Share News

డీలర్లకు ఇంతవరకు సరుకులు పంపించలేదేం?

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:07 AM

‘గోదాం నుంచి డీలర్లకు సరుకులు ఎందుకు పంపించలేదని’ సంబంధిత ఇన్‌చార్జిని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రశ్నించారు. గోదాం సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీలర్లకు ఇంతవరకు సరుకులు పంపించలేదేం?
రికార్డులను పరిశీలిస్తున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

జలుమూరు, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ‘గోదాం నుంచి డీలర్లకు సరుకులు ఎందుకు పంపించలేదని’ సంబంధిత ఇన్‌చార్జిని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రశ్నించారు. గోదాం సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎం.ఎల్‌.ఎస్‌. పాయింటును జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. నిర్వహణ సిబ్బంది పనితీరు బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గోదాం ఇన్‌చార్జి కోటేశ్వరరావుకు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ కుమార్‌రాజుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. గోదాం నుంచి నేటి వరకు డీలర్లకు సరుకులు ఎందుకు పంపించలేదని నిలదీశారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు జలుమూరు మండలంలో 2,400 మంది, సారవకోటలో 1,280 మంది ఉన్నారన్నారు. వీరందరికి ఈనెల 25 నుంచి నిత్యావసర సరుకులు అందించాల్సి ఉంది. కానీ నేటి వరకు సరుకులు పంపించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌వో కాపీలు ఇంతవరకు ఎంఎల్‌ఎస్‌ పాయింటుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సంబందిత డీఎంతో ఫోన్‌లో మాట్లాడారు.

వే బ్రిడ్జి పని చేయడం లేదని...

గోదాం వద్ద ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి ఎందుకు పనిచేయడం లేదని జేసీ ప్రశ్నించారు. వే బ్రిడ్జి బాగుచేయించే బాధ్యతను గోదాం ఇన్‌చార్జి తీసుకోవాలని ఆదేశించారు. ఖాళీ గోనె సంచులు తిరిగి ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. గత 6 నెలలుగా గోదాం నిర్వహణఖు ఎంత ఖర్చు చేశారని ఆయన ప్రశ్నించారు. కళాసీలకు పూర్తిస్థాయిలో పనికల్పించాలని సూచించారు. సీజ్‌ చేసిన సరుకులు ఎందుకు ఇంతవరకు వేలం వేయకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఈ పరిశీలనలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ జాఫర్‌ షరీఫ్‌, ఆర్‌.ఐ. జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:07 AM