Share News

చేనేతకు చేయూత దక్కేనా?

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:09 AM

Today is National Handloom Day వ్యవసాయం తర్వాత అతి పెద్దదైన చేనేత రంగం ప్రస్తుతం కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. సరైన ఆదరణ లేక.. ఆశించినస్థాయిలో ఆదాయం రాక నేతన్నత బతుకులు దయనీయంగా మారాయి. ఈ క్రమంలో చాలామంది చేనేత వృత్తిని వీడి.. ప్రత్యామ్నాయ ఉపాధి దిశగా వలసబాట పట్టారు. పాతతరం పెద్దలు మాత్రమే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు.

చేనేతకు చేయూత దక్కేనా?

  • కార్మికుల పరిస్థితి దయనీయం

  • తగ్గిన ఉపాధి, ఆదరణ

  • ప్రత్యామ్నాయం వైపు అడుగులు

  • నేడు జాతీయ చేనేత దినోత్సవం

  • పొందూరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): వ్యవసాయం తర్వాత అతి పెద్దదైన చేనేత రంగం ప్రస్తుతం కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. సరైన ఆదరణ లేక.. ఆశించినస్థాయిలో ఆదాయం రాక నేతన్నత బతుకులు దయనీయంగా మారాయి. ఈ క్రమంలో చాలామంది చేనేత వృత్తిని వీడి.. ప్రత్యామ్నాయ ఉపాధి దిశగా వలసబాట పట్టారు. పాతతరం పెద్దలు మాత్రమే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పొందూరు ఖాదీ నేతన్నల దుస్థితిని తెలుసుకుందాం. జిల్లాలో 39 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం సుమారు 8 సొసై టీలు మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఖాదీకి ప్రసిద్ధిగాంచిన పొందూరు చేనేత రంగంలో కష్టాల్లో పడింది. ఒకప్పుడు పొందూరు చేనేత రంగంలో 20వేల కార్మికులు ఉపాధి పొందేవారు. ప్రస్తుతం సుమారు 6వేల మంది కార్మికులు కొనసాగుతున్నారు. మార్కెట్‌లో మిల్లు వస్ర్తాలు తక్కువ ధరకే దొరుకుతుండడంతో చేనేత వస్ర్తాలకు డిమాండ్‌ తగ్గింది. కాస్తోకూస్తో ఉన్న డిమాండ్‌ను మాస్టర్‌ వీవర్స్‌ సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది చౌకగా దొరికే తమిళనాడు వస్త్రాలను చేనేత వస్త్రాలుగా ముద్ర వేసి అమ్మేస్తున్నారు. మరోవైపు నూలు ధరలు పెరగడం.. మజూరీలు అంతంతమాత్రంగానే ఉండడంతో కుటుంబమంతా కష్టపడినా నెలకు రూ.10వేలు కూడా సంపాదించలేని దుస్థితి నెలకొందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ వృత్తిని విడిచిపెట్టి తాపీమేస్ర్తీలుగా, కర్మాగారాల్లో దినసరి కూలీలుగా, హోటల్స్‌లో సర్వర్‌లుగా పలువురు పనిచేస్తున్నారు. ప్రభుత్వ సహకారం కూడా అంతంతమాత్రమే కావడంతో చేనేత రంగంపై ప్రస్తుత యువత ఆసక్తి చూపడం లేదు.

