Share News

ఈసారీ అంతేనా?

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:07 AM

ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడంతో జీడిమామిడి పంటకు ఊపిరి పోసినట్లయింది.

   ఈసారీ అంతేనా?
మాడిపోతున్న జీడి పూత

- జీడిపంటపై సన్నగిల్లుతున్న ఆశలు

- నల్లగా మారుతున్న పూత

- పొగమంచుతో రైతులకు ఇక్కట్లు

పలాస, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడంతో జీడిమామిడి పంటకు ఊపిరి పోసినట్లయింది. రైతులు ఆశించినట్టుగానే పూత కూడా బాగుంది. తితలీ తుఫాన్‌ తరువాత... దాదాపు ఏడేళ్ల తరువాత తొలిసారిగా జీడి పూత రైతుల్లో ఆశలు రేకెత్తించింది. కానీ ఆ ఆశలపై పొగమంచు నీళ్లు చల్లుతోంది. పొగమంచు కారణంగా జీడి పూత మాడిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే మొత్తం పంటంతా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు బెంగ పడుతున్నారు. అధిక శాతం జీడితోటల్లో పిక్కలు గుత్తులుగా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా దిగుబడి లేక అవస్థలు పడిన రైతులు ఈ ఏడాదైనా ఎంతో కొంత పంటను కళ్ల చూడవచ్చని ఆశతో ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే విదేశీ పిక్కలపై ఆధారపడకుండా మన అవసరాలకు ఉద్దానం పంట సరిపోతుందని భావించారు. ఇంతలో రాత్రంతా పొగమంచు... మధ్యాహ్నం తీవ్ర ఎండ వల్ల జీడి పూవు కాలిపోయినట్లుగా నల్లగా మారి... రాలిపోతోంది. ఈ ప్రాంతంలో వరి పంట బాగా పండితే అదే ఏడాది జీడి కూడా పండుతుందని రైతుల నమ్మకం. సరాసరి ఎకరాకు 80 కిలోల బస్తాలు నాలుగు నుంచి ఆరు వరకు పండుతాయి. 2018 తితలీ తుఫాను ఉద్దానం గతినే మార్చేసింది. మొత్తం జీడి పంటంతా తుఫానుకు కొట్టుకుపోయింది. వేర్లు బయటకు రావడంతో చెట్లు దెబ్బతిన్నాయి. సుమారు రెండేళ్ల నుంచి కొత్త, పాత మొక్కలు కాపుకాసి ఆదాయాన్ని తెస్తున్నాయి. అవి కూడా అంతంతమాత్రంగానే.

విదేశాలపై ఆధార పడాల్సిందేనా?

జిల్లాలో మొత్తం 34వేల హెక్టార్లుల్లో జీడి పంట సాగవుతోంది. ఉద్దానం ప్రాంతంలో ఎర్రనేలల్లో జీడికి అనుకూలంగా ఉండడంతో అధిక శాతం రైతులు దీనిపైనే ఆధారపడుతున్నారు. మరోవైపు ఏటా జిల్లాలో పండే పంట సరిపోకపోవడంతో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి జీడి పిక్కలు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న జీడి పరిశ్రమలకు మన పంట కేవలం 20 శాతం మాత్రమే అందుతోంది. మిగిలిన 80 శాతం పిక్కలను వేర్వేరు మార్గాల ద్వారా రప్పించుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది విడవకుండా పొగమంచు కురుస్తుండడంతో ఉద్దానం జీడి పిక్కలపై వ్యాపారులు ఆశలు పెట్టుకోకుండా ఇతర ప్రాంతాల ద్వారా జీడి పిక్కల కొనుగోలుకు అప్పుడే చర్యలు ప్రారంభించారు. వాస్తవానికి విదేశీ పిక్కల కన్నా ఉద్దానం పిక్కలు మంచి దిగుబడితో పాటు రుచిలో కూడా బాగుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు జిల్లా జీడి పిక్కలు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. గాలి, వెలుతురు ఉన్న జీడితోటల్లో ఎకరాకు 8 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ పొగమంచు దెబ్బకు జీడిపంట పూత దశలోనే రాలుతోంది. ఉద్యానవన శాఖ అధికారులు స్పందించి సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించాలని...పంట దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


మామిడి పంటదీ ఇదే పరిస్థితి..

మెళియాపుట్టి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): పొగమంచు కారణంగా మామిడి పూత కూడా మాడిపోతుంది. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది మంచు కురుస్తుండడంతో చాలాచోట్ల మామిడి చెట్లకు పూత రాలేదు. కొన్ని ప్రాంతాలో పూత వచ్చినా మబ్బులు, మంచు కారణంగా మాడిపోయి రాలిపోతుంది. దీంతో నష్టాలు తప్పేలాలేవని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో దాదాపు 13,172 హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ఇప్పటికే తోటల్లో దుక్కులు చేసేందుకు, ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలు తొలగించేందుకు అధికంగా పెట్టుబడులు పెట్టినట్లు రైతులు చెబుతున్నారు.

నివారణ చర్యలు

తేనె మంచు పురుగు నివారణకు లీటరు నీటిలో 1.5 మి.లీ మోనోక్రోటోపాస్‌ లేదా 2 మి.లీ డైమిధోయేట్‌ కలిపి పూత మొదలయ్యే సమయంలో, పిందెలు తయారయ్యే ముందు చెట్టంతా పిచికారి చేయాలి. మొగ్గ దశలో కనిపిస్తే లీటరు నీటిలో 1.2 మి.లీ బ్యూప్రోఫెజిన్‌- 25 ఎస్‌సీ లేదా 0.3 గ్రాముల ధయోమిధాక్సిమ్‌ కలిపి చల్లాలి. మసికి కారణమైన శిలీంధ్రాల నివారణకు లీటరు నీటిలో 2 మి.లీ హెక్సాకొనజోల్‌ లేదా ప్రొపికొనజోల్‌ కలిపి చల్లాలని ఉద్యావన అధికారులు తెలుపుతున్నారు.

11MLP-7.gifమెళియాపుట్టిలో మామిడి చెట్లకు పూత రాని దృశ్యం

Updated Date - Jan 15 , 2026 | 12:07 AM