‘గురు’తర బాధ్యతతో..
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:07 AM
Teaching by Mega DSC Teachers పేద విద్యార్థులకు మెరుగైన విద్య, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమే లక్ష్యంగా మెగా డీఎస్సీ ఉపాధ్యాయులు బోధన సాగిస్తున్నారు. సరిగా ఏడాది కిందట జిల్లాలో 458 మంది ఉపాధ్యాయులు మెగా డీఎస్సీ ద్వారా విధుల్లో చేరారు. గత ఏడాది అక్టోబరు 13న విధుల్లో చేరారు. ఈ ఏడాది కాలం.. ఉద్యోగ జీవితంలో వారికి తొలిమెట్టు మాత్రమే కాదు. ఎన్నో భావోద్వేగాలు, సవాళ్లు, విజయాలు, మరపురాని అనుభవాలను మిగిల్చింది. మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం కొంతమంది ఉపాధ్యాయులు విద్యా వెలుగులు నింపుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆటపాటలతో బోధన సాగిస్తూ.. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల బోధన
విధుల్లో చేరి నేటికి ఏడాది పూర్తి
శ్రీకాకుళం ఎడ్యుకేషన్/ నరసన్నపేట/ మెళియాపుట్టి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు మెరుగైన విద్య, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమే లక్ష్యంగా మెగా డీఎస్సీ ఉపాధ్యాయులు బోధన సాగిస్తున్నారు. సరిగా ఏడాది కిందట జిల్లాలో 458 మంది ఉపాధ్యాయులు మెగా డీఎస్సీ ద్వారా విధుల్లో చేరారు. గత ఏడాది అక్టోబరు 13న విధుల్లో చేరారు. ఈ ఏడాది కాలం.. ఉద్యోగ జీవితంలో వారికి తొలిమెట్టు మాత్రమే కాదు. ఎన్నో భావోద్వేగాలు, సవాళ్లు, విజయాలు, మరపురాని అనుభవాలను మిగిల్చింది. మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం కొంతమంది ఉపాధ్యాయులు విద్యా వెలుగులు నింపుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆటపాటలతో బోధన సాగిస్తూ.. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
మర్చిపోలేని జ్ఞాపకం
తరగతిలో పాఠం ఎలా చెప్పాలో తెలుసుకున్నాను. కానీ తొలిరోజు సుమారు 40 మంది విద్యార్థులను చూసి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. అందరూ మేడమ్ అని పలుకరించడంతో ఒకవైపు ఆనందం.. మరోవైపు ఇంతమంది పిల్లలకు నేను బాధ్యత వహించాలన్న భయం కలిగింది. ఇటీవల గురుపూజోత్సవం నాడు నన్ను సన్మానించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం.
- ముద్దాడ రమ్య, బయాలజీ అసిస్టెంట్, బాలికోన్నతపాఠశాల, బారువ, సోంపేట
వారే నాకు పెద్దసవాల్
పాఠశాలలో కొంతమంది విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపరు. హోంవర్క్ చేయరు. అటువంటి విద్యార్థులే నాకు పెద్ద సవాల్‌గా మారారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను మందలించకుండా.. పాఠశాల సమయం ముగిసిన తర్వాత వారితో మాట్లాడాను. ప్రత్యేక శ్రద్ధ చూపడంతో.. వారిలో క్రమేపీ మార్పు రావడం.. చదువుపై ఆసక్తి పెరగడం ఎంతో ఆనందంగా ఉంది.
- డి.రామారావు, తెలుగు స్కూల్ అసిస్టెంట్, జడ్పీఉన్నత పాఠశాల, కంచిలి
మరుపురాని ఘటన
మా పాఠశాలలో రెండేళ్లు పీడీ పోస్టు ఖాళీగా ఉండేది. నేను పీడీగా చేరిన తర్వాత విద్యార్థులకు క్రీడలపై తర్ఫీదునిచ్చాను. వారు జోనల్‌స్థాయి ఖోఖో, వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చూపారు. ఉద్యోగం వచ్చిన మూడు నెలల్లో జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు అండర్ -19 బాలికల జట్టుకు రాష్ట్రం తరపున మేనేజర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. మధ్యప్రదేశ్‌లో జరిగే మీట్‌కు విద్యార్థులను తీసుకెళ్లే బాధ్యతను ప్రభుత్వం కల్పించింది. ఇది జీవితంలో మరుపురాని సంఘటన.
- వాన దివ్య, పీడీ, జడ్పీ ఉన్నత పాఠశాల, కృష్ణాపురం, మందసం
సార్ అన్న పిలుపు చాలు
ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఆరేళ్లు శ్రమించాను. ఉద్యోగంలో చేరిన తర్వాత తరగతి గదిలో మొదటిసారిగా విద్యార్థులు సార్ అని పిలిచినప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. ఆ పిలుపు చాలు.. అనిపించింది. వారి భవిష్యత్.. మన బాధ్యత అనే భావన కలిగింది.
- మట్ట ఈశ్వరరావు, ఇంగ్లీషు అసిస్టెంట్, వీఎన్.పురం, నరసన్నపేట
అదే ఉత్సాహంతో..
విధుల్లో చేరి ఏడాది పూర్తయింది. గతేడాది అక్టోబరులో పాఠశాలలో చేరి.. ఇప్పటివరకూ అదే ఉత్సాహంతో బోధన సాగిస్తున్నా. విద్యార్థులకు చదువుతోపాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా. రోజూ రెండు లీటర్లు నీరు తాగేలా అలవాటు చేశాను. చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా. ఏకోపాధ్యాయుడ్ని కావడంతో విద్యార్థులతో మరింత మమేకవుతున్నాను.
- ఎస్.కృష్ణప్రసాద్, ప్రాథమిక పాఠశాల, జగతి, కవిటి
ఆటపాటలతో బోధన
మాది సామాన్య కుటుంబం. డైట్ ట్రైనింగ్ పూర్తిచేసి.. డీఎస్సీ రాశాను. తల్లిదండ్రులు చిన్నారావు, కళావతి, భర్త చంద్రశేఖర్ ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉపాధ్యాయురాలినయ్యాను. మారుమూల గిరిజన గ్రామమైన ముకుందపురంలో విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో ఆటపాటలతో బోధన చేపడుతున్నాను.
కె.స్వాతి, ఉపాధ్యాయురాలు, ముకుందపురం, మెళియాపుట్టి
12 మంది విద్యార్థులను చేర్పించా
మాది పేద గిరిజన కుటుంబం. కష్టపడి చదివి డీఎస్సీలో కొలువు సాధించాను. మారుమూల గిరిజన గ్రామం డబారు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ ఏడాది 12 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించాను. గిరిజనుల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాను.
- పడాల ప్రవీణ్‌కుమార్, కొత్తూరు, మెళియాపుట్టి మండలం