Share News

ఆగస్టు ఆదుకుంటుందా?

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:05 AM

55.76 percent rainfall deficit in srikakulam ఎల్‌నినో ప్రభావం అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తున్నాయి. జిల్లాలో ఎక్కడా వర్షాలు లేక ఖరీఫ్‌ సాగు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

ఆగస్టు ఆదుకుంటుందా?
శ్రీపురంలో ఎండిపోయిన వరి వెదసాగు, గురువారం రాత్రి శ్రీకాకుళంలో కురిసిన వర్షం

  • జూన్‌ నుంచి ఇప్పటివరకు 55.76 శాతం లోటు వర్షపాతం

  • ప్రాజెక్టుల ద్వారా సక్రమంగా అందని సాగునీరు

  • మందకొడిగా ‘ఖరీఫ్‌’ పనులు.. ఆందోళనలో రైతులు

  • శ్రీకాకుళం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తున్నాయి. జిల్లాలో ఎక్కడా వర్షాలు లేక ఖరీఫ్‌ సాగు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆగస్టు నెలలోనూ వర్షాలు కురవకపోవడం.. ప్రాజెక్టుల ద్వారా కూడా సక్రమంగా సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. వంశధార ప్రాజెక్టు నుంచి కాలువలకు నీరు విడిచిపెడుతున్నా.. పూర్తిస్థాయిలో శివారు భూములకు చేరడం లేదు. నారాయణపురం, తోటపల్లి ప్రాజెక్టుల ఆయకట్టు పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. కాలువల్లో చుక్కనీరు పారకపోవడం, బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో నారుమడులు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జిల్లాలో అక్కడక్కడా వర్షం కురిసింది. దీంతో ఆగస్టు నెల అయినా ఆదుకుంటుందా? అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

  • లోటు వర్షపాతం

  • జిల్లాను వర్షాభావం వెంటాడుతోంది. జూన్‌ 1 నుంచి ఈ నెల 6 వరకు జిల్లావ్యాప్తంగా 345.9 మి.మీ వర్షపాతం నమోదు కావాలి. కానీ ఇప్పటి వరకు 153.04 మి.మీ మాత్రమే వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 55.76 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

  • పోలాకి మండలంలో అత్యల్పంగా కేవలం 48.2 మి.మీ మాత్రమే వర్షం కురిసింది. ఏకంగా 85.55 శాతం లోటు. నందిగాంలో 55.5 మి.మీ (84.61 శాతం లోటు), పొందూరులో 56.9 మి.మీ. (82.91 శాతం లోటు), గార లో 51.5 మి.మీ (82.44 శాతం లోటు) వర్షపాతం నమోదైంది.

  • జిల్లాలోని 30 మండలాల్లో సుమారు 14 మండలాలు తీవ్ర వర్షాభావం పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. లావేరు మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక్కడ 281.5 మి.మీ.కి గాను 231.8 మి.మీ వర్షం కురిసింది. (కేవలం 17.66 శాతం లోటు).

  • కొత్తూరు మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 326.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే హిరమండలంలో 272.1 మి.మీ, సరుబుజ్జిలిలో 271.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని మండలాల్లోనూ వర్షాలు ముఖం చాటేశాయి. గురువారం పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రైతులు ఆశలు కాస్త చిగురించాయి.

  • కరుణించిన వరుణుడు

  • జిల్లాలో గురువారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకూ ఎండతీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షం కురిసింది. గురువారం రాత్రి 9 గంటల సమయానికి నమోదైన వర్షపాతం పరిశీలిస్తే.. జిల్లాలో అత్యధికంగా సరుబుజ్జిలిలో 46.25 మి.మీ. వర్షం కురిసింది. బూర్జలో 39.28, ఎచ్చెర్లలో 30.75, శ్రీకాకుళంలో 26.5, మందసలో 16.25, ఆమదాలవలసలో 16.0, పలాసలో 15.75, లావేరులో 15.5, కంచిలిలో 13.75, సోంపేటలో 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు, రైతులు ఉపశమనం పొందారు. ఇదేరీతిన అడపాదడపా వర్షాలు కురిస్తే ఖరీఫ్‌ సీజన్‌ గట్టెక్కవచ్చని రైతులు భావిస్తున్నారు.

Updated Date - Aug 07 , 2026 | 12:05 AM