Share News

‘అణు’వంతైనా కదలిక లేక..

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:44 AM

Uncertainty over Kovvada nuclear power project కొవ్వాడలోని అణువిద్యుత్‌ ప్రాజెక్టు విషయంలో మూడు దశాబ్దాలు గడుస్తున్నా అడుగు ముందుకు పడడం లేదు. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ప్రక్రియలు పూర్తయ్యాయి. కానీ ప్లాంట్‌ నిర్మాణం మాత్రం ఇంతవరకూ ప్రారంభం కాలేదు.

‘అణు’వంతైనా కదలిక లేక..
అణు విద్యుత్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన కొవ్వాడ ప్రాంతం

  • కొవ్వాడ అణువిద్యుత్‌ ప్రాజెక్టుపై సందిగ్ధత

  • ఏడాది కిందట సీఎంతో చర్చించిన ప్రధాని

  • అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ ప్రస్తావన

  • అయినా కార్యరూపం దాల్చని వైనం

  • రణస్థలం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): కొవ్వాడలోని అణువిద్యుత్‌ ప్రాజెక్టు విషయంలో మూడు దశాబ్దాలు గడుస్తున్నా అడుగు ముందుకు పడడం లేదు. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ప్రక్రియలు పూర్తయ్యాయి. కానీ ప్లాంట్‌ నిర్మాణం మాత్రం ఇంతవరకూ ప్రారంభం కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై కదలిక వచ్చింది. ఏడాది కిందట స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అణువిద్యుత్‌ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రధాని మోదీ తనతో చర్చించారని.. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించి విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు ప్రకటించారు. దీంతో ఆశలు చిగురించాయి. కానీ ఇంతవరకూ ఎటువంటి ప్రక్రియ ప్రారంభం కాలేదు. తాజాగా ఈ నెల 20న అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మరోసారి కొవ్వాడ అణువిద్యుత్‌ ప్రాజెక్టు కోసం ప్రస్తావించారు. ‘మూడు దశాబ్దాలుగా కొవ్వాడ అణువిద్యుత్‌ పరిశ్రమ ఏర్పాటు విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికీ కొవ్వాడ మత్స్యకారులకు న్యాయం జరగలేదు. అప్పట్లో బడా బాబులకు పరిహారం అందించారు. కానీ ఇళ్లతో పాటు గ్రామాన్ని కోల్పోతున్న వారికి మాత్రం న్యాయం జరగలేదు. అసలు పరిశ్రమ ఏర్పాటు చేస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. నష్ట పరిహారం చెల్లింపులు, పునరావాసం ఏర్పాటుపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల’ని ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ విజ్ఞప్తి చేశారు.

  • మూడు దశాబ్దాల కిందట..

  • 1991లో రణస్థలం మండలం కొవ్వాడ పరిసర ప్రాంతాల్లో అణువిద్యుత్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. లక్ష కోట్ల వ్యయంతో 1208 మెగావాట్ల సామర్ధ్యంతో ఆరు రియాక్టర్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేశారు. దీనిని మొదట్లో మత్స్యకారులు, ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తలు వ్యతిరేకించారు. ప్రజల్లో భయాందోళనలు, అపోహలు నివృత్తి చేసి ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో వారు వెనక్కితగ్గారు. దీంతో మత్స్యకారులు భూసేకరణకు అంగీకరించారు. భూసేకరణతోపాటు పరిహారం చెల్లించారు. కానీ పరిశ్రమ ఏర్పాటు విషయంలో తాత్సారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అణువిద్యుత్‌ పరిశ్రమ ఏర్పాటుపై కదలిక వచ్చింది. అప్పట్లో వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి రాజ్యసభలో.. అణువిద్యుత్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తారా? లేదా? అని ప్రశ్నించారు. దీనిపై అప్పటి మంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ స్పందిస్తూ.. అమెరికా సహకారంతో తప్పకుండా ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఆ తరువాత కూడా ఎటువంటి కదలిక లేదు.

  • 2,079 ఎకరాల భూ సేకరణ

  • అణువిద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం సుమారు 2,079 ఎకరాల భూమిని సేకరించారు. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐఎల్‌) కొవ్వాడ పంచాయతీ పరిధిలోని కొవ్వాడ, చిన్నకొవ్వాడ, టెక్కలి, గూడెం, రామచంద్రాపురం గ్రామాలను నిర్వాసితులుగా ప్రకటించింది. వీటి పరిధిలో 2,079 ఎకాలను సేకరించారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఎన్‌పీసీఐఎల్‌ వారే స్వయంగా ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. అందుకు అనేక ప్రాంతాలను పరిశీలించారు. చివరకు ఎచ్చెర్ల మండలం ధర్మవరంలో నిర్వాసిత కాలనీ ఏర్పాటుకు నిర్ణయించారు. 190 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా పరిహారాన్ని చెల్లించారు. పరిహారం చెల్లింపుల్లో కొంత పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అటు పరిశ్రమ ఏర్పాటుకాక.. ఇటు భూములపై హక్కులు లేక.. మరోవైపు పునరావాస గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం.. మౌలిక వసతులు లేక నిర్వాసితులు గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించి ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

  • యూత్‌ప్యాకేజీ అందించాలి

  • యూత్‌ప్యాకేజీ అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. 2017 నాటికి 18 ఏళ్లు పూర్తికాని చాలామందికి ఇప్పటికీ యూత్‌ప్యాకేజీ అందలేదు. వారందరికీ యూత్‌ప్యాకేజీ అందించాలి. సమస్యలు పరిష్కరించాలి.

    - మైలపల్లి అప్పారావు, కొవ్వాడ

  • సమస్యలు విన్నవించాం

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఈశ్వరరావు దృష్టికి ఇటీవల మా సమస్యలు తీసుకెళ్లాం. నిర్వాసితులందరికీ కాలనీ నిర్మించాలని, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాం.

    - మైలపల్లి పోలీస్‌, మత్స్యకార సంఘ నేత, కొవ్వాడ

Updated Date - Aug 25 , 2026 | 12:44 AM