వంశ‘ధార’ వచ్చేనా?
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:16 AM
Gotta Barrage fails to fill to full capacity ఖరీఫ్ సీజన్ ఆరంభమైన వేళ.. వంశధార ప్రాజెక్టు ద్వారా సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి విడుదలకు రెండు తేదీలు మార్పు చేసినా.. ప్రతికూల పరిస్థితులతో సాగునీరందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో నిండని గొట్టాబ్యారేజీ
సాగునీటి విడుదలపై సందిగ్ధం..
టెక్కలి, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ ఆరంభమైన వేళ.. వంశధార ప్రాజెక్టు ద్వారా సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి విడుదలకు రెండు తేదీలు మార్పు చేసినా.. ప్రతికూల పరిస్థితులతో సాగునీరందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశధార ఎడమకాలువ ద్వారా హిరమండలం, ఆమదాలవలస, సారవకోట, కోటబొమ్మాళి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, టెక్కలి, పలాస, వజ్రపుకొత్తూరు తదితర మండలాల పరిధిలో 1,48,230 ఎకరాలకు సాగునీరు అందేది. వంశధార పరిధిలో 1,215 చెరువులు, ఆప్‌టెక్ స్లూయిస్‌లు ఉన్నాయి. కాగా.. వంశధార ప్రధాన ఎడమకాలువ ద్వారా నీటి విడుదలపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 16 నాటికి నీరు విడిచిపెట్టాలని నిర్ణయించగా, ఒడిశా క్యాచ్‌మెంట్ ప్రాంతంలో శోభన, గురండి, మోహన, కాశీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవలేదు. ఎల్‌నినో ప్రభావంతో గొట్టాబ్యారేజీలో అనుకున్నంత నీరు చేరలేదు. దీంతో జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఈ నెల 2 నాటికి నీటి విడుదలకు మరోసారి ముహూర్తం నిర్ణయించినా పరిస్థితి అనుకూలించలేదు. వాస్తవానికి గొట్టాబ్యారేజీ జలాశయం 85 శాతం ఒడిశా క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురిసిన వర్షంపైనే ఆఽధారపడి ఉంది. గొట్టాబ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వలతో ఉండాలంటే 0.61 టీఎంసీ నిల్వలు అవసరం. ప్రస్తుతం గొట్టాబ్యారేజీ 35.6 ఎఫ్‌ఆర్‌ఎల్(ఫుల్ రిజర్వాయర్ లెవల్) నీటిమట్టంతో ఉంది. వంశధార ఎడమకాలువ వెంబడి సాగునీరు విడిచిపెట్టాలంటే కనీసం 37.1 ఎఫ్‌ఆర్‌ఎల్ దాటాలి. అంటే 1.5 ఎఫ్‌ఆర్‌ఎల్ ఇంకా అవసరముంది. ఇప్పటికే వంశధార ప్రధాన ఎడమకాలువ వెంబడి రూ.10.72 కోట్ల నిధులతో పనులు చేశారు. వంశధార కాలువ నుంచి సాగునీరు వస్తే తప్ప 25కుపైగా ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 30వేల ఎకరాలకు సాగునీరు అందదు. ఈ నేపథ్యంలో రైతులు ఎప్పుడు సాగునీరు విడిచిపెడతారా? అని ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై వంశధార ఈఈ బి.శేఖరరావు వద్ద ప్రస్తావించగా ‘ఈసారి ఒడిశా క్యాచ్‌మెంట్ ప్రాంతంలో ఆశించినస్థాయిలో వర్షాలు కురవలేదు. అందుకే నీరు విడిచిపెట్టడంలో జాప్యమవుతోంది. గొట్టాబ్యారేజీలో 37.1ఎఫ్‌ఆర్‌ఎల్ దాటితే తప్ప నీటిని విడిచిపెట్టలేమ’ని తెలిపారు.