బంధువులు ముందుకు రాక... తలకొరివి పెట్టేవారు లేక!
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:19 AM
ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ల ఆఖరి ప్రస్థానం అత్యంత దయనీయంగా ముగిసింది.
జలుమూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ల ఆఖరి ప్రస్థానం అత్యంత దయనీయంగా ముగిసింది. తల కొరివి పెట్టే వారు కూడా లేక ఊరి కాని ఊరిలో అంత్యక్రియలు జరిగాయి. ఇదీ మర్రివలసకు చెందిన దాలమ్మ, సరస్వతిల విషాదగాథ. మూఢ నమ్మకాలతో గడ్డిమందు తాగి... ముద్ద దాలెప్పమ్మ, ఆమె కుమార్తెలు కొంగరాపు దాలమ్మ, ముద్ద సరస్వతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇంటివద్ద మృతి చెందిన ముద్ద దాలెప్పమ్మకు అక్క కుమారుడు ఎన్.పెంటయ్య మర్రివలసలో శుక్రవారం తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించాడు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి మృతి చెందిన అక్కాచెల్లెళ్ల మృతదేహాలకు శనివారం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తి చేసిన వైద్యులు...గ్రామస్థులకు అప్పగించారు. వీరికి తలకొరివి పెట్టడానికి బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గ్రామస్థులు శ్రీకాకుళంలోని నాగావళి ఒడ్డున గల స్వర్గధామం నిర్వాహకులకు అంత్యక్రియల నిర్వహణకు మృతదేహాలను అప్పగించారు. ఊరు కాని ఊరిలో ఎవరూ లేని అనాథల్లా వారి అంత్యక్రియలు నిర్వహించడం గ్రామస్థులకు కన్నీరు తెప్పించింది.
పోలీసుల విచారణ
మర్రివలస గ్రామానికి చెందిన తల్లి ముద్ద దాలెప్పమ్మ, కుమార్తెలు కొంగరాపు దాలమ్మ, ముద్ద సరస్వతి మృతిపై నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు శనివారం దర్యాప్తు నిర్వహించారు. మర్రివలస గ్రామానికి చేరుకున్న ఆయన...ముగ్గురి మృతికి గల కారణాలను స్థానికుల నుంచి సేకరించారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాల వద్ద ఉన్న బంధువులు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. ఆసుపత్రిలో మృతి చెందిన కొంగరాపు దాలమ్మ, ముద్ద సరస్వతి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం గ్రామస్థులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ దర్యాప్తులో ఎస్.ఐ. బి.అశోక్‌బాబు పాల్గొన్నారు.