ఇనాం సమస్య పరిష్కారమయ్యేనా?
ABN , Publish Date - May 31 , 2026 | 11:53 PM
ఈ ముగ్గురు రైతులే కాదు సుమారు 200 మంది రైతులు ఇదే సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
70 ఏళ్లుగా కొత్తమారడికోట రైతుల ఇబ్బందులు
440 ఎకరాలకు పట్టాలు లేక ఇక్కట్లు
వెబ్‌ల్యాండ్‌లో మాత్రం అధిక భూములు నమోదు
ప్రభుత్వ పథకాలు, రాయితీలు దూరం
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
- మెళియాపుట్టి మండలం కొత్తమారడికోట గ్రామానికి చెందిన ఇప్పిలి రామకృష్ణ అనే రైతుకు వాస్తవానికి ఎకరా 50 సెంట్ల భూమి ఉంది. కానీ, వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 100 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నట్లు రామకృష్ణ ఆవేదన చెందుతున్నాడు.
- కొత్తమారడికోటకు చెందిన మహిళా రైతు నీలాపురం సాయమ్మకు 10 సెంట్ల భూమి ఉండగా, వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 50 ఎకరాలు చూపిస్తోంది. భూమి అధికంగా కనిపిస్తుండడంతో ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఐదు ఎకరాలు దాటి భూమి ఉందని, పింఛన్ మంజూరు చేయడం కుదరని అధికారులు చెబుతుండడంతో ఆమె ఆందోళన చెందుతుంది.
- ఇదే గ్రామానికి చెందిన నందిగాం ధనంజయ్‌ది కూడా ఇదే పరిస్థితి. ఈయనకు మూడు ఎకరాలు ఉంటే 60 ఎకరాలు ఉన్నట్లు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కావడంతో ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నాడు.
మెళియాపుట్టి, మే 31 (ఆంధ్రజ్యోతి): ఈ ముగ్గురు రైతులే కాదు సుమారు 200 మంది రైతులు ఇదే సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్హత ఉన్నా వెబ్‌ల్యాండ్‌లో భూమి ఎక్కువగా చూపిస్తుండడంతో ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. కొత్తమారడికోట రెవెన్యూ పరిధిలో సుమారు 440 ఎకరాలు ఇనాం భూములు ఉన్నాయి. 1956లో జరిగిన సర్వేలో నలుగురు ఇనాందార్లకు ఈ భూములను కేటాయించారు. అయితే, ఈ భూములను కొత్తమారడికోట, పాతమారడికోట, అన్నాపురం, తమలపురం గ్రామాలకు చెందిన 200 మంది రైతులు గత 70 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. దీంతో తమకు పట్టాలు ఇవ్వాలని రైతులు దరఖాస్తులు చేస్తున్నా ఇంత వరకు ప్రయోజనం కనిపించలేదు. కానీ, వారి ఆధార్‌కార్డులతో ఈ భూములు లింక్ అయ్యాయి. దీనివల్ల వెబ్‌ల్యాండ్‌లో కొందరి పేర్ల మీద ఇవవై, యాభై ఎకరాలు ఉన్నట్లు చూపిస్తుంది. కానీ, పట్టాదారు పాసుపుస్తకాలు గానీ, అడంగళ్, 1బీలు గానీ రావడం లేదు. ఫలితంగా ఆ భూములు కేవలం సాగు చేసుకోవడమే తప్పా అమ్మకాలు, కొనుగోలుకు అవకాశం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క వీరికి భూములు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వ పథకాలను అధికారులు అందించడం లేదు. కాగా, గతంలో నలుగురు ఇనాందార్లు ఉండగా ప్రస్తుతం 16 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇనాం చట్టం ప్రకారం ఇనాందార్లకు భూమిలో 30 శాతం వాటా ఇవ్వాలి. కానీ, కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో గత 70 ఏళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన సరోజమ్మ ఇనాందార్లను పిలిపించి భూములను సర్వే చేశారు. రైతులు, ఇనాందార్లతో సమావేశం ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం. గత వైసీపీ ప్రభుత్వం ఇనాం భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, ఉన్న భూములను 22ఏలో చేర్చడంతో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వ వచ్చిన తరువాత ఇనాం భూముల వివరాలను సేకరిస్తుండడంతో తమ సమస్య పరిష్కారమవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం
మేము సాగు చేస్తున్న భూములను అమ్మాలన్నా.. కొనుగోలు చేయలన్నా వీలుకావడం లేదు. 70 ఏళ్లుగా సాగు చేస్తున్నా పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. గతంలో ఎన్నోసార్లు అధికారులకు దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇనాం భూముల వివరాలు సేకరిస్తుండడంతో ఆశలు కనిపిస్తున్నాయి.
-తిరుపతిరావు, రైతు, కొత్తమారడికోట
ఆదేశాలు వచ్చాయి
కొత్తమారడికోట రెవెన్యూ సమీపంలో 440 ఎకరాల వరకు ఇనాం భూములు ఉన్నాయి. వాటిపై పూర్తి హక్కులు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇనాందార్లు ఉండడం వల్ల వాటిని రైతులకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇటీవల ఇనాం భూముల సమస్య పరిష్కారానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు రైతులు, ఇనాందార్ల వివరాలు అందించాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చినా అమలు చేస్తాం.
-బి.పాపారావు, తహసీల్దార్, మెళియాపుట్టి