ఈ ఏడాదైనా భర్తీ చేస్తారా?
ABN , Publish Date - May 28 , 2026 | 01:04 AM
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల కొరత అధికంగా ఉంది. అదే విధంగా చాలా కాలేజీల్లో క్రీడా మైదానాలు లేవు.
- ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వ్యాయామ అధ్యాపకుల కొరత
- చాలా కళాశాలలకు మైదానాలు కరువు
- కానరాని క్రీడా పోటీలు
- ఆటలకు దూరమవుతున్న విద్యార్థులు
ఇచ్ఛాపురం, మే 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల కొరత అధికంగా ఉంది. అదే విధంగా చాలా కాలేజీల్లో క్రీడా మైదానాలు లేవు. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. గతంలో అంతర్ జూనియర్ కాలేజీ, అంతర్ డిగ్రీ కాలేజీ క్రీడాకారులు అన్న మాట వినిపించేది. కానీ ఇప్పుడు క్రీడా పోటీల్లో ఆ పేరు వినిపించడం లేదు. అంతలా తయారైంది కాలేజీ స్థాయిలో క్రీడల పరిస్థితి. గతంలో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఏటా క్రమం తప్పకుండా విద్యార్థులకు క్రీడా పోటీలు జరిగేవి. కానీ, ఇప్పుడు క్రీడాకారులు బయట అసోసియేషన్ల తరఫున ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొద్దిరోజులుగా కాలేజీ స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం లేకుండా పోతోంది. ముఖ్యంగా క్రీడల్లో విద్యార్థులకు శిక్షణనిచ్చేవారు కరువయ్యారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. దాదాపు పది వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ, వీరికి క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు కనీస స్థాయిలో ఒక్క వ్యాయామ అధ్యాపకుడు సైతం లేకపోవడం దారుణం. అప్పట్లో జూనియర్ కాలేజీ అంటే ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలు కొనసాగేవి. ఏటా క్రమం తప్పకుండా క్రీడా పోటీలు నిర్వహించేవారు. అప్పట్లో వ్యాయామ అధ్యాపకులు ఉండేవారు. కానీ వారు పదవీవిరమణ తరువాత కొత్తగా పోస్టులు భర్తీ చేయలేదు. అలాగని సబ్జెక్టు బోధకుల మాదిరిగా కాంట్రాక్టు ప్రతిపాదికన నియమించలేదు. దీంతో కాలేజీల్లో క్రీడా శిక్షణ లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో పేరుమోసిన ప్రభుత్వ కాలేజీల్లో సైతం క్రీడలకు స్థానం లేకుండా పోయింది.
మైదానాల కొరత..
జిల్లాలో చాలా ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మైదానాలు లేవు. 38 కాలేజీలకుగాను 16 కాలేజీల్లో అస్సలు మైదానాలే లేనట్టు తెలుస్తోంది. ఉన్న మైదానాలు సైతం సరైన నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారాయి. కొన్నిచోట్ల గత వైసీపీ సర్కారు నాడు-నేడు పనుల పేరిట అస్తవ్యస్తంగా మార్చేసింది. భవన నిర్మాణ సామగ్రితో పాటు తొలగించిన భవనాలకు సంబంధించి వేస్ట్ మెటీరియల్‌ను పడేసింది. దీంతో ఆటలు అనేవి లేకుండా పోయాయి. విద్యార్థులు తమకు తాము ఆసక్తితో ఆటలాడుకోవడమే కానీ.. ఆడించేవారు మాత్రం లేకుండా పోయారు. గత ఐదేళ్ల పాటు ప్రభుత్వ కాలేజీల స్థాయిలో క్రీడా పోటీలు కూడా నిర్వహించలేదు. ఎన్నికలకు ముందు గ్రామాల్లో మాత్రం ఆడుదాం ఆంధ్రా పేరిట హడావుడి చేశారు. అంతకు మించి క్రీడల పట్ల గత ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిన దాఖలాలు మాత్రం లేవు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాదైనా వ్యాయామ అధ్యాపకుల నియామకం చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.
దృష్టిపెట్టాం...
వ్యాయామ అధ్యాపక పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాం. జిల్లాలోని 38 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నియామకాలకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రభుత్వం దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. కొన్ని కాలేజీల్లో పీడీ పోస్టులు ఉన్నాయి. కొన్ని పీడీ పోస్టులు కన్వర్సన్ కావడంతో ఖాళీగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో పోస్టుల నియామకానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
- కృష్ణవేణి, ఆర్‌ఐవో, శ్రీకాకుళం