అప్పులు భారమై... తీర్చలేననే భయం తోడై
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:02 AM
అప్పులు అధికమయ్యాయి. తీర్చడం ఎలాగో తెలియడం లేదన్న బాధతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పాతపట్నంలో వ్యక్తి ఆత్మహత్య
పాతపట్నం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): అప్పులు అధికమయ్యాయి. తీర్చడం ఎలాగో తెలియడం లేదన్న బాధతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాతపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక రాళ్ల క్వారీ వీధికి చెందిన కొల్లి చిన్నారావు అలియాస్ చంటి (38) గురువారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. స్థానిక యూనియన్ బ్యాంక్ పక్కన చంటి బిర్యానీ అండ్ కర్రీస్ పాయింట్ నిర్వహిస్తూ చిన్నారావు జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం భార్య, పిల్లలకు టిఫిన్ తెచ్చి ఇచ్చి.. బయటకు వెళ్లిపోయాడు. పిల్లలను స్కూల్‌కు దిగబెట్టే సమయం అవుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో భార్య రాణి ఫోన్ చేసింది. ఫోన్‌కు స్పందించక పోవడంతో తమ షాపు వద్దకు వెళ్లింది. షాపు మూసి ఉండడంతో షట్టర్ ఎత్తేందుకు సాయం చేయాలని చిన్నారావు తల్లి వెంకటలక్ష్మికి ఫోన్ చేసింది. దీంతో ఆమె అక్కడికి చేరుకుంది. షట్టర్ ఎత్తి చూసేసరికి షాపులోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ చిన్నారావు కనిపించాడు. వెంటనే మెడకు ఉన్న తాడును కోసి కిందకు దించి.. స్థానిక సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే చిన్నారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య రాణి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.మధుసూదనరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఒడిశా నుంచి వచ్చి...
ఒడిశాలోని బరంపురానికి చెందిన చంటి. .కొన్నాళ్ల కిందట పాతపట్నం వచ్చాడు. చంటి బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించాడు. 2015లో విశాఖపట్నానికి చెందిన రాణితో అతనికి వివాహమైంది. ఈ దంపతులకు ఐదు, మూడు తరగతులు చదువుతున్న ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.కొన్నాళ్ల కిందట పర్లాకిమిడికి చెందిన మరో మహిళతో చంటికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెను పాతపట్నంలోని శివశంకర్ కాలనీలోని మరో ఇంటిలో ఉంచి.. సహజీవనం చేస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. దీన్ని వ్యతిరేకించిన భార్య రాణి కొన్నాళ్ల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్నారావు తల్లి, కుటుంబ సభ్యులు కల్పించుకుని రాణిని ఒప్పించి తిరిగి తీసుకొచ్చారు. భార్య తిరిగి రావడంతో సహజీవనం చేస్తున్న మహిళతో చిన్నారావుకు విభేదాలు తలెత్తాయి. గతంలో తాను ఇచ్చిన బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వాలంటూ చిన్నారావుపై ఇటీవల ఆమె ఒత్తిడి చేసింది. దీనికితోడు బయటి వ్యక్తుల వద్ద సుమారు రూ.30 లక్షల వరకూ అప్పులు ఉన్నాయని, తీర్చడం కష్టమవుతోందని, తాను చనిపోతానని ఇటీవల తరచూ కుటుంబ సభ్యుల వద్ద ప్రస్తావించేవాడు. అయితే తమ వద్ద ఉన్న 14 తులాల నగలు అమ్మేసి అప్పులు తీర్చుకొందామంటూ భార్య, తల్లి ధైర్యం చెబుతూ వచ్చారు. మంగళ, బుధవారాల్లో కొన్ని బంగారు ఆభరణాలు విక్రయించి.. డబ్బు సిద్ధం చేసుకున్నారు. చంటి బిర్యానీ పాయింట్ పేరుతో అందరికీ సుపరిచితుడైన చిన్నారావు మృతితో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి.