బరువెక్కిన హృదయాలతో..
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:20 AM
సంక్రాంతి కోసం స్వగ్రామాలకు వచ్చిన వలస జీవులు పండుగ ముగియడంతో మళ్లీ తిరుగుబాట పడుతున్నారు.
- సంక్రాంతి ముగియడంతో తిరుగుబాట పట్టిన జిల్లావాసులు
- బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతాలకు పయనం
- కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
శ్రీకాకుళం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి కోసం స్వగ్రామాలకు వచ్చిన వలస జీవులు పండుగ ముగియడంతో మళ్లీ తిరుగుబాట పడుతున్నారు. బతుకుదెరువు కోసం బరువెక్కిన హృదయంతో సొంత ఊరిని వదిలి సుదూర ప్రాంతాలకు పయనమవుతున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, సూరత్ వంటి ప్రాంతాలకు వేలాది మంది కూలీలతో పాటు అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు, చదువుతున్న విద్యార్థులు తిరిగి వెళ్తున్నారు. దీంతో ఆదివారం ఉదయం నుంచే శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్, ఆమదాలవలస రైల్వే స్టేషన్, పాలకొండ, టెక్కలి, పలాస తదితర ప్రాంతాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపినప్పటికీ అవి సరిపోలేదు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు టిక్కెట్ల ధరలను పెంచేశాయి. రైళ్లలో జనరల్ కంపార్ట్‌మెంట్లు, రిజర్వేషన్ బోగీలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా విశాఖపట్నం, హైదరాబాద్ వైపు వెళ్లే బస్సులు, రైళ్లలో విపరీతమైన రద్దీ కనిపించింది. చేతిలో సంచులు, కళ్లలో ఊరు విడిచి వెళ్తున్నామన్న దిగులుతో ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తూ కనిపించారు. కాగా, సంక్రాంతి సందర్భంగా గత నాలుగు రోజుల పాటు వలస జీవులు, బంధుమిత్రుల పలకరింపులతో కళకళలాడిన పల్లెలు నేడు వారంతా పట్టణ, నగర బాట పట్టడంతో వెలవెలబోతున్నాయి.
మళ్లీ వచ్చే ఏడాదే..
నేను హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నా. ఏడాది అంతా కష్టపడినా, సంక్రాంతికి సొంతూరికి వస్తా. అమ్మనాన్నలు, పిల్లలను చూసిన తరువాత కష్టమంతా మర్చిపోతా. పండుగ అయిపోయింది. మళ్లీ పనిలోకి వెళ్లాలి కదా.. అందుకే బయలుదేరాం. బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది.
-ఎల్.అప్పారావు, వలస కూలీ, రణస్థలం
బాధగా ఉంది
నేను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. సంక్రాంతి కోసం మా ఊరు శ్రీకాకుళం వచ్చాను. అమ్మ చేతి వంట, ఊరి వాతావరణం వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది. కానీ తప్పదు. టికెట్లు దొరకక ప్రైవేట్ బస్సులో ఎక్కువ రేటు పెట్టి వెళ్తున్నాను.
- కె.స్వాతి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, శ్రీకాకుళం.