Share News

మమ అనిపిస్తారా.. చర్చిస్తారా?

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:10 AM

గత జడ్పీ సమావేశాలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యాయి. ప్రజాప్రయోజనం కంటే సభ్యులు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చేవారు.

మమ అనిపిస్తారా.. చర్చిస్తారా?

గత సమావేశాలన్నీ విమర్శలకే పరిమితం

ప్రస్తావించని విలువైన అంశాలు ఎన్నో

ఖరీఫ్‌ వేళ సాగునీటికి రైతుల అవస్థలు

జిల్లాలో ప్రబలుతున్న వైరల్‌ జ్వరాలు

సొంత క్లినిక్‌లకే పరిమితమవుతున్న వైద్యులు

నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

శ్రీకాకుళం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): గత జడ్పీ సమావేశాలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యాయి. ప్రజాప్రయోజనం కంటే సభ్యులు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రజా సమస్యలపై చర్చ చాలా తక్కువగా ఉండేది. విలువైన ఎన్నో అంశాలు ప్రస్తావనకు వచ్చేవి కావు. నేడు (శుక్రవారం) జరగనున్న సమావేశంలోనైనా ప్రజా సమస్యలపై సభ్యులు చర్చించాలని ప్రజలు కోరుతున్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. బహుశా... జడ్పీ సమావేశం ఇదే ఆఖరు కావచ్చు. ప్రధానంగా ఖరీఫ్‌ వేళ రైతులు సాగునీటికి అవస్థలు పడుతున్నారు. ఎరువులు కూడా దొరకడం లేదు. ప్రభుత్వ వైద్యులు సొంత క్లినిక్‌లకు పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటితో పాటు ప్రాంతాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యులు చర్చించాల్సిన అవసరం ఉంది.

ఇవీ సమస్యలు..

ఇటీవలే వంశధార నుంచి అధికారులు సాగునీటిని విడుదల చేశారు. వారం రోజుల గడవక ముందే జలుమూరు మండలంలో ఎడమ ప్రధాన కాలువకు గండి పడింది. ఇప్పటికీ శివారు భూములకు సాగునీరు చేరలేదు. ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా వర్షాలు ముఖం చాటేశాయి. ఉక్కపోత.. ఎండ కూడా తీవ్రంగా ఉండడంతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌లలో నీరు అంతంత మాత్రమే ఉంది. సాగునీరు, ఎరువులపై అర్ధవంతమైన చర్చ జరగాల్సి ఉంది. నారాయణపురం, తోటపల్లి కాలువల ద్వారా శివారు భూములకు సాగునీటి సరఫరాపై చర్చించాలి.

- వాతావరణంలో మార్పులతో జిల్లా అంతటా వ్యాధులు ప్రబలాయి. వైరల్‌ జ్వరాలతో పాటు డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు దోమల మోత తీవ్రంగా ఉంటోంది. ఆసుపత్రిల వారీగా తీసుకుంటున్న చర్యలు అందుబాటులో ఉంచాల్సిన మందులు, నిర్వహించాల్సిన వైద్య శిబిరాలపై సమగ్రంగా చర్చ జరగాలి.

- జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అధిక మంది వైద్యులు ఇలా వచ్చి అలా హాజరు వేసుకుని వెళ్లిపోతున్నారు. సొంత క్లినిక్‌లకు అతుక్కుపోతున్నారు. ప్రభుత్వం నుంచి జీతం మాత్రం ఠంచన్‌గా తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు జరిగాయా.. ఇంతవరకు చర్యలేమైనా తీసుకున్నారా... ఇక్కడి నుంచి విశాఖకు రిఫరల్‌ కేసులు ఎన్ని వెళ్తున్నాయి వంటి అంశాలపై ఆరాతీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

- ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సుమారు 300 వరకు వెంటిలేటర్లు రెండేళ్ల నుంచి మూలకు చేరాయి. వాటిని స్టోర్‌ రూమ్‌లో ఉంచేశారు. గదికి తాళం వేసి భద్రంగా ఉంచారు. కానీ వెంటిలేటర్లకు మరమ్మతులు చేయిద్దాం.. కనీసం సీఎస్‌ఆర్‌ నుంచైనా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటూ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల దృష్టికి రిమ్స్‌ అధికారులు తీసుకువెళ్లలేదు.

- ఆహార కల్తీ నియంత్రణ, తూనికలు కొలతలు, ఎక్సైజ్‌, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ వంటి శాఖలపై ఏనాడూ చర్చ జరగడంలేదు. రెవెన్యూ, ఎక్సైజ్‌ మినహా ఇతర శాఖల అధికారులు కూడా హాజరుకావడంలేదు. పై ఐదు ప్రభుత్వ శాఖల్లో అవినీతి హెచ్చుమీరింది. కాలుష్యం తీవ్రత.. తీసుకుంటున్న చర్యలు.. ప్రజాభిప్రాయ సేకరణ.. ఆసుపత్రిల నుంచి వ్యర్థాల నిర్వహణ.. ఇలా వీటిపై కూడా ప్రజాప్రతినిధుల దృష్టే పెట్టడంలేదు.

- జిల్లాలో జలజీవన్‌ మిషన్‌ పనులు వేగవంతంగా జరగడం లేదు. పైపులైన్ల ఏర్పాటు, పనులు జరుగుతున్న తీరు, నాణ్యతపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో కేవలం సెంటు స్థలం మాత్రమే ఇళ్లపట్టాలుగా పలువురికి ఇచ్చారు. ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకోలేక.. ఖాళీగా ఉన్నవే అధికంగా ఉన్నాయి. వాటి స్థానంలో కూటమి ప్రభుత్వం మరింత విశాలమైన స్థలం కేటాయిస్తామని ప్రకటించింది. ఆశగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. వీటిపై హౌసింగ్‌ అధికారులకు సరైన డైరెక్షన్‌ ఇవ్వాల్సి ఉంది.

- ఈదఫా జరిగే సర్వసభ్య సమావేశమే జడ్పీటీసీలు, ఎంపీపీలకు ఆఖరు కావచ్చు. కొద్దినెలల్లో వారి పదవీ గడువు ముగియనుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది.

Updated Date - Jul 17 , 2026 | 12:10 AM