Share News

వదిలేస్తారా?.. పరిష్కరిస్తారా?

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:24 AM

ఇచ్ఛాపురం, పలాస మునిసిపాలిటీల్లో ఎన్నో సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రధానంగా తాగునీరు, పారిశుధ్య వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

వదిలేస్తారా?.. పరిష్కరిస్తారా?
ట్యాంకర్‌ వద్ద నీటిని పట్టుకుంటున్న మహిళలు

- ఇచ్ఛాపురం, పలాస మునిసిపాలిటీల్లో సమస్యల తిష్ఠ

- మౌలిక వసతులు అంతంత మాత్రమే

- అభివృద్ధికి నోచుకోని రహదారులు

- తాగునీటి కోసం తప్పని ఇక్కట్లు

- కాలువలు, రోడ్లపై పేరుకుపోతున్న చెత్త

- వేధిస్తోన్న పారిశుధ్య సిబ్బంది కొరత

- కొత్త పాలకులపై ఆశలు

ఇచ్ఛాపురం, పలాస మునిసిపాలిటీల్లో ఎన్నో సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రధానంగా తాగునీరు, పారిశుధ్య వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. చాలా వార్డుల్లో రెండు, మూడు రోజులకొకసారి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. తగినంతమంది పారిశుధ్య సిబ్బంది లేకపోవడంతో పారిశుధ్య పనులు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. రోడ్లపై, కాలువల్లో చెత్త నిల్వలు పేరుకుపోతున్నాయి. శివారు వార్డులపై కన్నెత్తి చూడడం లేదు. సోమవారం ఈ రెండు మునిసిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. వీరైనా సమస్యలు గుర్తించి పరిష్కరిస్తారా? లేక గత పాలకుల మాదిరిగానే వదిలేస్తారా? అన్నది చూడాలి.

ఇచ్ఛాపురం పురపాలక సంఘంలో..

ఇచ్ఛాపురం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పేరుకే మునిసిపాలిటీ అయినా..మేజర్‌ పంచాయతీ కంటే తక్కువ అన్నట్టు ఉంది ఇచ్ఛాపురం పురపాలక సంఘం పరిస్థితి. దశాబ్దాలుగా పాలకవర్గాలు మారుతున్నాయి తప్ప ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. ప్రధానంగా తాగునీటి సరఫరా, పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 36 వేల మంది జనాభా అని చెబుతున్నా.. ఆ సంఖ్య 50 వేలకుపైగా పెరిగినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టు నీటి సరఫరా లేకుండా పోతోంది. పట్టణ జనాభాకు రోజుకు సగటున 5.10 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం అందులో సగం నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. 1,2,3 వార్డులు (పురుషోత్తపురం), 21,22,23 వార్డులకు (రత్తకన్న) ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భూ మట్టానికి మూడు నుంచి ఐదు అడుగుల గోతులో ఉన్న కుళాయి నుంచి నీటిని పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పట్టణంలో 15 బోర్లు పనిచేయడం లేదని అధికారికవర్గాలు చెబుతున్నాయి. కానీ అంతకు మించి బోర్లు మూలకు చేరాయని తెలుస్తోంది. ముఖ్యంగా రత్తకన్న పరిధిలో చాలా వీధులకు రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.

మూలకు చేరిన పాజెక్టులు

ఉద్దానం ప్రాజెక్టులో భాగంగా బాహుదా నదిలో ఊటబావులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. క్లోరినేషన్‌ చేపట్టిన తరువాత రాజావారితోటలో రిజర్వాయర్‌ ద్వారా పట్టణ అవసరాల కోసం 8 లక్షల లీటర్ల నీటిని ప్రతిరోజూ విడిచిపెడుతున్నారు. అయితే ఈ నీరు ప్రజల అవసరాలకు ఏ మూలకు సరిపోవడం లేదు. రూ.54.48 కోట్ల కేంద్ర నిధులతో పైలెట్‌ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. అది పూర్తయితే కానీ.. పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం లేదు. 1,2,3 వార్డుల పరిధిలోని పురుషోత్తపురం, ఏఎస్‌పేటకు ఏర్పాటు చేసిన పైపులైన్లు లీకులయ్యాయి. ట్రయల్‌ రన్‌ వేసి వదిలేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అరకొరగా సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు. పురుషోత్తపురం పుష్పగిరి కొండపై 5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకర్‌ను నిర్మించి వృథాగా వదిలేశారు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకంలో ఇచ్ఛాపురం మునిసిపాల్టీకి చోటిచ్చారు. కానీ..ఇంతవరకూ నీటిని అందించలేదు. దశాబ్దాల కిందట వేసిన పైపులైన్లు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మురుగునీటి కాలువల గుండా పైపులైన్లు వేశారు. దీంతో తరచూ అవి పగిలిపోయి వ్యర్థాలు కలిసిపోతున్నాయి.

