లక్ష్యం నెరవేరేనా?
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:01 AM
House tax collection slowly జిల్లాలో ఇంటి పన్నుల వసూలు నత్తనడకన సాగుతున్నాయి. శతశాతం ఇంటి పన్ను వసూలైతేనే.. పట్టణాలు, గ్రామాలో అభివృద్ధి సాధ్యం. ఇంటిపన్ను వసూళ్ల సొమ్మును పంచాయతీల లైటింగ్‌కు, పారిశుధ్య నిర్వహణకు, తాగునీటి అవసరాలకు 15 శాతం చొప్పున, సిబ్బంది జీతభత్యాలకు 50 శాతం, పంచాయతీ అవసరాలకు ఐదు శాతం నిధులు వెచ్చిస్తుంటారు.
నత్తనడకన ఇంటిపన్ను వసూలు
జిల్లాలో బకాయిలు రూ.17.90 కోట్లు
ప్రభుత్వ శాఖల భవనాలవే అధికం
ఆన్‌లైన్ చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు
సమీపిస్తున్న గడువు
టెక్కలి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి):
టెక్కలి మేజర్ పంచాయతీ 8,462 ఇళ్లు, షాపులు, ఇతరత్రా భవనాల ద్వారా ఇంటిపన్ను రూ.1.24 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటివరకూ రూ.37 లక్షలు మాత్రమే వసూలైంది. ప్రభుత్వ శాఖల నుంచి రూ.8లక్షలు.. మిగిలిన ఇళ్ల నివాసదారుల నుంచి సుమారు రూ.79 లక్షలు వసూలు చేయాల్సి ఉంది.
జిల్లాలో ఇంటి పన్నుల వసూలు నత్తనడకన సాగుతున్నాయి. శతశాతం ఇంటి పన్ను వసూలైతేనే.. పట్టణాలు, గ్రామాలో అభివృద్ధి సాధ్యం. ఇంటిపన్ను వసూళ్ల సొమ్మును పంచాయతీల లైటింగ్‌కు, పారిశుధ్య నిర్వహణకు, తాగునీటి అవసరాలకు 15 శాతం చొప్పున, సిబ్బంది జీతభత్యాలకు 50 శాతం, పంచాయతీ అవసరాలకు ఐదు శాతం నిధులు వెచ్చిస్తుంటారు. కాగా జిల్లాలో ఈ నెల 15 నాటికి శతశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని లక్ష్యం విధించినా.. ఆశించినస్థాయిలో వసూలు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.31,56,73,000 వసూలు లక్ష్యం. కాగా.. ఇప్పటివరకు రూ.13,66,14,000 మాత్రమే వసూలైంది. ఇంకా రూ.17,90,59,000 బకాయి ఉంది. ఇందులో ప్రభుత్వ శాఖల బకాయిలే రూ.కోట్లలో ఉండడం విశేషం. ఇంటిపన్నుల వసూళ్లలో హిరమండలం, టెక్కలి, కోటబొమ్మాళి, మందస, సోంపేట, ఇచ్ఛాపురంరూరల్, కవిటి, నరసన్నపేట, గార, పొందూరు, శ్రీకాకుళం రూరల్ వంటి మండలాలు కాస్త వెనుకబాటుగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మేజర్‌పంచాయతీలైన కవిటి, బారువ, మందస, హరిపురం, రాజపురం, ఈదుపురం, బ్రాహ్మణతర్లా, టెక్కలి, కోటబొమ్మాళి, కస్పానౌపడా, పొందూరు, పాతపట్నం, హిరమండలం, శ్రీకూర్మం వంటి పంచాయతీల్లో సైతం పన్నుల వసూళ్లలో తాత్సారం నెలకొంది. గడువు సమీపిస్తుండడంతో.. శతశాతం లక్ష్యం నెరవేరుతుందో.. లేదోనని కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు.
ఇబ్బందులు :
గతంలో పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన డిమాండ్ నోటీసు మేరకు ఇంటిపన్ను చెల్లించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. స్వర్ణపంచాయతీ అనే పోర్టల్‌లో ఇంటిపన్నులు ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి. ఇప్పటికే ఇంటిపన్ను, ఆధార్, మొబైల్ లింక్ కావడంతో సంబంధిత ఎసెస్‌మెంట్ పరిశీలించగానే ఎంత బకాయి ఉందో తెలిసిపోతుంది. కాగా సర్వర్ సమస్యలు, సాంకేతికలోపాలు, డిజిటల్ చెల్లింపులపై కొంతమందికి అవగాహన లేకపోవడం వంటి కారణాలతో పన్నుల చెల్లింపులో జాప్యమవుతోంది. పన్నుల వసూలు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఎంవీ కృష్ణతేజ ఇటీవల డీడీవో, డీఎల్‌పీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, కార్యదర్శులకు ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు లక్ష్యసాధన కోసం అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇంటిపన్ను లక్ష్యం ఇలా..
-------------------
టెక్కలి డివిజన్ రూ.9,25,43,000
పలాస డివిజన్ రూ.6,26,93,000
శ్రీకాకుళం డివిజన్ రూ.16,04,37,000
----------------------------------------------
మొత్తం : రూ.31,56,73,000
------------------------------------------
స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం
ఈనెల 15 నాటికే శతశాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఇంటిపన్నులతో పాటు ఇతర పన్నులు కూడా వసూలు చేయాలని కార్యదర్శులు, సిబ్బందికి దిశ నిర్దేశించాం. శతశాతం వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం.
- ఐవీ రమణ, డీఎల్‌పీవో