కేసును పక్కదారి పట్టిస్తారా?
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:04 AM
Yadava community members angry over Appalaraju's conduct వైసీపీ నేత, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు తీరుపై యాదవ సామాజిక వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గలో ఈ నెల 10న రాత్రి సీదిరి కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన ద్విచక్ర వాహనం ఢీకొని.. గొర్రెల కాపరి దుబ్బ దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును తప్పుదారి పట్టించేలా సీదిరి వ్యవహరించారంటూ యాదవ సామాజిక వర్గం ప్రజలు మండిపడ్డారు.
మీ కుమారుడి భవిష్యత్ సరే.. ఆ ఇద్దరు పిల్లలు మాటేంటి..?
అప్పలరాజు తీరుపై యాదవ సామాజికవర్గ ప్రజల ఆగ్రహం
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
కాశీబుగ్గ, జూలై 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు తీరుపై యాదవ సామాజిక వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గలో ఈ నెల 10న రాత్రి సీదిరి కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన ద్విచక్ర వాహనం ఢీకొని.. గొర్రెల కాపరి దుబ్బ దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును తప్పుదారి పట్టించేలా సీదిరి వ్యవహరించారంటూ యాదవ సామాజిక వర్గం ప్రజలు మండిపడ్డారు. మంగళవారం రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, సంఘ పెద్దలు లొడగల కామేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో కాశీబుగ్గ శ్రీనివాసలాడ్జి జంక్షన్ నుండి మూడురోడ్ల కూడలి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అక్కడ బైఠాయించి నినాదాలు చేశారు. దానయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘మీ కుమారుడి భద్రత చూసుకున్నారు. కానీ ఆ ఇద్దరి చిన్నారుల భవిష్యత్ అగాథంలో తోసేస్తారా?’ అంటూ సీదిరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీదిరి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా.. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు వాగ్వాదానికి దిగారు. యాదవ సంఘ నాయకులు లొడగల కామేశ్వరరావు, సప్ప నవీన్, దడియాల నర్సింహులు, వంకల కూర్మారావు మాట్లాడుతూ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన మాజీమంత్రి అప్పలరాజును అరెస్టు చేయాలని డిమండ్ చేశారు. నిజమైన నిందితులకు శిక్ష పడాలని తెలిపారు. ఇంతవరకు బాధిత కుటుంబాన్ని అప్పలరాజు ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. దానయ్య కుటుంబానికి తక్షణమే రూ.30లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆందోళనకారులతో కాశీబుగ్గ సీఐ రామకృష్ణ మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళన నేపథ్యంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో కొండ నర్సింహులు, బి.గోపాల్, డొక్కరి శంకర్, కొరికాన శంకర్, ఎ.కృష్ణమూర్తి పాల్గొన్నారు.