పారిశుధ్య సిబ్బంది కొరత

ప్రస్తుతం మునిసిపాల్టీలో 80 మంది వరకూ పారిశుధ్య కార్మికులు ఉన్నారు. ఇందులో రెగ్యులర్‌ కార్మికులు ఓ ఐదుగురు మాత్రమే ఉన్నారు. చాలీచాలని కార్మికులు ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే పారిశుధ్య పనులు చేస్తున్నట్టు విమర్శలున్నాయి. శివారు ప్రాంతాలకు వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఆదాయ వనరులున్నా..

ఆస్పత్రి రోడ్డులో, మునిసిపల్‌ బాలుర పాఠశాల రోడ్డులోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మొత్తం 20 షాపులు ఉండగా ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ అద్దె రూపంలో మునిసిపాలిటీకి ఆదాయం సమకూరుతోంది. కానీ, శిథిల షాపులను మాత్రం పట్టించుకోవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాలకు మరమ్మతులు చేసి అదనపు అద్దెలు వసూలు చేసేందుకు అవకాశమున్నా పట్టించుకోవడం లేదు.

ముంపు సమస్య..

ఇచ్ఛాపురం పట్టణానికి కూతవేటు దూరంలో ఉంటుంది బెల్లుపడ. ఈ గ్రామంలో 1800 ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌, రబీ సమయాల్లో బాహుదా నుంచి సాగునీరు సక్రమంగా అందదు. కానీ, భారీ వర్షాలు కురిస్తే మాత్రం ముంపు తప్పదు. అందుకే బాహుదా నదికి అడ్డంగా రక్షణ గోడ నిర్మించడంతో పాటు గ్రోయిన్లకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ప్రతి ఏటా ఇబ్బందులు పడుతున్నాం

ప్రతి ఏటా మాకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షా కాలంలో పొలాలు ముంపునకు గురవుతున్నాయి. గ్రోయిన్లు పనిచేయడం లేదు. రాతికట్టు అస్తవ్యస్తంగా ఉంది. ఈ సమస్యలు తప్పాలంటే బాహుదా నదికి అడ్డంగా రక్షణ గోడ నిర్మించాలి. ఆపై గ్రోయిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలి. దీనిపై నూతన పాలకవర్గం స్పందించాలి.

-జీవులురెడ్డి, ఆయకట్టు రైతు, బెల్లుపడ

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా ఉంది. ఎప్పుడో దశాబ్ద కాలం కిందట వేసిన పైపులైన్లు, కుళాయిలు పాడయ్యాయి. ఎప్పుడు నీటి సరఫరా ఉంటుందో? ఉండదో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా నూతన పాలకవర్గం దృష్టిపెట్టాలి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపాలి.

-కాళ్ల ఢిల్లీ, స్థానికుడు, ఇచ్ఛాపురం


పలాస మునిసిపాలిటీలో..

పలాస, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పలాస మునిసిపాలిటీలో ఎన్నో సమస్యలు తిష్ఠ వేశాయి. పారిశుధ్య సిబ్బంది కొరత వేధిస్తోంది. కాలువలు, రోడ్లపై చెత్త పేరుకుపోతుంది. సరైన రోడ్లు లేవు. చాలాచోట్ల రహదారులు విస్తరణకు నోచుకోవడం లేదు. హుద్‌హుద్‌ గృహాల లబ్ధిదారులను ఎంపిక చేసి ఏడేళ్లవుతున్నా ఇప్పటికీ వారికి ఇళ్లను అప్పగించలేదు. పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించడంతో పాటు పురుషోత్తపురం ఎర్రచెరువును పార్కుగా తీర్చిదిద్దాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

సమస్యలు ఇవే..

- ఉదయపురం శివారున ఉన్న మురుగు కాలువ చెత్తచెదారంతో నిండిపోయింది. చెత్త నిల్వలు కొండలా పేరుకుపోయాయి. పట్టణంలోని అనేక కాలువలు ఇలాగే దర్శనమిస్తున్నాయి. పారిశుధ్య సిబ్బంది తగినంతమంది లేకపోవడంతో చెత్త తొలగింపు అంతంత మాత్రంగానే జరుగుతుంది. దీంతో వర్షం పడితే మురుగు నీరంతా పట్టణ రోడ్లపై ప్రవహిస్తుంది.

