Share News

చీపురుపట్టి.. చెత్త తొలగించి..

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:36 AM

Swrna andhra- swachha andhra Programme కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు చీపురుపట్టి.. ఎక్స్‌కవేటర్‌ ఎక్కి చెత్తను తొలగించారు. ఇటీవల వినాయక చవితి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో అపరిశుభ్రతను చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన శనివారం స్వయంగా రంగంలోకి దిగారు.

చీపురుపట్టి.. చెత్త తొలగించి..
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో చెత్తను సేకరిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో కేంద్రమంత్రి రామ్మోహన్‌

ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో కార్యక్రమం

జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం

ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినులు

శ్రీకాకుళం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు చీపురుపట్టి.. ఎక్స్‌కవేటర్‌ ఎక్కి చెత్తను తొలగించారు. ఇటీవల వినాయక చవితి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో అపరిశుభ్రతను చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన శనివారం స్వయంగా రంగంలోకి దిగారు. ఉమెన్స్‌ కాలేజీ వేదికగా ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని అధికారులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కళాశాల ప్రాంగణం శుభ్రంగా, పచ్చదనంతో ముస్తాబు కావాలన్నారు. ఇందులోభాగంగా ప్రభుత్వం ప్రతినెలా మూడో శనివారం చేపడుతున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాల లో శనివారం నిర్వహించారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ప్రాంగణంలో చెత్తను తొలగించారు. ఎక్స్‌కవేటర్‌ ఎక్కి చెత్తను తరలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారితో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌, జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి తదితరులతో కలిసి మంత్రి ఈ శ్రమదానంలో పాల్గొన్నారు.

‘నగర సేవ’ యాప్‌ ఆవిష్కరణ

నగరంలో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ అధికారులు రూపొందించిన ‘నగర సేవ’ యాప్‌ను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. పారిశుధ్య ఇబ్బందులు ఎదురైతే ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ హరిఓం పాండ్య, మున్సిపల్‌ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 12:36 AM