Share News

‘ధర్మాన’ వ్యూహం బెడిసికొట్టనుందా?

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:10 AM

కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యూహం బెడిసికొట్టనుందా?.

‘ధర్మాన’ వ్యూహం బెడిసికొట్టనుందా?

- వైసీపీ అభ్యర్థులకు ఓటమి తప్పదా?

- ఇప్పటికే గుడ్‌బై చెప్పేసిన అనుచరులు

- పార్టీ మారి కూటమి నుంచి పోటీ

- వైసీపీ పాలనలో అధ్వానంగా నగర రోడ్లు, స్టేడియం

- ఆదిత్యుని ఆలయ అభివృద్ధీ మరచిన వైనం

- చర్చించుకుంటున్న శ్రీకాకుళం నగర ఓటర్లు

శ్రీకాకుళం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యూహం బెడిసికొట్టనుందా?. ఆ పార్టీ కార్పొరేట్‌ అభ్యర్థులు, మేయర్‌ అభ్యర్థికి ఓటమి తప్పదా? అందుకు కర్త, కర్త, క్రియ వైసీపీ మేయర్‌ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి అని ఆమెపై నెపం నెట్టేందుకు ఇప్పటికే సమాధానాలు సిద్ధం చేసుకుంటున్నారా?.. ఒకవేళ ఆయన అనుకున్నట్లు జరిగితే.. తన కుమారుడ్ని సైతం పక్కనబెట్టి.. అనుచరులను వదులుకుని తానే ఒంటిచేత్తో లక్ష్మీదేవిని గెలిపించానని గొప్పలు చెప్పుకోనున్నారా? అంటే అవుననే సమాధానం నగర ప్రజల నుంచి వినిపిస్తోంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్న వేళ ఇప్పుడు ధర్మాన తీరుపైనా, ఆయన వ్యవహారశైలిపైనా, గతంలో అధికారంలో ఉన్నప్పుడు నెలకొన్న పరిస్థితులపైనా అంతటా చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా 2019-2024 కాలంలో వైసీపీ హయాంలో కీలక పదవుల్లో ఉన్న ధర్మాన నగరపాలక సంస్థపై కనీస దృష్టిసారించలేదని, ఇప్పుడు ఏ విధంగా తమ పార్టీ మేయర్‌ అభ్యర్థిని గెలిపించమని అడుగుతారని నగర ప్రజలు చర్చించుకోవడం కనిపిస్తోంది.

రోడ్లు, స్టేడియం, డ్రైనేజీపై నిర్లక్ష్యం..

గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీకాకుళం నగరంలో కనీసం డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దలేకపోయారు. వేలాది మంది నగర ప్రజలు, యువతకు ఉపయోగపడే కోడిరామ్మూర్తి స్టేడియంపై నిర్లక్ష్యం చూపారు. నిధుల మంజూరులోనూ శ్రద్ధ చూపలేదు. నాగావళి నదిలో నిర్మిస్తున్న డైక్‌ ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. మురుగు జలాలు నేరుగా నాగావళిలో కలవకుండా చేపట్టిన నిర్మాణం అర్ధాంతరంగా ఆపేశారు. దీనిపై అప్పట్లో మంత్రిగా ఉన్న ధర్మాన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. నగరంలోని రోడ్లు కూడా అధ్వానంగా ఉండేవి. ప్రధానంగా శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు విస్తరణ ప్రక్రియను రవ్వంత కూడా ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. కూటమి అధికారంలోకి రాగానే తొలివిడత రోడ్లను బాగుచేయించారు. రోడ్ల విస్తరణ కార్యరూపం దాల్చింది. అరసవల్లి ఆదిత్యుని ఆలయం అభివృద్ధి జరిగింది. స్టేడియం నిర్మాణం పట్టాలెక్కుతోంది. శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు, పెద్దపాడు రహదారి విస్తరణ పనులు పూర్తయ్యాయి. నగరంలో సెంట్రల్‌ లైటింగ్‌ కూడా పూర్తయింది. ఈ పనులన్నీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేని ధర్మాన ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేయడాన్ని నగరవాసులు తప్పుబడుతున్నారు. స్థానిక సమస్యలపై కాకుండా నగర ఓటర్లకు ప్రత్యక్షంగా సంబంధంలేని విశాఖపట్నం, అమరావతి అభివృద్ధి వంటి అంశాలను ధర్మాన ప్రస్తావిస్తూ విమర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

దూరమైన అనుచరులు

ధర్మాన అనుచరగణం దాదాపు ఆయనకు దూరమైంది. నగరపాలక సంస్థ ఎన్నికల ప్రకటన వెలువడిన కొద్దిరోజుల్లోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి భారీఎత్తున టీడీపీలో చేరారు. ఇందులో అధికమంది టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి బీఫారాలు పొంది కార్పొరేటర్లగా పోటీ చేస్తున్నారు. మేయర్‌ సీటు ఆశించిన వైసీపీ నాయకురాలు ఎంవీ పద్మావతికి ధర్మాన మొండిచేయిచ్చారు. పద్మావతి కుటుంబం రెండు కార్పొరేటర్‌ స్థానాల్లో పోటీ చేస్తుంది. కొంతమంది వైసీపీ నేతలు పోటీచేస్తే ఓటమి తథ్యం అని ముందుగానే భావించి దూరంగా ఉంటున్నారు.

ఆ ఎన్నికల్లో వ్యూహం ఏమైనట్టో?

నగరపాలక సంస్థ ఎన్నికల్లో తన వ్యూహం కచ్చితంగా ఫలిస్తుందని ధర్మాన వైసీపీ కార్పొరేటర్ల అభ్యర్థుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. వ్యూహం అమలులో దిట్టఅయితే 2024 ఎన్నికల్లో ఆయన ఎందుకు ఓడిపోతారు.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌కు ఏకంగా 52,521 మెజార్టీ ఎలా వస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2019లో కూడా లక్ష్మీదేవిపై స్వల్ప ఓట్ల తేడాతో ధర్మాన గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ హయాం నుంచి వైసీపీ వరకు వివిధ పదవుల్లో ఉన్న ధర్మాన శ్రీకాకుళం నగర అభివృద్ధి విషయంలో తన ముద్ర వేసుకోలేకపోయారు. తరచూ ఎనభై అడుగుల రోడ్డు తన హయాంలోనే నిర్మాణం జరిగినట్లు చెప్పుకోవడమే తప్ప అంతకుమించి ఆయన వద్ద జవాబేలేదాయె. ఇవన్నీ ఇప్పుడు కూటమి అభ్యర్థులకు ఆయుధమయ్యాయి. ధర్మాన వ్యూహం బెడిసికొట్టడం ఖాయమని జనాలు చర్చించుకుంటున్నారు.

Updated Date - Nov 23 , 2026 | 12:10 AM