Share News

సిక్కోలుకు వరాలు కురిసేనా?

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:57 PM

Union Budget today.. ఉత్తరాంధ్ర సిగలో వెనుకబాటు ఇంకా వెక్కిరిస్తూనే ఉంది. జిల్లాలో జీవనదులు ఉన్నా.. వలస బతుకులు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై జిల్లావాసులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

సిక్కోలుకు వరాలు కురిసేనా?

  • నేడు కేంద్ర బడ్జెట్‌..

  • భారీ అంచనాల్లో జిల్లావాసులు

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌, ఎంపీ కలిశెట్టి చొరవపైనే ఆశలు

  • శ్రీకాకుళం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర సిగలో వెనుకబాటు ఇంకా వెక్కిరిస్తూనే ఉంది. జిల్లాలో జీవనదులు ఉన్నా.. వలస బతుకులు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై జిల్లావాసులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. జిల్లా అభివృద్ధికి ఈ బడ్జెట్‌ ఒక అవకాశంగా మారుతుందా? దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందా? అనేది చర్చనీయాంశమైంది. జిల్లాకు చెందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్రంలో కీలకమైన పౌరవిమానయానశాఖ మంత్రిగా ఉండటం, పొరుగున విజయనగరం ఎంపీగా (జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధి) కూటమికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు ప్రాతినిఽథ్యం వహిస్తుండటంతో ఈసారి బడ్జెట్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి. వీరిద్దరూ సమన్వయంతో రైల్వే, జలశక్తి, రహదారుల శాఖల నుంచి జిల్లాకు గణనీయమైన నిధులు రాబట్టగలరని ప్రజలు, పారిశ్రామికవేత్తలు గట్టి నమ్మకంతో ఉన్నారు. వలసల నివారణకు చెక్‌పెట్టేలా.. పోర్టులు, విమానాశ్రయం అభివృద్ధితోపాటు ప్రాజెక్టుల పురోగతికి కృషి చేస్తారని భావిస్తున్నారు. జిల్లాలో రైల్వే మౌలిక వసతుల కల్పనకు ఈసారి నిధుల కేటాయింపులో న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు.

  • ఆకాంక్షలు ఇవే...

  • నౌపడ-గుణుపూర్‌ (వయా థెరుబలి): ఈ లైన్‌ నిర్మాణం జరిగితే జిల్లా వాణిజ్య రూపురేఖలు మారిపోతాయి. రూ.900 కోట్లకుపైగా అంచనా వ్యయం ఉన్న ఈ ప్రాజెక్టుకు, ఈ బడ్జెట్‌లో కనీసం రూ.500 కోట్లు కేటాయిస్తేనే భూసేకరణ పనులు వేగం పుంజుకుంటాయి.

  • పలాస ఫ్లైఓవర్‌(ఆర్వోబీ): పలాసలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు ప్రతిపాదించిన రైల్వే ఫ్లైఓవర్‌ పనులు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. ఈసారైనా పూర్తిస్థాయి నిధులు కేటాయించి పనులు కొలిక్కి తేవాలి.

  • డైరెక్ట్‌ రైళ్లు.. హాల్టింగ్‌... : జిల్లా నుంచి ఉపాధి, విద్య కోసం హైదరాబాద్‌, తిరుపతి వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంది. శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) స్టేషన్‌ నుంచి ఈ నగరాలకు ప్రత్యేకంగా ‘డైరెక్ట్‌ రైళ్లు’ కేటాయించాలన్నది దశాబ్దాల డిమాండ్‌. అలాగే పలాస, శ్రీకాకుళం రోడ్‌ స్టేషన్లలో వందేభారత్‌ రైలుకు హాల్టింగ్‌ ఇవ్వాలి.

  • అమృత్‌ భారత్‌కు ఎంపికైన శ్రీకాకుళం రోడ్‌, ఇచ్ఛాపురం స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలి.

  • మూలపేట పోర్టు కనెక్టివిటీ... : జిల్లా భవిష్యత్తును మార్చే గేమ్‌చేంజర్‌ ‘మూలపేట పోర్టు’. సరకు రవాణా సులభతరం చేసేందుకు రైల్వేలైన్‌ అనుసంధానానికి బడ్జెట్‌ నుంచి లేదా సాగరమాల ద్వారా నిధులు సాధించాల్సి ఉంది.

  • భోగాపురం కనెక్టివిటీ : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జిల్లా సరిహద్దులో ఉంది. ఎచ్చెర్ల, శ్రీకాకుళం టౌన్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ను అనుసంధానించే రహదారుల అభివృద్ధికి, పారిశ్రామిక కారిడార్లకు నిధులు రాబట్టాలి.

  • వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో ‘కిసాన్‌ డ్రోన్‌’ పథకం కింద రైతులకు రాయితీలు ఇవ్వాలి. తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా సీప్లేన్‌ పాలసీలో జిల్లాకు చోటు కల్పించాలి. మత్స్యకారులకు ఆధునిక జెట్టీలు, కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించాలి.

  • హిరమండలంలోని రిజర్వాయర్‌ ఫేజ్‌-2 పూర్తి వినియోగంలోకి రావాలంటే నిర్వాసితుల పరిహారం, ఇతర పనులకు భారీ నిధులు కావాలి. దీనికి ‘ప్రధానమంత్రి కృషి సించాయి యోజన’ కింద నిధులు మంజూరు చేయించడంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి.

  • ఉద్దానంలో జీడిపప్పు, కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు కేంద్రం ప్రత్యేక క్లస్టర్లను ప్రకటించి, ‘ఫుడ్‌ ప్రాసెసింగ్‌’ యూనిట్లకు రాయితీలు ఇవ్వాలి. అలాగే కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌కు ఐసీఎంఆర్‌ ద్వారా జాతీయస్థాయి నిధులు కేటాయించాలి.

  • రణస్థలం, నరసన్నపేట హైవే జంక్షన్లలో ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తిచేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

  • నిధులు సాధిస్తేనే అభివృద్ధి

  • కేంద్ర క్యాబినేట్‌లో రామ్మోహన్‌నాయుడు ఉండటం, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు క్రియాశీలకంగా ఉండటం జిల్లాకు కలిసివచ్చే అంశం. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కనెక్టివిటీ, జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌-16) విస్తరణ, మూలపేట పోర్టుకు రైల్వే లైన్‌ వంటి అంశాలపై వీరిద్దరూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధిస్తే జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.

    - పి.సత్యనారాయణ, సీనియర్‌ ఆర్థిక విశ్లేషకులు

Updated Date - Jan 31 , 2026 | 11:57 PM