వేట సాగక.. వలసబాట
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:08 AM
Fishermen set out in search of livelihood గంగపుత్రుల బతుకులు కన్నీటి సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత సుదీర్ఘమైన 193 కిలోమీటర్ల తీరప్రాంతం జిల్లాలో ఉన్నా.. వేట సక్రమంగా సాగక మత్స్యకారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆగస్టు నుంచి తీర గ్రామాల్లో వేదన మొదలవుతుంది. వేలాదిమంది మత్స్యకారులు గుజరాత్, కర్ణాటక తీరాలకు వలసబాట పడుతున్నారు.
జిల్లా నుంచి గుజరాత్, కర్ణాటకకు
ఉపాధి కోసం మత్స్యకారుల పయనం
మళ్లీ ఏప్రిల్‌లోనే స్వగ్రామాలకు రాక
కళ్లముందే అనంతమైన సంద్రం. కనుచూపు మేరలో పలకరించే అలలు. కానీ గంగ పుత్రులకు కనీస జీవనోపాధి కరువైంది. జిల్లాలో 193 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నా వాడుకోలేని దైన్యస్థితి. ఆధునిక హార్బర్లు, జెట్టీలు లేక సాంప్రదాయ తెప్పలతో వేట గిట్టుబాటు కావడంలేదు. దీంతో ఆగస్టు వచ్చిందంటే ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని తీర గ్రామాల మత్యకారులు వలసబాట పడుతున్నారు. కన్నవారిని, కట్టుకున్న వారిని ఒంటరిని చేసి గుజరాత్, కర్ణాటక తీరాలకు పయనం అవుతున్నారు. మళ్లీ ఏప్రిల్‌లోనే స్వగ్రామాలకు వస్తారు.
ఎచ్చెర్ల, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): గంగపుత్రుల బతుకులు కన్నీటి సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత సుదీర్ఘమైన 193 కిలోమీటర్ల తీరప్రాంతం జిల్లాలో ఉన్నా.. వేట సక్రమంగా సాగక మత్స్యకారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆగస్టు నుంచి తీర గ్రామాల్లో వేదన మొదలవుతుంది. వేలాదిమంది మత్స్యకారులు గుజరాత్, కర్ణాటక తీరాలకు వలసబాట పడుతున్నారు. సొంత ఊరు సముద్ర తీరాన ఉన్నా.. చేపల వేటకు వెళ్తే కనీసం పడవల డీజిల్ ఖర్చులు కూడా రాని పరిస్థితి. సంప్రదాయ తెప్పలు, చిన్న మోటారు బోట్లతో వేటకు వెళ్తే గిట్టుబాటు కాక, మత్స్యకారులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కుటుంబ అవసరాలు, అప్పుల భారం తీర్చుకోవడానికి గుజరాత్‌లోని వీరావల్, కాండ్లా, పోరుబందరు, కర్ణాటకలోని మంగుళూరు తీరాలకు వలసబాట పడుతున్నారు. మళ్లీ ఏప్రిల్‌లోనే స్వగ్రామాలకు చేరుకుంటారు. ఈ 8 నెలలు కన్నవారిని, కుటుంబ సభ్యులను విడిచి.. కడలి సాక్షిగా కష్టాలు పడుతుంటామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు ఒప్పందాలు
వలస ప్రయాణం వెనుక పెద్ద తతంగమే నడుస్తోంది. బోటుడ్రైవర్‌ను గుజరాత్‌లో యజమానులు తండేలు అని పిలుస్తారు. సీజన్‌కు ఏడెనిమిది లక్షల రూపాయల చొప్పున చెల్లించేందుకు డ్రైవర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటారు. సీనియర్ డ్రైవర్‌కు నెలకు రూ. 40వేలు, అసిస్టెంట్‌కు రూ.20వేలు, వంట మనిషి (బండారి), కళాసీలకు రూ.12వేల నుంచి 15వేల వరకు ఇస్తామని ఒప్పుకుంటారు. ఏ నెలకు ఆ నెల జీతం చేతికి ఇవ్వరు. ఏడెనిమిది నెలల శ్రమ ముగిసి స్వగ్రామానికి తిరిగొచ్చేటప్పుడు మాత్రమే ఆ డబ్బు ఇస్తారు. ఆ సమయంలో కూడా వేట సరిగా సాగలేదనో, ఇతర కారణాలు చూపిస్తూ వేతనాల్లో భారీగా కోత విధిస్తారు. యజమానులు ఆగడాలను ప్రశ్నిస్తే అక్కడే కొట్టే పరిస్థితులు ఉన్నా, మిన్నకుండిపోవడం తప్ప వేరే దారి లేకపోతోందని పలువురు మత్స్యకారులు వాపోతున్నారు.
