భీమసముద్రం గెడ్డ బాగుపడేనా?
ABN , Publish Date - May 13 , 2026 | 11:28 PM
నియోజకవర్గ పరిధిలోని భీమసముద్రం గెడ్డ గత కొన్నేళ్లుగా నిర్వహణకు నోచుకోవడం లేదు.
-పూడిక, చెత్తతో అధ్వానంగా ఉన్న వైనం
- నిర్వహణ లేక ఏటా వర్షాకాలంలో కష్టాలు
-ముంపుబారిన పంట పొలాలు
- బాగు చేయాలని రైతుల విజ్ఞప్తి
ఇచ్ఛాపురం, మే 13 (ఆంధ్రజ్యోతి):నియోజకవర్గ పరిధిలోని భీమసముద్రం గెడ్డ గత కొన్నేళ్లుగా నిర్వహణకు నోచుకోవడం లేదు. దీంతో గెడ్డలో పూడిక, చెత్త పేరుకుపోయి అధ్వానంగా మారింది. దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలూ గెడ్డ పొంగి పొలాల మీద పడుతుంటుంది. ఏటా ఇదే సమస్య. ఆ సమయంలో రైతులు పడే బాధలు వర్ణనాతీతం. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో గ్రామాల రైతులు చిగురుటాకులా వణికిపోతారు. భీమసముద్రం గెడ్డ ఒడిశా కొండల్లో పుట్టి ముచ్చింద్ర, కేదారిపురం, బెన్నుగానిపేట, బాలకృష్ణాపురం, మునిభద్ర, మండపల్లి మీదుగా రత్తకన్నకు చేరుతుంది. ఆపై బాహుదా నదిలో కలిసి సముద్రంలో చేరుతుంది. వర్షాకాలంలో ఒడిశా కొండపై నీరు, పైప్రాంతాల్లో నీరు కలిసి ఈ గెడ్డలో ప్రవహిస్తుంది. కానీ, గెడ్డ బాగోలేకపోవడంతో నీటి ప్రవాహ గమనం మారుతోంది. పొలాలపై సాగునీరు ప్రవహించి పంటకు నష్టం వాటిల్లుతోంది. ఈ గ్రామాల్లో దాదాపు 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. గెడ్డలో సాధారణ స్థాయిలో నీటి ప్రవాహం ఉంటే ఫర్వాలేదు. కానీ వర్షాకాలం, వరదల సమయంలో మాత్రం వరి పొలాలపై నీరు విరుచుకుపడుతుంది.
కాలువలు సరిగ్గా లేక..
వాస్తవానికి గెడ్డ పరివాహక ప్రాంతాల్లో చెరువులకు వెళ్లే కాలువలు సరిగ్గా లేవు. కేదారిపురం నుంచి రత్తకన్న వరకూ దాదాపు 12 చెరువులు ఉంటాయి. ఈ కాలువలను బాగుచేస్తే చెరువులకు నీరు మళ్లించవచ్చు. ఖరీఫ్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. తేలుకుంచి, రత్తకన్న, మండపల్లి పొలాలకు ముంపుబారి నుంచి తప్పించవచ్చు. అంటే రెండు రకాల ప్రయోజనాలున్నాయన్న మాట. వరద ఉధృతిని తగ్గించడం, చెరువుల ద్వారా నీటిని సక్రమంగా పంట పొలాలకు తరలించడం అన్నమాట. కాలువలను బాగుచేయడం ద్వారా బాలకృష్ణాపుం, మునిభద్ర, డెప్పూరు తదితర గ్రామాల్లో భూగర్భ జలాలను పెంపొందించవచ్చు. ఏటా ఈ గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంటుంది. అదే సమయంలో ఖరీఫ్‌లో సాగునీటికి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. అందుకే భీమసముద్రం గెడ్డ విషయంలో కూటమి ప్రభుత్వం చొరవచూపాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ చొరవచూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏటా అవే ఇబ్బందులు
ఏటా ఈ గెడ్డతో మాకు ఇబ్బందులు తప్పవు. వర్షాలు, వరదల సమయంలో వందలాది ఎకరాలను ముంచేస్తుంది. గెడ్డ నిర్వహణ లేకపోవడంతో పూర్తిగా పాడైంది. అందుకే నీటి ప్రవాహం సరిగ్గా ఉండదు. ఆ సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద పొలాలపై పడుతోంది. కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలి.
- జగన్, రైతు, రత్తకన్న
అధికారులకు విన్నవించినా..
గెడ్డ ఉందన్న మాటే కానీ.. నీరు మాత్రం పొలాల మీదుగా పారుతోంది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చాలాసార్లు అధికారులకు విన్నవించాం. కానీ ఎటువంటి చర్యలు లేకుండా పోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. గెడ్డను ఆధునీకరించాలి. గెడ్డలో ఉన్న చెత్త పూడికను తొలగించే ఏర్పాట్లు చేయాలి.
-బోరుబద్ర లోహిదాస్, రైతు, బాలకృష్ణాపురం
ప్రతిపాదనలు పంపించాం..
భీమసముద్రం గెడ్డ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సుమారు రూ.43 లక్షలతో ప్రతిపాదనలు పెట్టాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే పనులు యుద్ధ ప్రతిపాదికన చేయిస్తాం. ఖరీఫ్‌లో సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం.
- మధుసూదన పాణిగ్రహి, ఇరిగేషన్ ఏఈ, ఇచ్ఛాపురం