లక్ష్యం నెరవేరేనా?
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:26 PM
Uncollected property tax మునిసిపాలిటీలకు ఆస్తిపన్నే ప్రధాన ఆదాయ వనరు. పన్నులు సకాలంలో వసూలు చేస్తే వాటి ద్వారా ఏటా రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతాయి. కాగా మునిసిపాలిటీల్లో ఆశించినస్థాయిలో ఆస్తిపన్ను వసూలు కావడం లేదు.
మునిసిపాలిటీల్లో సక్రమంగా వసూలుకాని ఆస్తిపన్ను
ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు
జిల్లాలో ఇప్పటివరకూ 60శాతం మాత్రమే వసూలు
పలాస, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలకు ఆస్తిపన్నే ప్రధాన ఆదాయ వనరు. పన్నులు సకాలంలో వసూలు చేస్తే వాటి ద్వారా ఏటా రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతాయి. కాగా మునిసిపాలిటీల్లో ఆశించినస్థాయిలో ఆస్తిపన్ను వసూలు కావడం లేదు. ఈ నెలాఖరులోగా శతశాతం వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించగా.. జిల్లాలో ఇప్పటివరకూ 60 శాతం మాత్రమే వసూలైంది. మునిసిపల్, సచివాలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినా.. చాలామంది ఆస్తిపన్ను చెల్లించేందుకు వెనుకంజ వేస్తున్నారు. అధికంగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కూడా పన్నుల బకాయిలు పేరుకుపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు.
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ఈ ఏడాది ఆస్తి పన్ను లక్ష్యం రూ.6.17 కోట్లు కాగా ఇప్పటివరకూ రూ.4.31 కోట్లు వసూలు చేశారు. గత ఏడాది ఇదే సమయానికి సగం కూడా పన్నులు వసూలు కాలేదు. ఉన్నతాధికారుల ఒత్తిడితో చివరికి లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ ఏడాది మాత్రం ముందుగా మొండి బకాయిలపై దృష్టి పెట్టి వసూలు చేశారు. అనంతరం పెద్ద పద్దులపై దృష్టి సారించారు. ఇక మిగిలింది కోర్టు వివాదాల్లో ఉన్నవి, ప్రభుత్వ కార్యాలయాల బకాయిలే. వీటిపై ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చించి పన్నుల వసూలుకు చర్యలు చేపడుతున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు ఆమదాలవలస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో కూడా గడువులోగా శతశాతం ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆస్తిపన్ను వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు.
జిల్లాలో ఆస్తిపన్ను వసూలు ఇలా.. (రూ.కోట్లలో)
-------------------------------------
మునిసిపాలిటీ లక్ష్యం వసూలు
---------------------------------------------
శ్రీకాకుళం కార్పొరేషన్ 27.4 17.6
ఆమదాలవలస 3.40 2.18
పలాస-కాశీబుగ్గ 6.17 4.31
ఇచ్ఛాపురం 3.02 1.75
లక్ష్యాన్ని సాధిస్తాం
ఈ నెలాఖరులోగా ఆస్తిపన్ను వసూలు లక్ష్యం సాధించేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఇంటింటికీ వెళ్లి పన్నుల కట్టడం వల్ల ప్రయోజనాలు, కట్టకపోతే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. కొంతమంది వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. సకాలంలో పన్నులు చెల్లించిన వారికి ప్రభుత్వం మినహాయింపు కూడా వర్తింపజేస్తోంది. దీనిని అందరూ వినియోగించుకోవాలి.
- అమర్‌నాథ్, రెవెన్యూ అధికారి, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