  • గతమెంతో ఘనం

  • పొందూరు పేరు చెబితేచాలు.. ప్రపంచ ప్రఖ్యాత ఖాదీవస్త్రాలు గుర్తుకొస్తాయి. జాతిపిత మహాత్మాగాంధీ నుంచి సైతం ప్రశంసలు పొందిన ఖాదీ వస్త్రాలకు నేడు డిమాండ్‌ ఉన్నా.. సరైన మజూరీ లేక కార్మికులు తగ్గిపోతున్నారు. తద్వారా ఉత్పత్తి తగ్గిపోతోంది. ఒకప్పుడు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పొందూరు ఖాదీ వస్త్రాలంటే ప్రత్యేక అభిమానం చూపేవారు. నాటితరం హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీరామారావు, జగ్గయ్య, గుమ్మడి ఇతర సినీ ప్రముఖులు ప్రత్యేకంగా పొందూరు వస్త్రాలు తయారు చేయించుకునేవారు. అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యేక అంచుతో పాట్నూలు పంచెలు తయారు చేయించుకునేవారు. ఇప్పటికీ నాగేశ్వరరావు బోర్డరుతో ఉన్న పంచెలకు డిమాండ్‌ ఉంది. అలాగే స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పొందూరు పాట్నూలు షర్టుతో పాటు పొందూరు పంచెలనే ధరించేవారు. చాలామంది నేతలు పొందూరు ఖాదీని వినియోగించేవారు. ప్రస్తుతం ఆ ఆదరణ కొరవడింది. పొందూరు ఖాదీ వస్త్రాలకు కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపునిచ్చినా.. ప్రయోజనం లేకపోతోంది. ఖాదీకి సమాంతరంగా నకిలీ ఖాదీవస్త్రాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. తక్కువ ధరకు లభిస్తున్న నకిలీ ఖాదీ వస్ర్తాలకే డిమాండ్‌ పెరుగుతోంది.

  • పథకాలు కొందరికే

  • పొందూరు ఖాదీ, చేనేత వస్త్రాల తయారీలో నేత కార్మికులతోపాటు వడుకు కార్మికుల పాత్ర మరువలేనిది. కానీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో వడుకు కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం ‘నేతన్న సేవలో’ పథకం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.25వేలు చొప్పున అందజేస్తోంది. కానీ వడుకు కార్మికులకు మాత్రం మొండిచేయి చూపుతోంది. గతంలో ప్రభుత్వాలు రాయితీపై బ్యాంకు రుణాలు, మగ్గాలు, ఇతరత్రా పరికరాలు అందించేవి. చేనేత కార్పోరేషన్‌ ద్వారా విరివిగా రుణాలు కూడా అందేవి. కానీ వైసీపీ హయాంలో ఇవన్నీ నిలిచిపోయాయి.

  • త్రిఫ్ట్‌ పునరుద్ధరణ..

  • టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకూ త్రిఫ్ట్‌ పథకం అమలు చేసింది. ఈ పథకం కింద నేతన్నలు తమకు వచ్చే ఆదాయంలో 8 శాతాన్ని డిపాజిట్‌చేస్తే..దానికి 16 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలుపుతుంది. 90 రోజుల్లో ఆ మొత్తం చేనేత కార్మికుడికి అందుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పథకాన్ని నిలిపివేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పునరుద్ధరించింది. 2015 ఏడాదికి సంబంధించిన త్రిఫ్ట్‌ పథకం మ్యాచింగ్‌ గ్రాంట్‌ను కూటమి ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది. ఈ పథకం వల్ల పెద్దగా లాభం లేకపోవడం.. మ్యాచింగ్‌ గ్రాంట్‌ సక్రమంగా మంజూరుకాకపోవడంతో ‘త్రిఫ్ట్‌’లో చేరేందుకు చేనేత కార్మికులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం స్పందించి చేనేత రంగాన్ని ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.

  • ఆదరణ ఉన్నా.. ప్రయోజనం లేదు

  • పొందూరు ఖాదీతోపాటు చేనేత వస్త్రాలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. కానీ దశాబ్దాలుగా ఈ వృత్తిలో కొనసాగుతున్న వారి జీవనం మాత్రం దుర్భరమే. మజూరీలు ఆశాజనకంగా లేక కుటుంబమంతా కష్టపడినా.. నెలకు రూ.10వేల ఆదాయం కూడా రావడం లేదు. అందుకే ఈ తరం వారసులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ఎంచుకుంటున్నారు.

    - బనిశెట్టి ఆంజనేయులు, చేనేత కార్మికుడు, పొందూరు

Updated Date - Aug 07 , 2026 | 12:09 AM