Share News

గ్యాస్‌ లేకుండానే.. ఆకలి‘మంట’ తీరుస్తూ..

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:05 AM

Cooking with alternative energy sources అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధంతో ప్రపంచం ఇంధన కొరతతో సతమతమవుతోంది. వంట గ్యాస్‌ సరఫరాలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్యాస్‌ లభ్యంకాక చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. అయితే, గ్యాస్‌పై ఆధారపడకుండా ప్రతిరోజూ 30వేల మందికి భోజనాలను వండుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌, అక్షయపాత్ర సంస్థల నిర్వాహకులు.

గ్యాస్‌ లేకుండానే.. ఆకలి‘మంట’ తీరుస్తూ..
అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లో బయోగ్యాస్‌తో వంట..

ప్రత్నామ్యాయ ఇంధన వనరులతో వంటలు

రోజుకు 30వేల మందికి భోజనాల తయారీ

పాఠశాలలు, అన్నా క్యాంటీన్లకు సరఫరా

ఆదర్శంగా ‘హరేకృష్ణ’, ‘అక్షయపాత్ర’

అరసవల్లి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధంతో ప్రపంచం ఇంధన కొరతతో సతమతమవుతోంది. వంట గ్యాస్‌ సరఫరాలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్యాస్‌ లభ్యంకాక చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. అయితే, గ్యాస్‌పై ఆధారపడకుండా ప్రతిరోజూ 30వేల మందికి భోజనాలను వండుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌, అక్షయపాత్ర సంస్థల నిర్వాహకులు. శ్రీకాకుళం మండలం సింగుపురంలో నెలకొల్పిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ద్వారా వారు దీనిని సుసాధ్యం చేసి చూపించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి, పలు మండలాల్లోని అన్నా క్యాంటీన్లకు ఇక్కడి నుంచే భోజనాలను తయారు చేసి పంపిస్తున్నారు. వంట గ్యాస్‌ను వినియోగించకుండానే ప్రత్నామ్యాయ పద్ధతల్లో వంటలు చేస్తున్నారు. కూరగాయల వ్యర్థాలతో ఇక్కడ బయోగ్యాస్‌ ప్లాంట్‌ను నెలకొల్పారు. దీని ద్వారా రోజుకు 25 కిలోల బయోగ్యాస్‌ ఉత్పత్తి చేస్తున్నారు. దానిని వంట కోసం వినియోగిస్తున్నారు. అలాగే కొబ్బరిపీచు, చెక్కల పొడి, వేరుశనగ తొక్కలతో దిమ్మలు(బ్రికెట్స్‌) తయారు చేసి, బ్రాయిలర్స్‌లో ఆవిరి ఉత్పత్తి చేసి ఆహార పదార్థాలను వండుతున్నారు. అలాగే వీరు రోజుకు 450 యూనిట్ల సోలార్‌ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. దీనిద్వారా వంటలు చేయడమే కాకుండా, భోజనాల సరఫరాకు వినియోగించే నాలుగు వాహనాలకు విద్యుత్తు చార్జింగ్‌ కూడా చేయగలుగుతున్నారు. ఎంతో ముందుచూపుతో వీరు అనుసరిస్తున్న ఈ పద్ధతులు ఎంత ఉపయోగకరమైనవో నేడు అందరూ గుర్తిస్తుండడం విశేషం. వీరు ప్రతిరోజూ శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పాలకొండ, రాజాం, కోటబొమ్మాళి ప్రాంతాల్లోని అన్నా క్యాంటీన్లకు 10 వేలమందికి సరిపడా భోజనాలు అందిస్తున్నారు. అలాగే జిల్లాలోని వివిధ పాఠశాలలకు 20 వేలమంది విద్యార్థులకు భోజనాలను అందజేస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమం హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ రీజినల్‌ అధ్యక్షుడు నిష్కిన్సన్‌ భక్తిదాస ఆధ్వర్యంలో.. ప్రభుత్వ రిలేషన్స్‌ ప్రాజెక్ట్‌ జోన్‌-1 అధికారి తిలారీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో విజయవంతంగా జరుగుతోంది.

సహజ వనరులతోనే..

మేము మొత్తంగా మా రీజియన్‌లో 13 వంట శాలలను నిర్వహిస్తున్నాం. వంటగ్యాస్‌పై మేము పెద్దగా ఆధారపడడం లేదు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగిస్తున్నాం. కూరగాయల చెత్త, భోజనాల వేస్ట్‌ నుంచి బయోగ్యాస్‌ తయారీ, సోలార్‌ ఎనర్జీ వినియోగం, నీటి ఆవిరి వినియోగం, వేస్ట్‌గా పడి ఉండే చెక్కలపొడి, వేరుశనగ తొక్కలు, కొబ్బరిపీచుతో దిమ్మలు(బ్రికెట్స్‌) తయారు చేస్తున్నాం. వీటితో ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యావరణహితంగా వంట శాలలు నిర్వహిస్తున్నాం. ప్రకృతిని మనం పరిరక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. ఆ సూత్రాన్ని మేము క్రమం తప్పక పాటిస్తున్నాం. అందరూ ఇలా సహజ వనరులపై ఆధారపడి, పునరుత్పాదక ఇంధనాన్ని తయారు చేసుకుని ప్రకృతిని రక్షించాలి.

- నిష్కిన్సన్‌ భక్తిదాస, హరేకృష్ణ మూవ్‌మెంట్‌ రీజనల్‌ అధ్యక్షుడు

Updated Date - Mar 27 , 2026 | 12:05 AM