పదోన్నతుల్లో జాప్యమెందుకు?
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:24 AM
Health Secretaries' protest జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయాన్ని సోమవారం రాత్రి హెల్త్ సెక్రటరీలు ముట్టడించారు. పదోన్నతుల విషయంలో ఫైల్ కదపడంలేదని.. దీంతో డీఎంహెచ్‌వో కార్యాలయంలో తప్పిదాలు జరుగుతున్నాయంటూ ధర్నాకు దిగారు.
హెల్త్ సెక్రటరీల ధర్నా
డీఎంహెచ్‌వో కార్యాలయం ముట్టడి
శ్రీకాకుళం/ క్రైమ్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయాన్ని సోమవారం రాత్రి హెల్త్ సెక్రటరీలు ముట్టడించారు. పదోన్నతుల విషయంలో ఫైల్ కదపడంలేదని.. దీంతో డీఎంహెచ్‌వో కార్యాలయంలో తప్పిదాలు జరుగుతున్నాయంటూ ధర్నాకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో 605 మంది హెల్త్ సెక్రటరీలు ఉన్నారు. ఇందులో సుమారు 154 మందికి రోస్టర్ ప్రాతిపదికన పదోన్నతులు వర్తించాల్సి ఉంది. గతేడాది నవంబరు 31న ప్రమోషన్ల జాబితాను సిద్ధం చేసి.. కలెక్టర్ నుంచి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అనుమతి పొందింది. కానీ ఆ ఫైల్‌పై ఢిల్లీలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్దకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో ఉన్నతస్థాయి కమిటీని నియమించి సమగ్ర విచారణ చేసింది కమిషన్. అర్హులందరికీ పదోన్నతులు ఇచ్చేయాలని ఆదేశించింది. ఇదే విచారణ కమిటీ ముందు జిల్లా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది హాజరయ్యారు కూడా. గత నెల 17న విచారణ పూర్తయినా.. ఇంతవరకు ప్రమోషన్ల విషయం కాలయాపన చేస్తుండటంతో హెల్త్‌కార్యదర్శిలు ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రి నిరసన చేపట్టి డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రమోషన్ల ఫైల్‌ను క్లియర్ చేసి.. న్యాయం చేసేవరకూ తాము ఇక్కడనుంచి వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పారు. పోలీసులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.
ఈ సందర్భంగా విలేకర్లతో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత మాట్లాడారు. ‘‘జిల్లావ్యాప్తంగా 154 మంది ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఒరిజినల్ రిక్రూట్‌మెంట్ లిస్ట్ గల్లంతైంది. ఆ రిక్రూట్‌మెంట్ జరిగిన సమయంలో నేను కానీ, ప్రస్తుతం పనిచేస్తున్న ఆఫీసు సిబ్బంది కానీ విధుల్లో లేము. ఆ జాబితా కోసం అప్పట్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టిన వారికి డిపార్ట్‌మెంట్ తరఫున అధికారికంగా లెటర్ పంపాం. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం ఫైల్ ప్రాసెస్‌లో ఉంది. కలెక్టర్‌తోపాటు రాష్ట్రస్థాయి అధికారులు కూడా చర్చిస్తున్నారు. ఈ అంశం పూర్తిగా ఎస్టీ కమిషన్ దృష్టిలో ఉంది. ఎవరైనా సరే అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఆతర్వాతే ముందుకు వెళ్లగలమ’ని స్పష్టం చేశారు.