‘సర్’ సమస్యలు పరిష్కరిస్తారా?
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:13 AM
Challenges in Special Voter Revision ఓటరు జాబితాలో తప్పులను సరి చేసే పనిలో ఎన్నికల కమిషన్ నిమగ్నమైంది. దీనికోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ప్రత్యేక విస్తృత సవరణ) కార్యక్రమం నిర్వహిస్తోంది. దీన్నే ‘సర్’ (ఎస్‌ఐఆర్) అని పిలుస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా బూత్ లెవెల్ అధికారుల (బీఎల్‌వో)కు శిక్షణ ఇచ్చారు. వీరు ఈ నెల 15 (సోమవారం) నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించనున్నారు. అయితే తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనలో కీలకపాత్ర పోషించాల్సిన బూత్‌స్థాయి ఏజెంట్ల(బీఎల్‌ఏ)ను రాజకీయ పార్టీలు ఇంతవరకు నియమించలేదు.
ఇంతవరకు బీఎల్‌ఏలను నియమించని రాజకీయ పార్టీలు
ప్రత్యేక ఓటర్ల సవరణకు ఇబ్బందులు తప్పవా?
జిల్లాలో 58 శాతం వరకే మ్యాపింగ్
నేటి నుంచి ఇంటింటికి వెళ్లనున్న బీఎల్‌వోలు
మెళియాపుట్టి మండలం జలగలింగుపురానికి చెందిన కర్రి రామరావు అనే వ్యక్తి గత పదేళ్ల నుంచి గ్రామంలో ఉంటున్నాడు. గత రెండు ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అంతకుముందు ఈయన హైదరాబాద్‌లో ఉండడంతో ఓటు మ్యాపింగ్ జరగలేదు. 2002 ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంతో ఓటును తొలగిస్తారేమోనని ఆందోళన చెందుతున్నాడు.
మెళియాపుట్టి మండలం మర్రిపాడు(సి) పంచాయతీ పోలింగ్ బూత్-109లో సుమారు 931 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 150 మంది ఓట్లర్లకు సంబంధించి మ్యాపింగ్ కాలేదు. ఇందులో 2002 ఓటరు జాబితాలో పేర్లు లేనివారే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఏమిచేయాలో తెలియక బీఎల్‌వోలు తలలు పట్టుకున్నారు.
మెళియాపుట్టి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాలో తప్పులను సరి చేసే పనిలో ఎన్నికల కమిషన్ నిమగ్నమైంది. దీనికోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ప్రత్యేక విస్తృత సవరణ) కార్యక్రమం నిర్వహిస్తోంది. దీన్నే ‘సర్’ (ఎస్‌ఐఆర్) అని పిలుస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా బూత్ లెవెల్ అధికారుల (బీఎల్‌వో)కు శిక్షణ ఇచ్చారు. వీరు ఈ నెల 15 (సోమవారం) నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించనున్నారు. అయితే తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనలో కీలకపాత్ర పోషించాల్సిన బూత్‌స్థాయి ఏజెంట్ల(బీఎల్‌ఏ)ను రాజకీయ పార్టీలు ఇంతవరకు నియమించలేదు. దీంతో ప్రత్యేక ఓటర్ల సవరణ సమగ్రంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 2,048 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 18,91,665 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సుమారు 9,08,195 మందికి మ్యాపింగ్ జరగలేదు. జిల్లాలో 58 శాతం వరకే మ్యాపింగ్ జరిగింది.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా గతేడాది అక్టోబరు నుంచి ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టారు. 2002 ఓటరు జాబితాతో 2025 ఓటరు జాబితాను సరిపోల్చుతూ ఓటర్లను మ్యాపింగ్ చేస్తున్నారు. గత ఎనిమిది నెలల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇలా మ్యాపింగ్ చేయాలి
2002 జాబితాలో ఉన్న ఓటర్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు.. అదే నియోజకవర్గంలో ఉన్నారా.. వేరే చోటకు మారారా? అనేది పరిశీలిస్తారు. 40 ఏళ్ల వయసు దాటిన వారి పేర్లు 2002 ఓటరు జాబితాలో ఉన్నాయా.. లేదా చూసి మ్యాపింగ్ చేస్తారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. శాశ్వత వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు. ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నవారిని స్థానికులుగా గుర్తించి.. మిగిలిన వారిని వలస ఓటర్లగా భావిస్తారు. వలస ఓటర్లకు ఇతర కేంద్రాల్లో ఓటుహక్కు ఉన్నట్లయితే ఆ వివరాలునూ సేకరించాలి. పాత జాబితాలో పేరు ఉండి ప్రస్తుతం జాబితాలో లేని వారి వివరాలు సైతం నమోదు చేస్తారు. ‘సర్’ ప్రక్రియ కోసం బూత్ లెవల్ అధికారులుగా అత్యధికంగా గ్రామ, వార్డు, స్వర్ణ పంచాయతీల సిబ్బంది, వీఆర్‌వోలను నియమించారు. నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారులు (ఈఆర్వోలు)గా జిల్లాస్థాయి అధికారులను నియమించారు.
నేటి నుంచి ఓటర్ల సవరణ సర్వే: కలెక్టర్
జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ ఇంటింటి సర్వే సోమవారం నుంచి చేపట్టనున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి జూలై 14 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే జరుగుతుంది. ప్రజలు పూర్తి సహకారం అందించాలి. పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్‌లెవెల్ అధికారులు, ఏజెంట్లు, ప్రతీ ఇంటికీ వచ్చి అర్హులైన వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారు. వాటిని సకాలంలో పూర్తిచేసి ఇవ్వాలి. ఓటరు జాబితాలో వివరాలు మ్యాపింగ్ కానివారు, కొత్తగా చేరేవారు ఎన్యూమరేషన్ ఫారంతోపాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను స్వీయ ధ్రువీకరణ చేసి బీఎల్‌వోలకు సమర్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్ల గుర్తింపు కార్డులు, పీపీఓ ఉత్తర్వులు, ఆధార్, పాస్‌పోర్టు, జనన ధ్రువీకరణ పత్రం, విద్యార్హతలు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలలో ఏదో ఒకటి జత చేయాలి. అర్హత గల ప్రతీ పౌరుడు ఓటరుగా నమోదయ్యేలా అధికారులు పని చేయాల’ని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎటువంటి సందేహాలున్నా బీఎల్‌వోలు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలను సంప్రదించాలని తెలిపారు.