Share News

ఈసారి ఎందుకయ్యామో!

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:00 AM

Sarpanchs' term ends tomorrow సర్పంచుల నిధులు, విధులను లాక్కున్న వైసీపీ సర్కారు వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. ప్రజలు అడిగిన పనులు చేయలేక.. వారికి ముఖం చూపలేక సర్పంచులు ఇబ్బందిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాకే కొంతవరకూ పనులు చేయించగలిగారు. గురువారంతో సర్పంచ్‌ల పదవీ కాలం ముగియనుంది.

ఈసారి ఎందుకయ్యామో!

  • పంచాయతీ సర్పంచ్‌ల ఆవేదన ఇది..

  • రేపటితో వారి పదవీకాలం పూర్తి

  • వైసీపీ హయాంలో ఉత్సవవిగ్రహాలుగా..

  • కూటమి వచ్చిన తరువాతే పనులు

  • రణస్థలం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): సర్పంచుల నిధులు, విధులను లాక్కున్న వైసీపీ సర్కారు వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. ప్రజలు అడిగిన పనులు చేయలేక.. వారికి ముఖం చూపలేక సర్పంచులు ఇబ్బందిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాకే కొంతవరకూ పనులు చేయించగలిగారు. గురువారంతో సర్పంచ్‌ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో ఎందుకు సర్పంచులం అయ్యామా? అన్న బాధ వారిని వెంటాడుతోంది.

  • వలంటీరు వ్యవస్థతో నిర్వీర్యం

  • వైసీపీ హయాంలో వలంటీరు వ్యవస్థతో గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. సచివాలయాలు పంచాయతీల్లో అంతర్భాగమేనని తొలుత వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. 2021లో పంచాయతీ ఎన్నికలు జరిగిన తరవాత పరిస్థితి తారుమారైంది. సచివాలయ ఉద్యోగుల విధులు, వారి సెలవులు వంటి పర్యవేక్షణ బాధ్యతల నుంచి పంచాయతీలను తప్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖను సృష్టించి అజమాయిషీ చేసింది. గ్రామాభివృద్ధిలో కేంద్రం అందించే ఆర్థిక సంఘం నిధులు కీలకం. జిల్లాలో 927 పంచాయతీలున్నాయి. జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు ఉంటుంది. సగటు ఒక పౌరుడికి రూ.400 చొప్పున లెక్కకట్టి ప్రభుత్వం కేటాయిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నిధులు పక్కదారి పట్టాయి. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి తొలివిడతగా నిధులు మంజూరయ్యాయి. చిన్నా,పెద్ద పంచాయతీలు లెక్క కట్టి నిధులు విడుదల కాగా వెంటనే విద్యుత్‌ చార్జీల కింద అప్పటి ప్రభుత్వం జమ చేసుకుంది. అటు రెండో విడత ఆర్థిక సంఘం నిధులు సైతం అదే పరిస్థితి. చివరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్థిక సంఘం నిధులకు మోక్షం కలిగింది. నేరుగా పంచాయతీలకు జమ అయ్యాయి.

  • పదవులెందుకు?

  • తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతులు కూడా వైసీపీ హయాంలో కల్పించలేకపోయాం. ఆ ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఆర్థిక సంఘం నిధులతో గట్టెక్కుతామంటే దారి మళ్లించింది. కనీసం మా సంతకాలు, ఆమోదం లేకుండా ఈ తతంగం పూర్తిచేసింది. సంతృప్తి లేకుండా పదవీకాలం ముగిసింది.

    - సింకు భవాని, సర్పంచ్‌ పైడిభీమవరం

  • ప్రజల నుంచి నిలదీతలు

  • వీధుల్లో నడిచి వెళుతున్నప్పుడు ప్రజలు నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియకపోయేది. అప్పట్లో వలంటీర్లకు ఉన్న గౌరవం కూడా మాకు ఉండకపోయేది. కూటమి వచ్చిన తరువాత ఆర్థిక సంఘం నిధులు, పల్లెపండుగ నిధులతో పనులు చేయించాం.

    -కొన్ని హేమసుందరరావు, పెద్దరావుపల్లి సర్పంచ్‌, లావేరు మండలం

  • హక్కులను కాలరాశారు

  • ప్రజలకు ఎన్నో చేయాలని కలలుకన్నాం. వైసీపీ ప్రభుత్వం అస్సలు సహకరించ లేదు. మాపై సచివాలయ, వలంటీరు సమాంతర వ్యవస్థను తెచ్చి గౌరవం లేకుండా చేసింది. నిధుల కేటాయింపులు నిలిపివేసింది. కేంద్రం నుంచి వస్తున్న నిధులను పక్కదారి పట్టించింది.

    - బాలి శ్రీనివాసరావు, వేల్పురాయి సర్పంచ్‌, రణస్థలం

  • దారుణ వంచన ఇది

  • నాడు జగన్మోహన్‌రెడ్డి చెప్పినదేమిటి? చేసింది ఏమిటి? గ్రామాలే అభివృద్ధికి పట్టుకొమ్మలని సచివాలయ వ్యవస్థ ప్రారంభంనాడు చెప్పుకొచ్చారు. సచివాలయాలు వచ్చినా పంచాయతీల ప్రాధాన్యం పోనివ్వనని మాటిచ్చారు. కానీ పూర్తిగా పంచాయతీలను నిర్వీర్యం చేశారు. సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. కూటమి వచ్చిన తరువాత మాత్రమే కాస్తా తల ఎత్తుకున్నాం.

    - పిన్నింటి వెంకటభానోజీరావు, రణస్థలం సర్పంచ్‌, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు

Updated Date - Apr 01 , 2026 | 12:00 AM