Share News

ఇంజ‘నీరు’ల్లేక.. ఇన్‌చార్జిలే దిక్కు

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:10 AM

Staff shortage in the Irrigation Department జిల్లా జలవనరుల శాఖ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నీటిపారుదల సర్కిల్‌ కార్యాలయం పరిధిలో పూర్తిస్థాయి సిబ్బంది లేక సాగునీటి రంగం కుదేలవుతోంది.

ఇంజ‘నీరు’ల్లేక.. ఇన్‌చార్జిలే దిక్కు
జిల్లా జలవనరుల శాఖ సర్కిల్‌ కార్యాలయం

  • జలవనరుల శాఖలో సిబ్బంది కొరత

  • ఎస్‌ఈ పోస్టుకు ఈఈకి అదనపు బాధ్యతలు

  • నాలుగు సబ్‌ డివిజన్లలో ముగ్గురు ఈఈలకు కూడా..

  • 32 మంది జేఈలకు ఉన్నది 19 మందే

  • కొరవడిన పర్యవేక్షణ..

  • శివారు భూములకు అందని నీరు

  • శ్రీకాకుళం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లా జలవనరుల శాఖ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నీటిపారుదల సర్కిల్‌ కార్యాలయం పరిధిలో పూర్తిస్థాయి సిబ్బంది లేక సాగునీటి రంగం కుదేలవుతోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడ చూసినా ఇన్‌చార్జిల పాలనే దర్శనమిస్తోంది. అధికారుల కొరతతో పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేక, శివారు భూములకు సాగునీరు అందించలేక యంత్రాంగం సతమతమవుతోంది.

  • జిల్లా నీటిపారుదల సర్కిల్‌ కార్యాలయం పరిధిలో ఒక ఎస్‌ఈ, నాలుగు సబ్‌ డివిజన్లకు నలుగురేసి చొప్పున ఈఈలు, డీఈలు, 32 మంది జేఈలు ఉండాలి. కానీ, పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇరిగేషన్‌ డివిజన్‌ కు ఈఈగా పొన్నాడ సుధాకరరావు మాత్రమే రెగ్యులర్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఈయనే జిల్లా జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీరుగా(ఎస్‌ఈ) అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాలుగు సబ్‌ డివిజన్లలో ఏకంగా ముగ్గురు ఇన్‌చార్జిలే వ్యవహరిస్తున్నారు.

  • కీలకమైన స్పెషల్‌ కనస్ట్రక్షన్‌ డివిజన్‌కు తోటపల్లి ప్రాజెక్టు డీఈ బి.గోవిందరావు ఇన్‌చార్జి ఈఈగా కొనసాగుతున్నారు.

  • మరో కీలకమైన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ డివిజన్‌కు శ్రీకాకుళం సబ్‌డివిజన్‌ డీఈ వై.రవీంద్రనాయుడు ఇన్‌చార్జి ఈఈగా వ్యవహరిస్తున్నారు.

  • సాగునీటి పనుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్‌ డివిజన్‌కు శ్రీకాకుళం ఇరిగేషన్‌ డీఈ నాగేశ్వరరావు ఇన్‌చార్జి ఈఈగా బాధ్యతలు చూస్తున్నారు. ఆఖరికి ఈఈలు సైతం ఇన్‌చార్జిలు కావడం, అందులోనూ వారు డీఈలే కావడంతో రెండు విభాగాలకూ పూర్తి న్యాయం జరగడం లేదు.

  • పడకేసిన పర్యవేక్షణ

  • మడ్డువలస, నారాయణపురం, బాహుదా ప్రాజెక్టులు, సగం వరకు తోటపల్లి ప్రాజెక్టుతో పాటు.. జిల్లావ్యాప్తంగా సాగునీటి చెరువులు, మైనర్‌ ఇరిగేషన్‌ పనులు, గెడ్డల నిర్వహణ చూడాల్సింది జలవనరుల శాఖే. వీటికి మరమ్మతులు, కొత్త పనుల ప్రతిపాదనలు, పర్యవేక్షణ, నాణ్యతా నిర్ధారణ తదితరు పనులంతా చేపట్టాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను పరిశీలించడం, కొత్త పనులు చేయించడం అంతా డివిజన్ల వారీగా జేఈలదే బాధ్యత. కానీ, జిల్లాలో జలవనరుల శాఖ పరిధిలో 32 మంది జేఈలకు కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. ఒక్కో జేఈ రెండు, మూడు డివిజన్లలో పనులకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పర్యవేక్షణ సక్రమంగా సాగడం లేదు. శివారు భూములకు సక్రమంగా నీరు అందక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

  • వాస్తవాలు దాస్తున్న అధికారులు

  • సగానికి సగం ఇంజనీర్ల పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని అధికారులు.. ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేయడం లేదు. జిల్లాపరిషత్‌ సమావేశాలకు, జిల్లా సమీక్షా కమిటీ(డీఆర్సీ) వంటి సమావేశాల్లో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సైతం సరైన జవాబులు చెప్పలేకపోతున్నారు. వాస్తవాలు దాస్తుండటంతో ఈ సమస్య జిల్లా ప్రజాప్రతినిధులకూ తెలియట్లేదు. ఇప్పటికైనా ఈ సమస్యపై జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు దృష్టి సారించాల్సి ఉంది. మైనర్‌ ఇరిగేషన్‌ కీలక పనులన్నింటినీ పరుగులెత్తించేలా చర్యలు తీసుకోవాలి.

Updated Date - Apr 05 , 2026 | 12:10 AM