- కాశీబుగ్గ ఆర్వోబీ నుంచి కోసంగిపురం జాతీయ రహదారి వరకూ ఉన్న రోడ్డును రెండులైన్లగా విస్తరించి సెంటర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలి. ఇందుకు రూ.20 కోట్ల మేరకు నిధులు ఖర్చు అవుతుంది. మొత్తం మూడు కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ రహదారి పలాస-కాశీబుగ్గకు ఆభరణం వంటిది.

-పారిశ్రామికవాడ (ఇంగిలిగాం) రోడ్డు 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకో వడం లేదు. దీంతో పరిశ్రమల సముదాయానికి వెళ్లడానికి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

- నెమలికొండ దిగువన తొమ్మిదేళ్ల కిందట నిర్మించిన హుద్‌హుద్‌ ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వలేదు. 2019లో టీడీపీ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసింది. తరువాత వచ్చిన వైసీపీ రాజకీయ కారణాలతో ఆ ఇళ్లను వారికి కేటాయించలేదు. ప్రస్తుతం రూ.5 కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తేగాని గృహాలు వినియోగంలోకి రాని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలి.

- సూర్యనగర్‌ కాలనీకి సరైన రోడ్లు లేవు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వార్డును రెండు వార్డులుగా చేయడంతో ఇప్పటికైనా కాలనీలో రోడ్లు అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.

-మున్సిపాలిటీలో నిర్మిస్తున్న 3 పట్టణ ఆరోగ్య కేంద్రాల భవనాల్లో రెండు భవనాల పనులు పూర్తయ్యాయి. వాటిని ఎందుకు ప్రారంభించలేదో అధికారులే సమాధానం చెప్పాలి. మరో భవనం పనులు ఐదేళ్లవుతున్నా పూర్తి కాలేదు. నిధులు ఉన్నా పనులు ముందుకు సాగడం లేదు.

-సూదికొండ రోడ్డును 2002లో నిర్మించారు. ప్రస్తుతం శిథిలమైంది. పలాస నుంచి పారిశ్రామికవాడకు వెళ్లేందుకు కూడా ఇదే రహదారి. రహదారి నిర్మించిన తరువాత వేల సంఖ్యలో కొత్త భవంతులు ఈ ప్రాంతంలో నిర్మాణం జరిగాయి. కానీ, రోడ్డు మాత్రం అభివృద్ధి జగరలేదు. కొత్త పాలకులు దీనిపై దృష్టి పెట్టాలి.

- రోడ్లపై చెత్తను వారాల తరబడి తొలగించడం లేదు. పశువులు వాటిని తింటున్నాయి. చెత్తను తొలగించేందుకు చాలినంతగా పారిశుధ్య సిబ్బంది లేరు. ఉన్న వారితోనే పనులు చేయించుకోవాల్సి వస్తోంది. కొత్త సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది.

- పురుషోత్తపురం ఎర్రచెరువు 36 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. చెరువు చుట్టూ ఆక్రమణలు తొలగించి పార్కుగా అభివృద్ధి చేస్తే పట్టణానికి కొత్తశోభ తీసుకువచ్చినట్లవుతుంది. దీంతో పాటుగా మున్సిపాలిటికి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది.

- పలాస ఇందిరాచౌక్‌ నుంచి మొగిలిపాడు గ్రామం వరకూ ఉన్న రోడ్డులో నిత్యం ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. దీంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డును రెండు లైన్లగా విస్తరించి సెంటర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

22plsp1.gif

ఉదయపురం శివారులో మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తచెదారం


నేడు కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు

ఇచ్ఛాపురం/పలాస, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం, పలాస మునిసిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారం కోసం రెండు మునిసిపల్‌ కార్యాలయాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇచ్ఛాపురం చైర్‌పర్సన్‌గా ఆశి లీలారాణితో పాటు 28 మంది కౌన్సిలర్లు, పలాస చైర్‌పర్సన్‌గా వజ్జ గంగాభవానితో పాటు 36 మంది కౌన్సిలర్లు ప్రమాణం స్వీకరాం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆయా మునిసిపాలిటీల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు.

Updated Date - Nov 23 , 2026 | 12:24 AM