ఇలా ఉంటే రోగాలు రావా?
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:55 PM
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.
-ఇచ్ఛాపురంలో అస్తవ్యస్తంగా తాగునీటి వ్యవస్థ
- కాలువల చెంతనే పైపులైన్లు
- వీధుల్లో నిలిచిపోతున్న మురికి నీరు
- ఆందోళనలో ప్రజలు
ఇచ్ఛాపురం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దశాబ్దాల కిందట నాటి పైపులైన్లు, తాగునీటి పథకాలు కావడంతో తరచూ మొరాయిస్తున్నాయి. మురుగు కాలువల్లో పైపులైన్లు ఉంటున్నాయి. వీటి లీకేజీలతో ఒక్కోసారి తాగునీరు కలుషితం అవుతోంది. దీనికితోడు పారిశుధ్యం అధ్వానంగా ఉంది. పనులు సక్రమంగా జరగడం లేదు. కాలువలు, రోడ్లు అన్నీ చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి. ఇటీవల శ్రీకాకుళం కార్పొరేషన్‌లో తాగునీరు కలుషితం కావడంతో డయేరియా ప్రబలింది. అటువంటి పరిస్థితి పట్టణంలో తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సరిపోని తాగునీరు..
ఇచ్ఛాపురంలో 21 వార్డులు ఉన్నాయి. 20 ఏళ్ల కిందట తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో 28 వేల మంది జనాభాకు తగ్గట్టుగా వీటిని వేశారు. కానీ ఇప్పుడు పట్టణంతో పాటు జనాభా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 36 వేల మంది జనాభా అని చెబుతున్నా.. ఆ సంఖ్య 50 వేలకుపైగా పెరిగినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టు నీటి సరఫరా లేకుండా పోతోంది. పట్టణ జనాభాకు రోజుకు సగటున 5.10 మిలియన్ లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం అందులో సగం నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. 1,2,3 వార్డులకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భూ మట్టానికి మూడు నుంచి ఐదు అడుగుల గోతులో ఉన్న కుళాయి నుంచి ప్రజలు నీటిని పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పట్టణంలో 15 బోర్లు పనిచేయడం లేదని అధికారికవర్గాలు చెబుతున్నాయి. కానీ అంతకు మించి బోర్లు మూలకు చేరాయని తెలుస్తోంది. ముఖ్యంగా రత్తకన్న పరిధిలో చాలా వీధులకు రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
మూలకు చేరిన ప్రాజెక్టులు
ఉద్దానం ప్రాజెక్టులో భాగంగా బాహుదా నదిలో ఊటబావులు ఏర్పాటుచేశారు. వాటి ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. క్లోరినేషన్ చేపట్టిన తరువాత రాజావారితోటలో రిజర్వాయర్ ద్వారా పట్టణ అవసరాల కోసం 8 లక్షల లీటర్ల నీటిని ప్రతిరోజూ విడిచిపెడుతున్నారు. అయితే ఈ నీరు ప్రజల అవసరాలకు ఏ మూలకు సరిపోవడం లేదు. రూ.54.48 కోట్ల కేంద్ర నిధులతో చేపడుతున్న పైలెట్ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. అది పూర్తయితే కానీ.. పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం లేదు. 1,2,3 వార్డుల పరిధిలోని పురుషోత్తపురం, ఏఎస్‌పేటకు ఏర్పాటుచేసిన పైపులైన్లు లీకులయ్యాయి. ట్రయల్ రన్ వేసి వదిలేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అరకొరగా సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు. పురుషోత్తపురం పుష్పగిరి కొండపై 5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకర్‌ను నిర్మించి వృథాగా వదిలేశారు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకంలో ఇచ్ఛాపురం మునిసిపాల్టీకి చోటిచ్చారు. కానీ..ఇంతవరకూ నీటిని అందించలేదు. దశాబ్దాల కిందట వేసిన పైపులైన్లు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మురుగునీటి కాలువల గుండా పైపులైన్లు వేశారు. దీంతో తరచూ అవి పగిలిపోయి వ్యర్థాలు కలిసిపోతున్నాయి.
పారిశుధ్యం అంతంతే..
పట్టణంలో పారిశుధ్యం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పట్టణంలోని ప్రధాన ప్రాంతాలకే పారిశుధ్య పనులు పరిమితం అవుతున్నాయి. ప్రస్తుతం మునిసిపాల్టీలో 98 మంది వరకూ పారిశుధ్య కార్మికులు ఉండగా, అందులో కేవలం 8మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు, మిగతా వారంతా ఔట్‌సోర్సింగ్ సిబ్బంది. ఇందులో రెగ్యులర్ కార్మికులు ఓ ఐదుగురు మాత్రమే ఉన్నారు. ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే పనులు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. రోడ్లపై చెత్తను శుభ్రం చేసి తరలిస్తున్నారు. కానీ, మురుగు కాలువల్లో చెత్త తొలగించడం లేదు. ఇప్పటికైనా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
దశాబ్దాలుగా ఇదే పరిస్థితి..
ఇచ్ఛాపురం మునిసిపాల్టీలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా ఉంది. ఎప్పుడో దశాబ్ద కాలం కిందట వేసిన పైపులైన్లు, కుళాయిలు పాడయ్యాయి. ఎప్పుడు నీటి సరఫరా ఉంటుందో? ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపాలి.
-కాళ్ల ఢిల్లీ, స్థానికుడు, ఇచ్ఛాపురం
కనీస సౌకర్యాలు లేవు
మునిసిపాల్టీలో కనీస మౌలిక వసతులు లేవు. పారిశుధ్య సమస్య వెంటాడుతోంది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇప్పటికైనా పాలకులు దృష్టిసారించాలి.
-చాట్ల లోహిదాస్‌రెడ్డి, స్థానికుడు, ఇచ్ఛాపురం
ఇబ్బంది లేకుండా చూస్తున్నాం
మునిసిపాల్టీలో తాగునీటి ఎద్దడి నిజమే. అయినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటిని అందిస్తున్నాం. ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపడుతున్నాం. శివారు ప్రాంతాల్లో సైతం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రత్యేక డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తున్నాం.
-ఎన్.రమేష్, కమిషనర్, ఇచ్ఛాపురం మునిసిపాల్టీ