Share News

చి‘వరి’కి గండం గట్టేక్కేనా?

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:19 AM

Anxiety among farmers బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రైతుల్లో గుబులు రేగుతోంది.

చి‘వరి’కి గండం గట్టేక్కేనా?
రావాడపేట వద్ద యంత్రంతో వరిపంట నూర్పు చేస్తున్న రైతులు

  • అల్పపీడనంతో అన్నదాతల్లో గుబులు

  • వరిపంటను భద్రం చేసేందుకు పాట్లు

  • నరసన్నపేట/ శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రైతుల్లో గుబులు రేగుతోంది. జిల్లాలో ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో 4.50 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. ఈ ఏడాది ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల్లో 3.80 లక్షల ఎకరాల్లో మాత్రమే వరిసాగు చేశారు. నందిగాం, టెక్కలి, కవిటి, ఇచ్ఛాపురం, కంచిలి, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, మందస, పోలాకి తదితర మండలాల్లో వరిపంట కోత దశకు చేరుకుంది. ఇటీవల అర్నబ్‌, మురసు తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో సుమారు 20వేల ఎకరాల్లో వరిపంట ముంపునకు గురైంది. తాజాగా మరో తుఫాన్‌ ముప్పు పొంచి ఉండడంతో మిగిలిన వరిపంటను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. ముమ్మరంగా కోతలు కోసి వరిపనలు కుప్పలు పెడుతున్నారు. కొంతమంది రైతులు నూర్పులు చేపట్టి.. బస్తాల్లో ధాన్యం భద్రం చేస్తున్నారు. ఈసారి పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నా.. చివరిలో తుఫాన్‌ గండం నుంచి గట్టెక్కుతామో.. లేదోనని కలవరపడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో వర్షం కురిస్తే అపార నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు.

  • భారీ వర్షాలకు అవకాశం: కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • ‘వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈనెల 18, 19 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన జిల్లా అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు. నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఒడిశాలో వర్షాలు కురిస్తే జిల్లాలో వరదలు వచ్చే ప్రమాదం ఉంది. నీటిపారుదలశాఖ అధికారులు ప్రతీరోజు సాయంత్రం చెరువులు, ప్రాజెక్టులను పరిశీలించాలి. ఇసుక బస్తాలు, గమేళాలు, ఎక్స్‌కవేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. పునరావాస కేంద్రాలు, కంట్రోల్‌ రూమ్‌లలో సిబ్బంది కొరత లేకుండా చూడాలి. ప్రభుత్వ నిల్వల నుంచే నిత్యావసర సరుకులు సరఫరా చేయాలి. 11 మండలాల్లోని మత్స్యశాఖ బోట్లను అవసరమైన చోట సిద్ధం చేయాలి. రహదారులపై విరిగిపడే కొమ్మలు, చెట్లను తొలగించేందుకు ఆర్‌అండ్‌బీ విద్యుత్‌ శాఖ సిద్ధంగా ఉండాలి. తాగునీటి సరఫరాకు ఆటంకం కలుగకుండా జనరేటర్లు సిద్ధం చేయాలి. గర్భిణులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మండల స్థాయిలో అధికారులు తహసీల్దార్లతో సమన్వయంతో పనిచేయాల’ని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో విశ్వేశ్వరరావు, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, మత్స్యశాఖ డీడీ సుమలత, పౌరసరఫరాల అధికారి సూర్యప్రకాష్‌, డీఎంహెచ్‌వో డా.నరేష్‌కుమార్‌, సీపీఓ లక్ష్మీప్రసన్న, విపత్తు నిర్వహణ జేడీ రాము, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలు సత్యనారాయణ, సుధాకర్‌, పి.శంకరబాబు, డీఈవో ఏ.రవిబాబు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 12:19 AM