Share News

చిల్లంగి అనుమానంతో

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:17 AM

చిల్లంగి అనుమానం పెనుభూతంగా మారి గిరిజన దంపతుల హత్యకు దారితీసింది.

చిల్లంగి అనుమానంతో
హత్యకు గురైన ఇల్లాంగు, జ్యోతి

గిరిజన దంపతుల హత్య

- కత్తితో దాడి చేసి చంపేసిన వైనం

- కొత్తూరు మండలం చిన్నరాజపురంలో ఘటన

మెళియాపుట్టి (కొత్తూరు), ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): చిల్లంగి అనుమానం పెనుభూతంగా మారి గిరిజన దంపతుల హత్యకు దారితీసింది. చిల్లంగి పేరుతో ఓ వ్యక్తి భార్యాభర్తలను హత్యచేశాడు. ఈ ఆ విషయం బయటకు పొక్కకుండా గ్రామస్థులు చూశారు. కానీ, విషయం బయట పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీ చినరాజపురం గ్రామంలో సవర ఇల్లాంగు (55), సవర జ్యోతి(50) అనే దంపతులపై అదే గ్రామానికి చెందిన సవర తోటయ్య అనే వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున కత్తితో దాడిచేసి హతమార్చాడు. మొదట ఇల్లాంగుపై కత్తితో దాడి చేసి చంపేశాడు. అడ్డుకున్న భార్య జ్యోతిని కూడా కత్తితో నరికేశాడు. తోటయ్య కుటుంబీకులు గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా నయం కాకపోవడంతో తోటయ్య ఇటీవల భూతవైద్యుడి వద్దకు వెళ్లాడు. ‘మీ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చిల్లంగి పెట్టడంతో మీ కుటుంబీలకు అనారోగ్యం నయం కావడం లేదని’ ఆ భూత వైద్యుడు చెప్పాడు. దీంతో తోటయ్య.. ఇల్లాంగుపై కక్ష పెట్టుకున్నాడు. ఎలాగైనా ఇల్లాంగును మట్టుబెట్టాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం కత్తితో వెళ్లి ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై దాడి చేసి హత్యచేశాడు. ఈ సమయంలో ఇల్లాంగు, జ్యోతి పిల్లలు పక్క గదిలో నిద్రపోతున్నారు. అయితే, గ్రామస్థులంతా ఏకమై హత్య విషయం బయటకు రాకుండా చూశారు. విషయం ఎలాగో పోలీసులకు తెలియడంతో మంగళవారం రాత్రి సీఐ ప్రసాద్‌, ఎస్‌ఐ వెంకటేష్‌ కొండపైన ఉన్న చినరాజపురం గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. బుధవారం సంఘటనా స్థలానికి టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావుతో పాటు క్లూస్‌ టీం వెళ్లి వివరాలు సేకరించారు. చిల్లంగి పేరుతో హత్యలు జరిగాయా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఆసుపత్రికి తరలించారు.

అమ్మా.. ఆకలేస్తుంది వడ్డించమ్మా..

ఇల్లాంగు, జ్యోతి దంపతులకు కుమార్తె సుజాత, ఇద్దరు కుమారులు కిసాయి (16) రామరాజు( 8) ఉన్నారు. సుజాతకు వివాహమైంది. తల్లిదండ్రులు హత్యకు గురికావడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘మా నాన్నను చంపి మా అమ్మనైనా వదిలేయాల్సింది. మేము చిన్న పిల్లలం. ఎలా బతకాలి. అమ్మా.. ఆకలేస్తుంది వడ్డించమ్మా’ అంటూ కుమారులు రోదిస్తుండడం అక్కడి వారిని కన్నీరుపెట్టిస్తుంది.

వీడని మూడనమ్మకాలు..

ప్రపంచం డిజిటల్‌ రంగం వైపు పరుగులు తీస్తున్నా ఇంకా అనేక గిరిజన ప్రాంతాల్లో మూడ నమ్మకాలు వీడడం లేదు. మూడ నమ్మకాలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు, చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నా గిరిజనుల్లో మార్పురావడం లేదు. చిల్లంగి పేరుతో తరచూ తగదాలు జరిగి హత్యలకు దారితీస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. గతంలో ఇదే పంచాయతీ (గొట్టిపల్లి) పుల్లగూడలో పుల్లక నాయకమ్మ (40)ను అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చిల్లంగి పేరుతో హత్య చేశాడు. ఈ విషయం బయటకు రాకుండా గ్రామస్థులు నాయకమ్మ దహన సంస్కరాలను పూర్తి చేశారు. రెండు రోజుల తరువాత పోలీసులకు ఫిర్యాదు అందడంతో గ్రామానికి చెందిన పదిమంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే, వెలుగుచూడని ఘటనలు ఎన్నో ఉన్నాయి.

Updated Date - Apr 30 , 2026 | 12:17 AM