Share News

చిన్న కుమార్తెను చూడకుండానే...

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:31 AM

జీవనో పాధి కోసం పోలండ్‌ వెళ్లి... అక్కడ అనా రోగ్యంతో మృతి చెందిన కాపు గోదాయ వలసకు చెందిన బత్సల రాంబాబు(37) మృత దేహం సోమ వారం గ్రామానికి చేరుకుంది.

చిన్న కుమార్తెను చూడకుండానే...
రాంబాబు మృతదేహం

  • ఉపాధి కోసం వెళ్లి పోలండ్‌లో మృతిచెందిన రాంబాబు

  • 15 రోజుల తరువాత స్వగ్రామానికి మృతదేహం

  • కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు

సంతబొమ్మాళి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జీవనో పాధి కోసం పోలండ్‌ వెళ్లి... అక్కడ అనా రోగ్యంతో మృతి చెందిన కాపు గోదాయ వలసకు చెందిన బత్సల రాంబాబు(37 మృత దేహం సోమ వారం గ్రామానికి చేరుకుంది. రాంబాబు గత ఏడాది నవంబర్‌లో పోలండ్‌ వెళ్లాడు. అప్పటికే రాంబాబుకు ఒక కుమార్తె బిందుశ్రీ ఉండగా ఈ ఏడాది జనవరిలో రెండో కుమార్తె చరిష్మా జన్మించింది.ఈ విషయం ఫోన్‌ ద్వారా తెలుసుకున్న రాంబాబు ఎంతో ఆనందించాడు. కానీ అంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండేళ్ల వరకు అక్కడి నుంచి వచ్చేందుకు అనుమతి లేదు. దీంతో స్వగ్రామానికి వచ్చి చిన్నకుమార్తెను చూడలేకపోయాడు. ఇంతలోనే రాంబాబు అనారోగ్యంతో ఆగస్టు 17న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అతని మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సాగునీటి సంఘం ఉపాధ్యక్షులు కుత్తుమ శివప్రసాద్‌ కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు పోలండ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి... రాంబాబు మృతదేహాన్ని గ్రామానికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం గ్రామానికి చేరుకున్న భర్త మృతదేహాన్ని చూసి భార్య లావణ్య కన్నీరుమున్నీరుగా విలపించింది. రాంబాబు మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు

Updated Date - Sep 01 , 2026 | 12:31 AM