Share News

అటవీ ఉత్పత్తుల కొనుగోలు లక్ష్యం చేరుకునేనా?

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:41 AM

అటవీ ఉత్పత్తుల కొనుగోలు లక్ష్యాన్ని సాధించేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) తీవ్రంగా శ్రమిస్తోంది.

 అటవీ ఉత్పత్తుల కొనుగోలు లక్ష్యం చేరుకునేనా?
పాతపట్నంలోని గిరిజన సహకార సంస్థ

- ఈ ఏడాది రూ.67లక్షలుగా నిర్దేశించిన జీసీసీ

- ఇప్పటి వరకు రూ.40లక్షలకు చేరిక

- చింతపండుకు అధిక ధర చెల్లిస్తున్న ప్రైవేట్‌ వ్యాపారులు

- వారికే పంటను విక్రయిస్తున్న గిరిజనులు

పాతపట్నం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): అటవీ ఉత్పత్తుల కొనుగోలు లక్ష్యాన్ని సాధించేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) తీవ్రంగా శ్రమిస్తోంది. మరో రెండు వారాల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు అటవీ ఉత్పత్తుల కొనుగోలును ముమ్మరం చేసింది. అయితే, చింతపండు వంటి అటవీ ఫలాలకు సంబంధించి జీసీసీ ప్రకటించిన మద్దతు ధరకంటే ప్రైవేట్‌ వ్యాపారులు చెల్లిస్తున్న ధరే ఎక్కువగా ఉంటుంది. దీంతో గిరిజనులు తమ పంటలను ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అయితే, ఆ వ్యాపారులు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2024-25 ఆర్థికసంవత్సరంలో అటవీ ఉత్పత్తుల కొనుగోలు లక్ష్యం రూ.25 లక్షలుగా నిర్దేశించారు. గిరిజన సంఘాల డిమాండ్‌, అఽధికారుల ప్రతిపాదనల మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కొనుగోలు లక్ష్యం రూ.67లక్షలుగా నిర్దేశించారు. ఈ మేరకు పాతపట్నం గిరిజన సహకార సంఘం మందస మండలంలోని బసవసాయి, మెళియాపుట్టి మండలంలోని నేలబొంతు, అర్చనాపురంతో పాటు పాతపట్నం, బైదలాపురం తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. కొండచీపురు మొదటి రకం రూ.45, రెండోరకం రూ.40, మూడో రకం రూ.35, కేజీ కుంకుడు కాయలు రూ.35, కిలో నరమామిడి రూ.18, కేజీ నల్ల జీడిపిక్కలు రూ.35, కిలో చింతపండు రూ.36కు జీసీసీ కొనుగోలు చేస్తుంది. మొత్తం కొనుగోలు లక్ష్యం రూ.67లక్షలు అయితే ఇప్పటి వరకు రూ.40లక్షల వరకే చేరుకున్నారు. మరో రెండు వారాల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో కొనుగోలు లక్ష్యం చేరుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈనెలాఖరులోగా లక్ష్యాన్ని పూర్తిచేస్తామని జీసీసీ మేనేజర్‌ చెబుతున్నారు.

ప్రైవేట్‌ వ్యాపారుల హవా..

ఈ ఏడాది చింతపండు దిగుబడి తక్కువగా ఉంది. దీంతో ప్రైవేటు వ్యాపారులు అధిక ధర చెల్లించి గిరిజనుల నుంచి చింతపండును కొనుగోలు చేస్తున్నారు. కిలో చింతపండుకు జీసీసీ రూ.36 చెల్లిస్తుండగా, ప్రైవేట్‌ వ్యాపారులు మాత్రం రూ.60 చెల్లిస్తున్నారు. దీంతో గిరిజనులు వారికే పంటను విక్రయిస్తుండడంతో అధికారులు ఖంగుతింటున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై పాతపట్నం జీసీసీ మేనేజర్‌ గొర్లె నరసింహులును వివరణ కోరగా.. ‘చింతపండు ధర పెంచాలనే అంశాన్ని, క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం త్వరలోనే సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.

Updated Date - Mar 14 , 2026 | 12:41 AM