గంటలోనే.. ఆదిత్యుడి దర్శనం
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:02 AM
Arrangements for the Rathasaptami festival అరసవల్లిలో ఈ నెల 19 నుంచి 25 వరకు నిర్వహించనున్న రథసప్తమి ఉత్సవాల్లో ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు తొలి ప్రాధాన్యమిస్తామని ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ తెలిపారు. శనివారం స్వామి ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
రథసప్తమి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు
ఉచిత క్యూలైన్లలో భక్తులకు ప్రాధాన్యం
గతేడాది సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు
అరసవల్లి ఆలయ ఈవో కెఎన్‌వీడీవీ ప్రసాద్
అరసవల్లి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో ఈ నెల 19 నుంచి 25 వరకు నిర్వహించనున్న రథసప్తమి ఉత్సవాల్లో ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు తొలి ప్రాధాన్యమిస్తామని ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ తెలిపారు. శనివారం స్వామి ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు రథసప్తమి ఉత్సవాలు నిర్వహిస్తాం. గత ఏడాది ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సాధారణ భక్తులకు అత్యంత ప్రాధాన్యమిస్తాం. ఉచిత దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఈ ఏడాది రెండు ర్యాంపులను, ప్రసాదాల పంపిణీకి మూడు చోట్ల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు తాగునీరు, పాలు, బిస్కెట్లు అందిస్తాం. పసిపిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా వలంటీర్ల సాయంతో ప్రత్యేక దర్శనం కల్పిస్తాం. క్యూలో వచ్చే భక్తులు గంటలోగా స్వామిని దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. దర్శనం అనంతరం భక్తులు బయటకు వెళ్లేందుకు దక్షిణం వైపు ద్వారం ఏర్పాటు చేశాం. వీవీఐపీలు, డోనర్లకు ఉత్తరద్వారం వైపు బయటకు వెళ్లే మార్గం కేటాయించాం. భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తామ’ని తెలిపారు.
ఏడు రోజులపాటు ప్రత్యేక సేవలు
ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ.. ఆదిత్యుడికి ఏడు రోజులపాటు ప్రత్యేక సేవలు నిర్వహిస్తామని తెలిపారు. ‘19న ఆస్థాన సేవ నిర్వహిస్తాం. ఉత్సవమూర్తులను ఆలయ అనివెట్టి మండపంలో ఉంచి, ప్రపంచ శాంతి కోసం సప్తాహ విన్నపాలు చేస్తాం. సాయంత్రం స్వామివారికి వాహన సేవ చేస్తాం.
20న స్నపన కార్యక్రమం, విశేష అభిషేకాలు నిర్వహిస్తాం.
21న స్వామిని ప్రత్యేకంగా స్వర్ణాలంకార భూషితుని గావించి, భక్తులకు దర్శనాలు కల్పిస్తాం.
22న స్వామికి పుష్పాలంకరణ, లక్ష పుష్పాలతో దేవేరులతో సహా ఉత్సవమూర్తులకు అర్చన నిర్వహిస్తాం.
23న సౌర, అరుణ, త్రిజ మంత్రపూర్వకంగా స్వామికి సామూహిక సూర్యనమస్కారాలు జరుగుతాయి.
24న మహాసౌరయాగం, పూర్ణాహుతి, వేంచేపు సేవ నిర్వహిస్తాం.
25న ఉదయం 8 గంటల వరకు స్వామికి క్షీరాభిషేకం, పట్టువస్త్రాల సమర్పణ, మహన్యాసపూర్వక అభిషేకాలు నిర్వహిస్తాం. తర్వాత సాయంత్రం 4 గంటల వరకు స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది. అనంతరం అలంకరణ సేవ ఉంటుంది. రాత్రి 11 గంటలకు స్వామిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతిస్తాం. అనంతరం పవళింపు సేవతో కార్యక్రమం ముగుస్తుంది’ శంకరశర్మ తెలిపారు. కార్యక్రమంలో వేదపండితులు ఆర్.వికాస్‌శర్మ, పార్థసారధి పాల్గొన్నారు.