నడిసంద్రంలో నరకం
గుజరాత్ చేరుకున్నాక మత్స్యకారుల బతుకు బోటుకే పరిమితమవుతుంది. ఒక్కసారి అరేబియా సముద్రంలోకి అడుగుపెడితే సుమారు 25 రోజులపాటు బోటులోనే గడపాలి. నడి సంద్రంలో స్నానం చేసేందుకు మంచినీళ్లు ఉండవు. వారాల తరబడి స్నానం లేక తీవ్రమైన చర్మవ్యాధులతో నరకం అనుభవిస్తారు. బోటు ప్రమాదానికి గురైనా, ఏదైనా రోగమొచ్చినా కనీస మందులు ఉండవు. ఒడ్డుకు వచ్చినా విశ్రాంతి గదులు ఉండవు. మళ్లీ ఆ బోటులోనే పడుకోవాలి.
గుజరాత్‌లో ఉన్నది.. మన దగ్గర లేనిదేంటి?
జిల్లా నుంచి ఎక్కువగా మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్తుంటారు. గుజరాత్‌లో వేట లాభసాటిగా ఉండటానికి, మన దగ్గర వలసలు పెరగడానికి స్పష్టమైన వ్యత్యాసం ఉంది. సముద్రతీరం ఆంధ్రప్రదేశ్‌లో 978 కిలోమీటర్లు ఉంటే, శ్రీకాకుళంలోనే 193 కిలోమీటర్లు ఉంది. గుజరాత్‌లో 1,050 కిలోమీటర్ల తీరం ఉంది. మన ప్రాంతంలో సంప్రదాయ తెప్పలు, చిన్న పైబర్‌బోట్లతో, గుజరాత్‌లో రూ.50 లక్షల విలువ చేసే మెకనైజ్డ్ బోట్లతో చేపల వేట సాగిస్తారు. గుజరాత్‌లో ప్రతీ 20-25 కిలోమీటర్లకు జెట్టీ/హర్బర్ ఉంటే, మన రాష్ట్రంలో ఒక్క సరైన జెట్టీ కూడా లేదు. గుజరాత్‌లో కోల్డ్‌స్టోరేజీలు, ల్యాండింగ్ సెంటర్లు ఉండగా, మన రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ఉపాధిహామీ పనులు కూడా అరకొరగా జరుగుతున్నాయి. మత్స్యకారులకు చేపల వేట తప్ప మరో ప్రత్యామ్నాయ వృత్తి తెలియక పోయినా.. ఇటీవల భవన నిర్మాణ కార్మికులుగా చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
అవి పూర్తయితేనే..
జిల్లాలో మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, మంచినీళ్లపేట జెట్టీల నిర్మాణాలు పూర్తయితే వలసల నివారించవచ్చు. బుడగట్లపాలెంలో హార్బర్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపగా నిధులు మంజూరయ్యాయి. పనులు చేపట్టి.. జెట్టీలు పూర్తిచేసి, స్థానికంగా ఆధునిక బోట్లతో వేట సాగించేలా అవకాశాలు కల్పిస్తే ఈ ప్రాంత మత్స్యకారులకు శాశ్వత విముక్తి లభిస్తుంది.
14 ఏళ్లుగా గుజరాత్‌కు వెళ్తున్నా
14 ఏళ్లుగా గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్తున్నాను. వీరావల్‌లో అరేబియా సముద్రంలో చేపటవేట సాగించే బోట్లలో తొలుత కళాసీగా పనిచేశాను. గత 8 ఏళ్లుగా తండేల్‌గా పనిచేస్తున్నాను. ఏటా ఆగస్టులో వలస వెళ్లి... తిరిగి ఏప్రిల్‌లో స్వగ్రామాలకు చేరుతాము. వలసల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలి.
- మూగి మైసేను, తండేలు, డి.మత్స్యలేశం
హార్బర్ నిర్మిస్తే..
సుదూర సముద్ర తీర ప్రాంతం ఉన్న సిక్కోలులో ఒక్క జెట్టీ కూడా లేదు. గుజరాత్‌లో ప్రతి 25 కిలో మీటర్లకు ఒకటి వంతున జెట్టీని నిర్మించారు. దీంతో చేపల వేటకు అనుకూలంగా ఉంది. బుడగట్టపాలెంలో హార్బర్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో వలసల నివారణ సాధ్యమవుతుంది.
- మడ్డు అప్పారావు, కళాసీ, డి.మత్స్యలేశం