Share News

సారా విక్రయించిన మహిళకు జైలు

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:13 AM

పెంటిభద్ర గ్రామానికి చెందిన సవర పార్వతి అనే మహిళ సారా అక్రమంగా విక్రయిస్తున్న కేసు రుజువు కావడంతో ఆమెకు ఏడాది జైలుశిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్టు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మల్లికార్జునరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

 సారా విక్రయించిన మహిళకు జైలు

పలాసరూరల్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): పెంటిభద్ర గ్రామానికి చెందిన సవర పార్వతి అనే మహిళ సారా అక్రమంగా విక్రయిస్తున్న కేసు రుజువు కావడంతో ఆమెకు ఏడాది జైలుశిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్టు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మల్లికార్జునరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023వ సంవత్సరంలో పెంటిభద్ర గ్రామంలో సవర పార్వతి సారా విక్రయిస్తుండగా అప్పటి ఎక్సైజ్‌ ఎస్‌ఐ కృష్ణారావు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితురాలి నేరం రుజువు కావడంతో ఆమెకు శిక్ష విధిస్తూ గురువారం పలాస మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి యు.మాధురి తీర్పునిచ్చారని ఆయన తెలిపారు. ఈ కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.రమేష్‌ వాదించినట్లు ఆయన తెలిపారు.

తప్పుడు పత్రాలతో రుణం తీసుకున్న వారికి...

పలాస, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): తప్పుడు పత్రాలు సృష్టించి.. కాశీబుగ్గ ఏపీజీవీబీలో వ్యవసాయ, పాడిపంటల రుణం తీసుకున్న వారికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ పలాస మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ యు.మాధురి గురువారం తీర్పు ఇచ్చారు. సీఐ వై.రామకృష్ణ కథనం ప్రకారం 2006-2009 సంవత్సరాల మధ్యలో శ్రీకాకుళం మండలం పాత్రునివలస గ్రామానికి చెందిన కొండల మన్మథరావు, నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన తమ్మినేని జోగినాయుడుతో పాటు మరో నలుగురు రైతులు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి విశాఖ గ్రామీణ బ్యాంకులో వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. దీనిపై అనుమానం వచ్చిన అప్పటి బ్యాంకు మేనేజర్‌ పైల బాలకృష్ణారావు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వి.గోపీనాథ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సీఐ రామకృష్ణ నిందితులపై చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేశారు. నిందితులపై 420, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులపై అభియోగాలు రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్ష, రూ.2వేలు వంతున జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. బ్యాంకు తరఫున ఏపీపీ పి.రమేష్‌ కేసు వాదించారు.

Updated Date - Jun 19 , 2026 | 12:13 AM