీలక నిర్ణయాలు తీసుకునే శక్తివంతమైన నాయకులుగా చూడాలన్నదే తెలుగుదేశం పార్టీ దృఢ సంకల్పం. బిల్లుల కోసం ఎదురుచూడకుండా 33 శాతం టికెట్లు మహిళలకే అని ప్రకటించడం మా పార్టీ నిబద్ధతకు నిదర్శనం. రాజకీయాల్లో యువతకు, మహిళలకు అవకాశాలు ఇవ్వడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది. తాజా ప్రకటనతో సిక్కోలు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మహిళా నాయకత్వం మరింత బలోపేతం కావడం ఖాయం.