పరిశ్రమలకు స‘పోర్ట్’ కుదిరేనా?
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:37 PM
రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా చర్యలు చేపడుతోంది.
- ఇప్పటివరకు ఎనిమిది కంపెనీల ప్రతినిధుల పరిశీలన
- వచ్చారు.. చూశారు.. వెళ్లారు
-ఏర్పాటుపై మాత్రం కానరాని ఆసక్తి
టెక్కలి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనులు శరవేగంగా చేపడుతోంది. ఈ పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఎనిమిది కంపెనీల ప్రతినిధులు దఫాదఫాలుగా వచ్చి.. ఈ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. కానీ ఇప్పటివరకూ పరిశ్రమల ఏర్పాటుకు మాత్రం ఆసక్తి చూపకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.
- వైసీపీ హయాంలో 2023 ఏప్రిల్ 19న మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనులకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ, 25 శాతం కూడా పనులు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. రానున్న జూన్ నాటికి షిప్‌ల రాకపోకలు ప్రారంభించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 75 శాతానికిపైగా పనులు పూర్తిచేసింది. కాగా, పోర్టుకు దగ్గరగా సంతబొమ్మాళి మండలంలో పలు పరిశ్రమలు ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ఇప్పటివరకు అమెరికాతోపాటు మరిన్ని ఎంఎన్‌పీ కంపెనీల ప్రతినిధులు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. వారికి రెవెన్యూ, ఏపీ మారిటైంబోర్డు, పోర్టు అధికారులు.. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అయితే ఈ ప్రాంతం పరిశీలించిన ఒకటి, రెండు కంపెనీలు మినహా మిగిలిన కంపెనీలన్నీ ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఈ ప్రాంతాలను పరిశీలించిన పలు కంపెనీలు రాష్ట్రంలోని దుగ్గిరాజుపాలెం, రామయ్యపట్నం, నెల్లూరు జిల్లాలోని ఓ జెట్టీ ప్రాంతం పరిధిలో మూడు వరకు పరిశ్రమలు నెలకొల్పేందుకు లైన్‌క్లియర్ అయింది.
- వాస్తవానికి పోర్టుకి అతి దగ్గరగా సమీర్‌పేట లాజిస్టిక్స్‌కు చెందిన 1,800 ఎకరాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది. దాని చుట్టుపక్కల పరిశ్రమలకు అవసరమైన భూమిని రెవెన్యూ యంత్రాంగం అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. టెక్కలికి దగ్గరగా 220కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, గొట్టాబ్యారేజ్ నుంచి కాలువ ద్వారా నీరు, రోడ్డు, రైలు మార్గాల సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నా ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు మాత్రం ఆయా కంపెనీలు ముఖం చాటేస్తున్నాయి.
పట్టాలెక్కేనా?
మూలపేట పోర్టు చుట్టూ బీపీసీఎల్ సంస్థ, బెంగాళ్‌కు చెందిన హల్దియా పెట్రో కెమికల్స్ సంస్థ మూడువేల ఎకరాల్లో రూ.90వేల కోట్లతో పరిశ్రమలు స్థాపించాలని భావించింది. అలాగే వెయ్యి ఎకరాల్లో పూణేకు చెందిన కళ్యాణి స్టీల్స్, రూ.20వేల కోట్లతో 300 ఎకరాల్లో యామ్నా గ్రీన్ అమోనియా తయారీకి, రెండువేల ఎకరాల్లో రూ.20వేల కోట్ల పెట్టుబడితో మిట్టల్ గ్రూప్, రూ.83,500కోట్ల పెట్టుబడితో 1,250 ఎకరాల్లో పాలిఇథలీన్ పరిశ్రమ నెలకొల్పేందుకు యూఎస్‌ఏకు చెందిన ఎగ్జాంబిల్ సంస్థ ప్రయత్నించింది. అలాగే రెండువేల ఎకరాల్లో పెట్రో కెమికల్స్ ఏర్పాటుకు హెచ్‌ఎంటీఎల్ సంస్థ, మరో రెండువేల ఎకరాల్లో ఫార్మాసూటికల్ ఏర్పాటుకు సంస్థల ప్రతినిధులు వచ్చి పరిశీలించి వెళ్లారు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు పోర్టు పరిసరాల్లో పలు కంపెనీలు ఏర్పాటు చేయించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా ఒకటి, రెండు భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అందుకు అవసరమైన భూములు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.